




Best Web Hosting Provider In India 2024

ఏపీలోని రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్, జూన్ 30 వరకు ఈ-కేవైసీ గడువు పొడిగింపు
ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్ కార్డు ఈ-కేవైసీ గడువును జూన్ 30, 2025 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ గడువులోపు రేషన్ డీలర్లు, ఎండీయూ వాహనాల వద్ద ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్ కార్డ్ ఈ-కేవైసీ గడువును మరో రెండు నెలలు పెంచింది. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు ఏప్రిల్ 30తో రేషన్ కార్డు ఈ-కేవైసీ గడువు ముగియగా…తాజాగా ఏపీ ప్రభుత్వం ఈ గడువును జూన్ 30, 2025 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ
కొత్త రేషన్ కార్డుల జారీపై కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం….అనర్హుల ఏరివేత లక్ష్యంగా ఈ కేవైసీ ప్రక్రియను మొదలుపెట్టింది. ఇందుకోసం ఏప్రిల్ 30, 2025 వరకు గడువును విధించింది. అయితే ఏప్రిల్ 30 దాటినప్పటికీ చాలా జిల్లాల్లో ఈ-కేవైసీ ప్రక్రియ ముందుకు సాగలేదు. పలు కారణాలతో ప్రజలు ఈ-కేవైసీ పూర్తి చేయడంలో జాప్యం జరిగింది.
జూన్ 30 వరకు గడువు
ఇంకా రేషన్ కార్డు ఈ-కేవైసీని పూర్తి చేసుకోని వారికి ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఈ-కేవైసీ గడువును జూన్ 30వ తేదీ వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆ గడువులోగా ఈ-కేవైసీ పూర్తి చేయాలని స్పష్టం చేసింది.
అనర్హుల ఏరివేత
రేషన్ కార్డుదారుల్లో అనర్హులను ఏరివేయడంతో పాటు రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా చూసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ-కేవైసీ ప్రక్రియను తీసుకువచ్చాయి. ఇందుకోసం ఈ ఏడాది జనవరి నుంచి ఈ-కేవైసీ ప్రక్రియ మొదలుపెట్టాయి. ఈ-కేవీసీ పూర్తి చేసుకునేందుకు ఏప్రిల్ 30 వరకు గడువు విధించింది ప్రభుత్వం.
రేషన్ డీలర్లు, ఎండీయూ వాహనాల వద్ద
ఈ గడువులోపు ఈ-కేవైసీ పూర్తి చేయకపోతే రేషన్ నిలిపివేస్తామని అధికారులు ప్రకటించారు. రేషన్ డీలర్లు, ఎండీయూ వాహనాల వద్ద ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసేందుకు అవకాశం కల్పించారు.
అయితే బయోమెట్రిక్ తో పాటు ఇతర కారణాల వల్ల చాలా మంది ఈకేవైసీని పూర్తి చేయలేకపోయారు. వీరిని దృష్టిలో పెట్టుకుని రెండు నెలల పాటు గడువును మరోసారి పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
జూన్ నుంచి మరిన్ని సరుకులు
ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు జూన్ నుంచి ఉచిత బియ్యంతో పాటు సబ్సిడీ ధరకు కందిపప్పు, రాగులు పంపిణీ చేయనుంది. పేదలందరికీ పోషకాహారం, ఆర్థిక సౌలభ్యం అందించేందుకు రేషన్ దుకాణాల్లో బియ్యంతో పాటు ఇతర సరుకులు అందించేందుకు చర్యలు చేపట్టింది.
ఉచిత బియ్యం, పంచదార
ఏపీలో రేషన్ కార్డుదారులకు నెలకు ఒక్కో వ్యక్తికి 5 కిలోల బియ్యం ఉచితంగా అందిస్తున్నారు. కరోనా సమయం నుంచి కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యం అందిస్తోంది. నలుగురు కుటుంబ సభ్యులున్న కుటుంబానికి గరిష్టంగా 20 కిలోల వరకు బియ్యం అందిస్తున్నారు. ఉచిత బియ్యంతో పాటు ఒక కిలో పంచదార రూ.20 అందిస్తున్నారు. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్ అందిస్తుంది.
పోషకాహార పథకంలో భాగంగా
జూన్ 2025 నుంచి ఏపీలోని రేషన్ షాపుల్లో బియ్యం, పంచదారతో పాటు సబ్సిడీపై కందిపప్పు(కిలో ధర రూ.67) , బియ్యంకు బదులుగా రాగులు ఉచితంగా అందించనున్నారు. ప్రతీ కార్డుదారుడికి ఒక కిలో కందిపప్పు, రెండు కిలోల రాగులు పంపిణీ చేయనున్నారు. కందిపప్పు, రాగులను పోషకాహార పథకం ద్వారా పేద ప్రజలకు అందించనున్నారు. రాగుల ఉత్పత్తిని పెంచేందుకు కూడా ప్రోత్సాహం అందిస్తున్నారు.
కందిపప్పు, రాగుల సేకరణకు టెండర్లు
రాబోయే మూడు నెలలకు సరిపడా కందిపప్పును, ఏడాదికి సరిపడిన రాగులను సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల టెండర్లను ఆహ్వానించింది.
రేషన్‌కార్డుదారులతో పాటు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఐసీడీఎస్ లబ్ధిదారులకు జూన్, జులై, ఆగస్టు నెలలకు సరిపడేలా రూ.500 కోట్ల విలువైన 47,037 టన్నుల కందిపప్పు, రూ.100 కోట్లకు పైగా విలువైన 25 వేల టన్నుల రాగులు, 43,860 టన్నుల పంచదార సేకరణకు ఈ-ప్రొక్యూర్‌మెంట్ విధానంలో ఎన్‌ఈఎంఏల్ పోర్టల్ ద్వారా టెండర్లు ఆహ్వానించింది ప్రభుత్వం.
ఉచిత బియ్యానికి బదులుగా రాగులను పొందే అవకాశం కల్పించనున్నారు. ప్రతి నెలా 20 కిలోల రేషన్ బియ్యం తీసుకునే కుటుంబం రెండు కిలోల రాగులను తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తే, ఆ మేరకు బియ్యం కోటాను తగ్గిస్తారు.
సంబంధిత కథనం
టాపిక్