




Best Web Hosting Provider In India 2024

గరుడ 2.0 రివ్యూ – సీరియల్ కిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ – మలయాళ కల్ట్ సినిమాకు రీమేక్
అరుళ్‌నిధి, ఐశ్వర్యరాజేష్ హీరోహీరోయిన్లుగా నటించిన గరుడ 2.0 ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళం మూవీ మెమోరీస్‌కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? లేదా?అంటే?
సంక్రాంతికి వస్తున్నాం ఫేమ్ ఐశ్వర్య రాజేష్ హీరోయిన్గా నటించిన గరుడ 2.0 మూవీ ఇటీవల డైరెక్ట్‌గా ఆహా ఓటీటీలో రిలీజైంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో అరుళ్‌నిధి హీరోగా నటించాడు. మలయాళం మూవీ మెమోరీస్‌కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఎలా ఉందంటే?
ఆల్కహాలిక్ పోలీస్ ఆఫీసర్…
అరవింద్ (అరుళ్‌నిధి) ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. ధైర్యం, తెలివితేటలతో ఎన్నో కేసులను సాల్వ్ చేస్తాడు. భార్య మియాతో (ఐశ్వర్యరాజేష్) పాటు కూతురు మీనూ చనిపోవడంతో అరవింద్ తాగుడుకు బానిసగా మారిపోతాడు. పోలీస్ జాబ్‌కు లీవ్ పెట్టేసి ఎప్పుడూ బార్లోనే గడుపుతుంటాడు. తిరిగి డ్యూటీలో జాయిన్ అయితేనే అరవింద్ మామూలు మనిషిగా మారుతాడని అతడి తల్లి భావిస్తుంటుంది. సిటీలో కొత్తగా పెళ్లైనా కొందరు యువకులు చనిపోతుంటారు. వారందరిని ఓ సీరియల్ కిల్లర్ దారుణంగా హత్య చేస్తాడు. ఈ కేసును అరవింద్‌కు అప్పగిస్తాడు పోలీస్ కమీషనర్.
ఈ ఇన్వేస్టిగేషన్‌లో అరవింద్ తెలుసుకున్న నిజాలేమిటి? కిల్లర్‌ను అరవింద్ ఎలా కనిపెట్టాడు? సంతోష్ అనే టీచర్‌కు ఈ హత్యలకు ఉన్న సంబంధం ఏమిటి? పీటర్గా తన పేరు మార్చుకొని అతడు ఎందుకు హత్యలు చేస్తున్నాడు? ఆ కిల్లర్ బారి నుంచి తన తమ్ముడు అర్జున్ను అరవింద్ ఎలా కాపాడుకున్నాడు? అరవింద్ భార్య మియా చంపింది ఎవరు? అన్నదే ఈ మూవీ కథ.
మలయాళ రీమేక్…
దృశ్యం ఫేమ్ జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన మలయాళం మూవీ మెమోరీస్ కల్ట్ క్లాసిక్ మూవీగా నిలిచింది. మలయాళంలో బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్‌లో ఒకటిగా పేరు తెచ్చుకున్నది. మెమోరీస్‌కు రీమేక్‌గా గరుడ 2.0 మూవీ రూపొందింది.
సీరియల్ కిల్లర్ మూవీ…
తాగుడుకు బానిసగా మారిన ఓ పోలీస్ ఆఫీసర్…సీరియల్ కిల్లర్ కేసును ఎలా సాల్వ్ చేశాడు అన్నదే గరుడ 2.0 మూవీ కథ. మల్టీలేయర్స్తో ఈ మూవీ సాగుతుంది. ఓ వైపు పోలీస్ ఆఫీసర్ వ్యక్తిగత జీవితంలో ఎదురైన విషాదం, భార్యాపిల్లలు దూరమై అతడు ఎదుర్కొనే సంఘర్షణను చూపించారు. మరోవైపు వరుసగా కొందరు వ్యక్తులను సీరియల్ కిల్లర్ కిడ్నాప్ చేయడం…ఎలాంటి ఆనవాళ్లు లేకుండా ఒకే ప్యాట్రన్‌లో హత్యలు చేసే సీన్స్‌తో ఫస్ట్ హాఫ్ సాగుతుంది. అసలు హత్యలు చేస్తుంది ఎవరు? ఎందుకు చేస్తున్నాడనే ప్రశ్నలు ఆడియెన్స్‌ను మనసులో రేకెత్తిస్తూ సెకండాఫ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. విలన్ ముఖాన్ని చివరి వరకు చూపించకుండా సస్పెన్స్ క్రియేట్ చేశారు.
నెక్స్ట్ ఏం జరుగుతుంది…
అరవింద్ ఇన్వేస్టిగేషన్ సీన్స్ ఆకట్టుకున్నాయి. ఫైట్స్, ఛేజింగ్ లాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ జోలికి పోకుండా నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే టెన్షన్‌ను చివరి వరకు బిల్డ్ చేస్తూ ఒకే టెంపోలో కథను నడిపించాడు. సీరియల్ కిల్లర్ హత్యలు చేసే తీరు ను థ్రిల్లింగ్‌గా రాసుకున్నాడు. చనిపోయిన వ్యక్తులపై అర్థంకానీ భాషలో ఉన్న అక్షరాలు, శుక్రవారం కిడ్నాప్…ఆదివారం హత్య అంటూ హీరోకు సవాల్ విసరడం వరకు సినిమా హైలో సాగుతుంది. ఎప్పుడైతే కిల్లర్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ రివీలవుతుందో అక్కడి నుంచే దర్శకుడు సినిమాపై పట్టుకోల్పోయిన భావన కలుగుతుంది.
ట్విస్ట్ బాగుంది కానీ…
సీరియల్ కిల్లర్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ సిల్లీగా అనిపిస్తుంది. చిన్న విషయానికే అతడు హత్యలు చేయడం కన్వీన్సింగ్‌గా అనిపించదు. చివరలో హీరో తమ్ముడు పాత్రకు సంబంధించిన ట్విస్ట్ బాగున్నా…గెస్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు.
ఇరవై నిమిషా లోపే…
తాగుడుకు బానిసగా మారిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో అరుళ్‌నిధి నటన బాగుంది భిన్న కోణాల్లో సాగే పాత్రలో ఒదిగిపోయాడు. ఐశ్వర్య రాజేష్ పాత్ర సినిమాలో గట్టిగా ఇరవై నిమిషాల లోపే ఉంటుంది. ఓ పాటతో పాటు కొన్ని సీన్స్‌కే పరిమితమైంది. సీరియల్ కిల్లర్ పాత్రలో డైరెక్టర్ గౌరవ్ నారయణన్ యాక్టింగ్ ఒకే.
క్రైమ్ థ్రిల్లర్ లవర్స్ కోసమే…
క్రైమ్, ఇన్వేస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీస్‌ను ఇష్టపడే ఆడియెన్స్‌ను గరుడ 2.0 మెప్పిస్తుంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది.