





Best Web Hosting Provider In India 2024

గిరిజన వివాదంపై క్లారిటీ ఇచ్చిన హీరో విజయ్ దేవరకొండ.. తెగలు, జాతులు, బ్రిటీష్ వర్గీకరణ అంటూ వివరణ!
సూర్య రెట్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో గిరిజనులపై విజయ్ దేవరకొండ చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. ఈ నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియా ద్వారా తన వ్యాఖ్యలపై విజయ్ దేవరకొండ క్లారిటీ ఇచ్చారు. బ్రిటీష్ వర్గీకరణ, జాతులు, తెగలు అంటూ విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు.
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు హీరో విజయ్ దేవరకొండ. ఈ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ మాటల్లో ట్రైబ్ (గిరిజనులు) అనే పదం వచ్చింది. ఈ మాటను కొందరు అపార్థం చేసుకుని హర్ట్ అయ్యారు.
పదం వెనుక ఉద్దేశం
ఈ విషయం తన దృష్టికి రావడంతో విజయ్ దేవరకొండ తన మాటలపై స్పష్టత ఇచ్చారు. ట్రైబ్ అని తను వాడిన పదం వెనక ఉద్దేశం భూమ్మీద తొలినాళ్లలో మనమంతా తెగలుగా, జాతులుగా ఉన్నామని చెప్పడమే. కానీ, అందులో షెడ్యూల్ ట్రైబ్స్ గురించి కాదని విజయ్ దేవరకొండ వివరణ ఇచ్చారు.
ముఖ్య భాగమని
షెడ్యూల్ ట్రైబ్స్ వారిని తాను ఎంతగానో గౌరవిస్తానని, ప్రేమిస్తానని, వారూ మన సమాజంలో ఒక ముఖ్య భాగమని భావిస్తానని విజయ్ దేవరకొండ తాజాగా తన సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెల్లడించారు.
మనోభావాలు దెబ్బతిన్నట్లు
విజయ్ దేవరకొండ స్పందిస్తూ “రెట్రో ఈవెంట్‌లో నేను చేసిన వ్యాఖ్యలు కొందరి మనోభావాలను దెబ్బతీసినట్లు నా దృష్టికి వచ్చాయి. ఆ వ్యాఖ్యలపై క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఏ వర్గాన్నీ, ఏ తెగను గానీ బాధపెట్టడం నా ఉద్దేశం కాదు. వారిని నేను ఎంతో గౌరవిస్తున్నాను” అని అన్నారు.
వివక్ష చూపించలేదు
“భారత దేశంలోని ప్రజలంతా ఒక్కటే అని భావిస్తాను. మనమందరం కలిసికట్టుగా ముందుకు సాగాలి, ఐక్యంగా నిలబడాలని మాట్లాడాను. నేను ఏ సమూహంపై ఉద్దేశపూర్వకంగా ఎప్పుడు కూడా వివక్ష చూపించలేదు. వారందరూ నా కుటుంబ సభ్యులు, నా సోదరులే అని అనుకుంటాను” అని విజయ్ దేవరకొంట తెలిపారు.
శాంతి గురించి మాట్లాడటమే
“నేను చేసిన వ్యాఖ్యల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నాను. శాంతి గురించి మాట్లాడటమే నా ఏకైక లక్ష్యం. చారిత్రక, నిఘంటు దృష్టికోణంలోనే నేను ఆ పదాన్ని ఉపయోగించాను” అని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు.
వందల ఏళ్ల నాటి సమాజం
“వందల ఏళ్ల కిందట సమాజం, ప్రజలు గుంపులుగా వ్యవస్థీకృతమై ఉండేవాళ్లని, మానవ జాతి తొలినాళ్లలో ట్రైబ్స్, క్లాన్స్‌గా ఉండేవాళ్లం. అప్పుడు రెండు వర్గాల మధ్య తరచు సంఘర్షణలు చోటుచేసుకునేవి. ఆ ఉద్దేశంతో ట్రైబ్ అనే మాట వాడాను. అంతేకానీ, ఇప్పుడున్న షెడ్యూల్ ట్రైబ్స్‌ను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు” అని విజయ్ దేవరకొండ క్లారిటీ ఇచ్చారు.
అప్పుడే వర్గీకరణ జరిగింది
“బ్రిటిష్ వారు భారతదేశాన్ని పాలించడం మొదలుపెట్టిన తర్వాత ఇలా వర్గీకరణ అనేది జరిగింది. అలా జరిగి కనీసం 100 సంవత్సరాలు కూడా పూర్తికాలేదు. ఏది ఏమైనా ట్రైబ్ అనే పదం వాడినందుకు ఎవరైనా బాధపడి ఉంటే చింతిస్తున్నాను. శాంతి, పురోభివృద్ధి, ఐక్యత కోసం నా సినిమా మీడియంను ఉపయోగిస్తాను” అని విజయ్ దేవరకొండ వివరణ ఇచ్చారు.
గిరిజనులను అవమానించేలా
ఇదిలా ఉంటే, రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో గిరిజనులు అవమానించేలా విజయ్ దేవరకొండ కామెంట్స్ చేశారంటూ తెలంగాణ ట్రైబల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, న్యాయవాది కిషన్ రాజ్ చౌహాన్, ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆ కామెంట్స్‌పై విజయ్ దేవరకొండ క్లారిటీ ఇచ్చారు.
సంబంధిత కథనం