




Best Web Hosting Provider In India 2024
పల్నాడు జిల్లా మాచర్లలో పోలీసుల కార్డెన్ సెర్చ్.. భారీగా మారణాయుధాలు స్వాధీనం!
పల్నాడు.. చాలా సున్నితమైన జిల్లా. ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గంలో ఎప్పుడూ హైటెన్షన్ వాతావరణం ఉంటుంది. ఇక్కడ ఫ్యాక్షన్ హత్యలు రాష్ట్ర స్థాయిలో సంచలనం సృష్టించాయి. అటు రాజకీయ ఘర్షణలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. 2024 ఎన్నికలకు ముందు.. తర్వాత కూడా పలు హత్యలు జరిగాయి. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.
పల్నాడు జిల్లా మాచర్లలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. పోలీసుల సోదాల్లో పలు ఇళ్లలో భారీగా మారణాయుధాలు లభ్యమయ్యాయి. శిరిగిరిపాడులో వారం కిందట వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో రెండు వర్గాలు దాడులకు సిద్ధమయ్యాని.. పోలీసులకు సమాచారం వచ్చింది. దాడుల కోసం గోతాలలో ఇరు వర్గాలు భారీగా ఆయుధాలు దాచినట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. అనుమానం ఉన్న ఇళ్లలో పోలీసులు తనిఖీలు చేయగా.. కత్తులు, గొడ్డళ్లు, బరిసెలు, ఇనుపరాడ్లు, రాళ్లు, కారం కలిపిన నీళ్లు లభ్యమయ్యాయి.
కారణాలు ఏంటి..
మాచర్ల నియోజకవర్గంలో గతంలో ఫ్యాక్షన్, రాజకీయ హత్యలు జరిగాయి. ఇక్కడ చాలా గ్రామాల్లో వర్గాలుగా విడిపోయి ఘర్షణలకు దిగిన సందర్భాలు ఉన్నాయి. వీటిని కంట్రోల్ చేయడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. నిత్యం అలర్ట్‌గా ఉంటూ.. గ్రామాల్లో శాంతిని నెలకొల్పే ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ.. ఇటీవల రాజకీయ కారణాలతో.. గొడవలు మరింత పెరుగుతున్నాయి.
రాజకీయ కారణాలు..
మాచర్లలో రాజకీయ పార్టీల మధ్య తీవ్రమైన పోటీ ఉంది. ఈ పోటీ తరచుగా హింసాత్మక ఘర్షణలకు దారితీస్తుంది. రాజకీయ నాయకులు తమ అధికారాన్ని నిలుపుకోవడానికి.. ఫ్యాక్షన్ శక్తులను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రాజకీయ పార్టీల మధ్య ఆధిపత్య పోరు, ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలనే తపన కూడా ఫ్యాక్షన్ రాజకీయాలకు కారణమవుతోందనే వాదన కూడా ఉంది.
సామాజిక కారణాలు..
పల్నాడు ప్రాంతంలో బలమైన కుల వ్యవస్థ ఉంది. కులాల మధ్య వైషమ్యాలు ఫ్యాక్షన్ రాజకీయాలను మరింత తీవ్రతరం చేస్తున్నాయి. భూమి, నీరు వంటి వనరుల కోసం జరిగే వివాదాలు కూడా ఫ్యాక్షన్ ఘర్షణలకు దారితీస్తున్నాయి. గతంలో జరిగిన సంఘటనలు, వాటిపై ప్రతీకారాలు తీర్చుకోవాలనే తపనలు కూడా ఫ్యాక్షన్ రాజకీయాలకు కారణం అవుతున్నాయి.
చారిత్రక నేపథ్యం..
పల్నాడు ప్రాంతం చారిత్రాత్మకంగానే ఫ్యాక్షన్ రాజకీయాలకు ప్రసిద్ధి చెందింది. 12వ శతాబ్దంలో పల్నాటి యుద్ధం కూడా రాజకీయ విభేదాల కారణంగానే జరిగిందని చెబుతారు. ఈ యుద్ధం స్థానిక సంస్కృతిలో లోతుగా పాతుకుపోయి, తరాల నుండి కొనసాగుతున్న వైరం, ప్రతీకార భావాలను రేకెత్తించిందని.. ఈ ప్రాంత పెద్దలు చెబుతారు.
పోలీసుల చర్యలు..
ఈ ప్రాంతంలో శాంతి భద్రతలను పరిరక్షించడానికి, ప్రజలు ప్రశాంతంగా జీవించడానికి పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారు. అల్లర్లు చెలరేగకుండా నిఘా పెంచారు. ఘర్షణలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. చాలా సందర్భాల్లో 144 సెక్షన్ అమలు చేసి.. గొడవలు జరగకుండా చర్యలు చేపట్టారు. తాజాగా ముందస్తు సమాచారంతో.. కార్డెన్ సెర్చ్ నిర్వహించి.. భారీగా మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు.
సంబంధిత కథనం
టాపిక్