




Best Web Hosting Provider In India 2024

ఏపీలో కుట్టుమిషన్ల శిక్షణ పేరుతో రూ.154 కోట్ల భారీ స్కామ్- మాజీ మంత్రి చెల్లుబోయిన
చంద్రబాబు స్కీమ్ లన్నీ స్కాములేనని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆరోపించారు. బీసీ మహిళలను అడ్డం పెట్టుకుని కుట్టుమిషన్ల శిక్షణ పేరుతో రూ.154 కోట్లకు స్కెచ్ వేశారన్నారు. టెండర్ల దశ నుంచి శిక్షణ వరకు ప్రతిదీ అవినీతే అన్నారు.
సీఎం చంద్రబాబు ఏ పథకం తీసుకొచ్చిన దానివెనుక ఒక స్కామ్ తప్పకుండా ఉంటుందని మాజీ మంత్రి, వైసీపీ నేత చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆరోపించారు. అలాంటిదే కొత్తగా మరో స్కాం బయటకొచ్చిందన్నారు. బలహీనవర్గాల మహిళలను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేస్తామని చెబుతూ కూటమి ప్రభుత్వం భారీ అవినీతికి తెరదీసిందని ఆరోపించారు. చంద్రబాబు మాటలకు చేతలకు చాలా వ్యత్యాసం ఉంటుందన్నారు.
“పేదల పేరుతో సంపద కొల్లగొట్టడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. పేదలకు లబ్ధి చేకూర్చినట్టు పైకి చెప్పకుంటూ ఆయన, ఆయన మనుషులు లాభపడతారు. చంద్రబాబు ఐటీ తెచ్చానని చెప్పుకుంటారు. ఏఐ టెక్నాలజీ గురించి మాట్లాడతారు. డ్రోన్లు వాడాలంటాడు. ప్రతి ఇంట్లో ఒక ఐటీ ఉద్యోగి ఉండాలంటారు.
చివరికి మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేస్తారు. కుట్టు మిషన్ల పంపిణీ ద్వారా వారిని ఏ విధంగా ఐటీ ఉద్యోగులను చేస్తారో అర్థంకాని పెద్ద శేష ప్రశ్న. కుట్టుమిషన్ల పంపిణీ పేరుతో తన అనుచరుల జేబులు మాత్రం బాగానే నింపుతున్నారు”- మాజీ మంత్రి చెల్లుబోయిన
ఒక్కో లబ్ధిదారు పేరుతో రూ. 16 వేలు దోపిడీ
‘రూ. 221 కోట్లతో కూటమి ప్రభుత్వం కుట్టుమిషన్లు పంపిణీ కార్యక్రమం చేపట్టింది. 1,02,832 మంది మహిళలకు టైలరింగ్‌లో శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు అందించే పేరుతో చేపట్టిన స్కీమ్‌లో దాదాపు రూ.154 కోట్లకు పైగా దండుకోవడానికి సిద్ధమైంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8న మహిళలకు శిక్షణ ఇస్తామని చెప్పిన చంద్రబాబు, ఆ పనులు ప్రారంభించకుండా దోపిడీకి మాత్రం డోర్లు బార్లా తెరిచారు’-మాజీ మంత్రి చెల్లుబోయిన
‘1,02,832 మంది మహిళలకు శిక్షణ కోసం మొత్తం రూ. 221.08 కోట్లు కేటాయించారు. ఇందులో కుట్టుమిషన్‌కి రూ. 4300, ఒక్కో మహిళకు శిక్షణ కోసం రూ. 3 వేలు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ఈ విధంగా మొత్తం అయ్యే ఖర్చు రూ. 75.06 కోట్లే. మిగిలిన రూ. 154 కోట్లకు మాత్రం లెక్కలే లేవు. ఒక్కో లబ్ధిదారు పేరు మీద దాదాపు రూ. 16 వేల వరకు దోపిడీకి పాల్పడుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది’ అని చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ అన్నారు.
మొబిలైజేషన్ అడ్వాన్సు పేరుతో రూ. 25 కోట్లు
శిక్షణ పేరుతో 50 రోజుల్లోనే మొత్తం బిల్లులు కింద లాగేసేందుకు పథకం రూపొందించారని చెల్లుబోయిన ఆరోపించారు. టెండర్ నిబంధనల ప్రకారం బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు మహిళలకు టైలరింగ్ శిక్షణ ప్రారంభమైన 15 రోజులకు 33 శాతం, 30 రోజులకు మరో 33 శాతం, 50 రోజులకు మిగిలిన 33 శాతం బిల్లులు చెల్లించాలన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇంకా పూర్తిస్థాయిలో కుట్టు శిక్షణే ప్రారంభం కాలేదని మొబిలైజేషన్ అడ్వాన్సు కింద రూ.25 కోట్లను కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకు రంగం సిద్ధమవుతోందని ఆరోపించారు. నీకింత.. నాకింత రూల్ ప్రకారం ప్రభుత్వ ఖజానాను దోచుకోవడానికి బీసీ మహిళలను పావులుగా వాడుకుంటున్నారన్నారు.
నిబంధనల ప్రకారం ఒక్కో లబ్ధిదారుకి 45 రోజులపాటు దాదాపు 360 గంటల శిక్షణ ఇవ్వాల్సి ఉంటే, కేవలం 135 గంటల మాత్రమే శిక్షణ ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారన్నారు.. లబ్ధిదారులకు ట్రైనింగ్ కిట్ కూడా ఇవ్వడం లేదన్నారు.
పేరున్న శిక్షణ సంస్థలను కాదని
‘కుట్టు శిక్షణ ఇచ్చేందుకు సీడాప్, ఏపీఐటీసీవోతో పాటు డీడీయూజీకేవై ఉన్నాయి. వీటికి శిక్షణ కేంద్రాలు, శిక్షణ భాగస్వాములు ఉన్నారు. స్కిల్ పోర్టల్స్, అన్ని జిల్లాల్లో పర్యవేక్షణ వ్యవస్థ, సిబ్బంది సైతం ఉన్నారు. అయినా వాటిని కాదని ఏపీ బీసీ సహకార ఆర్థిక సంస్థ ద్వారా స్కీమ్‌ను చేపట్టి భారీ స్కామ్‌కు మార్గం సుగమం చేసుకున్నారు. ఈ స్కీమ్ రచనలో కీలకపాత్ర పోషించిన ఒక రిటైర్డ్ అధికారికి తగిన ప్రోత్సాహకం ఇచ్చారని నాకు సమాచారం ఉంది’- మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ
సంబంధిత కథనం
టాపిక్