




Best Web Hosting Provider In India 2024

రెండో ఇన్నింగ్స్.. ఇక ఊహలకు అందని విధంగా..: బాలకృష్ణ.. 50 ఏళ్లు హీరోగా ఎవడూ లేడంటూ కామెంట్
పౌర సన్మాన సభలో నందమూరి బాలకృష్ణ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. తర్వాతి సినిమాల కథల ఎంపిక గురించి హైప్ పెంచేశారు. రాజకీయాల గురించి కూడా మాట్లాడారు.
తెలుగు స్టార్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇటీవలే పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు నేడు (మే 4) పౌర సన్మాన సభ జరిగింది. హిందూపురంలో జరిగిన ఈ కార్యక్రమంలో బాలకృష్ణ సుదీర్ఘంగా మాట్లాడారు. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలైదంటూ మాట్లాడారు.
ఇక చూపిస్తా.. మీ అంచనాలకు అందవు
ఇక నుంచి తాను చేసే సినిమాలు అందరి ఊహలకు, అంచనాలకు మించి ఉంటాయని బాలకృష్ణ అన్నారు. “ వరుసగా నాలుగు హిట్లు ఇచ్చిన తర్వాత నా రెండో ఇన్నింగ్స్ మొదలైందని చెబుతున్నా. ఇప్పుడు చూపిస్తా. ఇక ముందు ఎలాంటి సినిమాలు చేస్తానో మీ ఊహలకు, అంచనాలకు కూడా అందవు. మీరు చూస్తారు” అని బాలకృష్ణ అన్నారు.
అఖండ, వీరసింహా రెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహరాజ్‍తో నాలుగేళ్లలో వరుస హిట్స్ సాధించారు బాలకృష్ణ. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 చేస్తున్నారు. ఈ మూవీపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక వరుస హిట్లతో ఉన్న బాలయ్య.. తర్వాతి సినిమాలు అంచనాలకు మించి ఉంటాయని చెప్పడం మరింత ఆసక్తిరంగా మారింది.
నామరూపాలు లేకుండా పోయారు
నటుడు అయినంత మాత్రాన ఎమ్మెల్యే అవ్వాలని లేదని, రాజకీయాల్లోకి ఎంతో మంది వచ్చి నామరూపాలు, అడ్రెస్ లేకుండా పోయారని బాలకృష్ణ అన్నారు. పనులు చేసినందుకే తనను జనాలు గెలిపించారని, ఏదో నటుడు, ఎన్టీఆర్ అబ్బాయి అని కాదని బాలయ్య చెప్పారు.
50 ఏళ్లు హీరోగా ఎవడూ లేడు
50 సంవత్సరాలుగా ప్రపంచంలో హీరోగా ఎవడూ లేడు అని బాలకృష్ణ చెప్పారు. కెరీర్ మధ్యలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారడం లాంటివి చాలా మందికి జరిగాయని అన్నారు. 50 సంవత్సరాలు హీరోగా ఏకధాటిగా ఉండడం తనకే సాధ్యమైందని, ఆ శక్తి ఇచ్చిన తెలుగు వారికి కృతజ్ఞతలు అని బాలయ్య చెప్పారు.
తనకు పద్మభూషణ్ పురస్కారం దక్కినందుకు సంతోషంగా ఉందని, కానీ తన తండ్రి ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న అనేది తెలుగువారందరీ కోరిక అని చెప్పారు. “ఎన్టీఆర్‌కు భారతరత్న ఇచ్చినప్పుడే వాళ్లను వాళ్లు గౌరవించుకున్నట్టు అని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నా” అని బాలకృష్ణ అన్నారు.
సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం అఖండ 2 షూటింగ్‍లో బాలకృష్ణ బిజీగా ఉన్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది సెప్టెంబర్‌లో విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. అయితే, వచ్చే ఏడాది 2026 సంక్రాంతికి వాయిదా పడుతుందనే రూమర్లు ఉన్నాయి.
సంబంధిత కథనం