Best Web Hosting Provider In India 2024

వరంగల్ హోటళ్లలో కుళ్లిన మటన్, చికెన్.. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల తనిఖీల్లో బయటపడ్డ బాగోతం
వరంగల్ నగరంలోని కొన్ని హోటల్స్, రెస్టారెంట్స్ కస్టమర్లకు ప్రాణాంతకమైన ఫుడ్‌ను సప్లై చేస్తున్నాయి. రోజుల తరబడి నిల్వ ఉంచిన చికెన్, మటన్, చాపలు, రొయ్యల్లాంటి సీ ఫుడ్ తోపాటు.. బూజుపట్టిన కాలీఫ్లవర్, క్యాబేజీతో చేసిన చేసిన వంటకాలను జనాలకు సరఫరా అంటగడుతున్నాయి.
స్టేట్ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీమ్ ఆఫీసర్లు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో.. వరంగల్ హోటళ్ల బాగోతం మరోసారి బయట పడింది. ఓవైపు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు సోదాలు చేస్తున్నా.. హోటల్స్, రెస్టారెంట్స్ మళ్లీ అదే దందాను సాగిస్తుండటం, అధికారులు కూడా నామమాత్రపు చర్యలతో సరిపెడుతుండటం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కుళ్లిపోయిన మటన్, చికెన్..
రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదేశాల మేరకు.. స్టేట్ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీమ్ ఆఫీసర్లు వరంగల్ నగరంలోని పలు హోటళ్లలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. స్టేట్ టాస్క్ ఫోర్స్ టీమ్ హెడ్, జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి.జ్యోతిర్మయి ఆధ్వర్యంలో.. ఫుడ్ ఇన్ స్పెక్టర్లు రోహిత్ రెడ్డి, స్వాతి, శ్రీషిక తదితరులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.
కంపు కొట్టే ఫ్రిజ్‌లో..
హనుమకొండ నక్కలగుట్ట ప్రాంతంలోని ల్యాండ్ మార్క్, ఫుడ్ ఆన్ ఫైర్ హోటళ్లో సోదాలు చేశారు. ఈ క్రమంలో అక్కడున్న మాంసం, ఫుడ్ ఐటెమ్స్, కిచెన్ మెయింటెనెన్స్ చూసి ఆఫీసర్లు షాక్ అయ్యారు. ల్యాండ్ మార్క్, ఫుడ్ ఆన్ ఫైర్ హోటళ్లలో కుళ్లిపోయిన మటన్, చికెన్ తో పాటు రోజుల తరబడి నిల్వ ఉంచి రొయ్యలు కనిపించాయి. కంపు కొట్టే ఫ్రిజ్ లో వాటిని స్టోర్ చేసి పెట్టగా, ఆఫీసర్లు వాటిని వెలికితీసి కుళ్లిపోయి ఉన్నట్టుగా గుర్తించారు. బూజు పట్టిన కాలీఫ్లవర్, క్యాబేజీతో చేసిన ఐటెమ్స్ ను కస్టమర్లకు సప్లై చేస్తున్నట్టు నిర్ధారణకు వచ్చారు. మొత్తంగా ఆ రెండు హోటళ్లలో సుమారు రూ.45 వేల విలువైన 32 కిలోల కుళ్లిపోయిన మాంసాన్ని సీజ్ చేశారు.
హానికర కెమికల్స్..
ల్యాండ్ మార్క్, ఫుడ్ ఆన్ ఫైర్ హోటళ్లలో డేంజరస్ కెమికల్స్ కలిపిన చికెన్ అమ్ముతున్నట్లు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు గుర్తించారు. వాటితో పాటు కాలం చెల్లిన ఐస్ క్రీమ్‌లు, పాల ప్యాకెట్లు, హానికర రంగులు కలిపిన మసాలాలు, లేబుల్ డిఫెక్ట్స్ కలిగిన కార్న్, కొబ్బరి పొడి, డ్యామేజ్ అయిన కూరగాయలను వంటకాలకు వాడుతున్నట్లు నిర్ధారించారు.
నిర్వాహకులకు నోటీసులు..
జనాలకు డేంజరస్ ఫుడ్ సప్లై చేస్తూ.. వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్న హోటల్ నిర్వాహకులపై జోనల్ ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ వి.జ్యోతిర్మయి ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్యామేజ్ అయిన చికెన్, మటన్, రొయ్యలు, ఇతర ఫుడ్ ఐటెమ్స్ ను ధ్వంసం చేశారు. ఫుడ్ సేఫ్టీ యాక్ట్ 2006 రూల్స్ ఉల్లంఘించినందుకు ఆ రెండు బడా హోటళ్ల నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. స్వాధీనం చేసుకున్న కొన్ని ఫుడ్ శాంపిల్స్ ను హైదరాబాద్ లోని ల్యాబ్ కు పంపించారు. ఆహార కల్తీ ఉన్నట్లు నిర్ధారణ అయితే.. సదరు హోటల్ యాజమాన్యాలపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జ్యోతిర్మయి స్పష్టం చేశారు. అవసరమైతే సంబంధిత శాఖల సహాయంతో హోటళ్లను సీజ్ చేస్తామని ఆమె హెచ్చరించారు.
(రిపోర్టింగ్: హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)