Best Web Hosting Provider In India 2024

మీది ఆయిలీ స్కిన్ ఆ? అయితే దీని గురించిన అపోహలేంటి, వాస్తవాలేంటో తెలుసుకుని అందంగా కనిపించండి!
జిడ్డు చర్మం అని బాధపడతున్నారా? మాయిశ్చరైజర్ రాసుకోవలా వద్దా? మేకప్ వేసుకోవాలా వద్దా అనే సందేహాలతో సతమతం అవుతున్నారా? అయితే ఇది మీ కోసమే. జిడ్డు చర్మం గురించి మీరు విన్నవన్నీ వాస్తవాలేనా కదా ఇక్కడ తెలుసుకోండి.
మీ ముఖం కడుక్కున్న కాసేపటికే జిడ్డుగా తయారవుతుందా? ముఖంపై పేరుకుపోయిన నూనె మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా? బాధపడండి, ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్ల అందరిదీ ఇదే బాధ. నిజానికి మన చర్మంలో ఉండే చిన్న నూనె గ్రంథులు అతిగా పనిచేయడం వల్లనే ఈ సమస్య వస్తుంది. నూనె ఉత్పత్తి ఎక్కువ అవడం వల్ల మొటిమలు, బ్లాక్ హెడ్స్ లాంటివి వచ్చి విసిగిస్తుంటాయి. చెడుతోపాటు మంచి, మంచితో పాటు చెడు అన్నట్లు ఆయిలీ స్కిన్ ఉన్నవారికి ఈ సమస్యలు మాత్రమే కాదు కొన్ని లాభాలు కూడా ఉన్నాయట. మీది కూడా ఆయిలీ స్కిన్ అయితే మీరు తెలుసుకోవాల్సిన మరో మంచి విషయం ఒకటి ఉంది.
అదేంటంటే.. జిడ్డు చర్మం గలవారి చర్మం త్వరగా ముడతలు పడదట. అంటే వీళ్లు ఎక్కువ కాలం యవ్వనంగా కనిపస్తారన్న మాట. ఇదొక్కటే కాదు ఆయిలీ స్కిన్ గురించి చాలా మందికి తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి. వీటిలో వాస్తవాలు కొన్ని అయితే అపోహలు మరి కొన్ని. జిడ్డు చర్మం గురించి ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతున్న అపోహల గురించి తెలుసుకుందాం రండి.
ఆయిలీ స్కిన్ గురించిన అపోహల్లో ముఖ్యమైనవి:
జిడ్డు చర్మం ఎప్పుడూ అనారోగ్యకరమైనది:
జిడ్డు చర్మం అనగానే అందరూ వేస్ట్ అని ఫీలవుతుంటారు. దీనికి చాలా చెడ్డ పేరు ఉంది. నిజానికి ఆయిలీ స్కిన్ అంటే మంచిది కాదని అర్థం కాదు. మీ చర్మంలో ఉండే సహజమైన నూనెలు చర్మాన్ని బయటి హాని నుండి కాపాడుతాయి, తేమగా అందంగా ఉంచేందుకు సహాయపడతాయి. అంతేకాదు అందరి చర్మం ఒకేలా ఉండదు. వేరు వేరుగా ఉంటుంది. నూనె ఉత్పత్తి అవడం అనేది మీ జన్యువులు, హార్మోన్లు, మీరు తినే ఆహారం, మీ ఒత్తిడి లాంటి వాటి మీద ఆధారపడి ఉంటుంది. జిడ్డు చర్మం ఉంటే మీరు దానికి కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టాలి, బాగా చూసుకోవాలి అంతే.
జిడ్డు చర్మం గలవారికి మొటిమలు ఎక్కువగా వస్తాయి:
జిడ్డు చర్మం మొటిమలకు కారణం కావచ్చు, కానీ అది ఒక్కటే కారణం మాత్రం కాదని తెలుసుకోండి. హార్మోన్లు, బ్యాక్టీరియా, రంధ్రాలు మూసుకుపోవడం, ఇంకా నూనె అన్నీ కలగలిసి మొటిమలకు కారణమవుతాయి. అంతే కానీ జిడ్డు చర్మం ఉంటే మొటిమలు వస్తాయని ఎక్కడా లేదు.మొటిమల సమస్య నుంచి తప్పించుకోవానికి మీ చర్మాన్ని తేమగా ఉంచుకోండి. నీరు ఎక్కువగా తాగుతూ ఉండండి. రోజుకు రెండుసార్లు ముఖం కడగండి, మంచి ఫేస్ వాష్ వాడండి, సన్‌స్క్రీన్ తప్పకుండా ఉపయోగించండి. వారానికి ఒకట్రెండు సార్లు స్క్రబ్ చేయండి. ఇలా చేస్తే, జిడ్డు చర్మాంతో కూడా అందంగా కనిపించచ్చు. మొటిమలు రాకుండా కాపాడుకోవచ్చు.
ఆయిలీ స్కిన్ గలవారికి మాయిశ్చరైజర్ అవసరం లేదు:
ఇదైతే నంబర్ వన్ ! ఆయిల్‌గా ఉన్న స్కిన్‌కి మళ్లీ ఆయిల్ ఎందుకు అని చాలా మంది అనుకుంటారు. కానీ అసలు విషయం ఏంటంటే, మాయిశ్చరైజర్ స్కిప్ చేస్తే స్కిన్ డ్రై అయిపోతుంది. అప్పుడు అది ఇంకా ఎక్కువ నూనెను ఉత్పత్తి చేసి మిమ్మల్ని మరింత ఇబ్బంది పెడుతుంది. కాబట్టి జిడ్డు చర్మం గలవారికి కూడా మాయిశ్చరైజర్ తప్పనిసరి. ఇలాంటి వారు లైట్ వెయిట్ ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ వాడాలి. ‘నాన్-కామెడోజెనిక్’ అని రాసి ఉన్నది అయితే మంచి ఫలితాలు కనిపస్తాయి.
సన్‌స్క్రీన్ వేసుకుంటే జిడ్డు చర్మం ఇంకా ఎక్కువ జిడ్డుగా మారుతుంది
చాలా మంది జిడ్డు చర్మం ఉన్నవాళ్లు సన్‌స్క్రీన్ వేసుకోరు. ఎందుకంటే అది ముఖాన్ని మరింత జిడ్డుగా చేస్తుంది లేదా మొటిమలు వస్తాయి అని అనుకుంటారు. కానీ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఎలాంటి చర్మం గలవారైనా సన్‌స్క్రీన్ వేసుకోపోవడం చాలా అవసరం. ఎందుకంటే సూర్యరశ్మి వల్ల చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అంతేకాదు చర్మంపై నల్లటి మచ్చలు, ముడతలు వస్తాయి. చర్మం ఎర్రగా అవుతుంది.మార్కెట్లో ఇప్పుడు జిడ్డు చర్మం కోసం ప్రత్యేకంగా నూనె లేని సన్‌స్క్రీన్‌లు చాలా లభిస్తున్నాయి. మాటీ ఫినీష్ లేదా జెల్ బేస్డ్ అని రాసి ఉన్నవి అయితే మరీ మంచిది.
ముఖం ఎక్కువసార్లు కడిగితే నూనె జిడ్డు తగ్గిపోతుంది:
ఇది చాలా మందలో ఉన్న అపోహ. ఎక్కువ సార్లు ఫేస్ వాష్ చేస్తే జిడ్డు పోతుంది అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే.దీని వల్ల మీరు చాలా నష్టపోతారు. ఎందుకంటే ఎక్కువసార్లు ముఖాన్ని కడిగితే స్కిన్‌లోని మంచి ఆయిల్ కూడా పోతుంది. అప్పుడు స్కిన్ దాన్ని కాపాడుకోవడానికి ఇంకా ఎక్కువ నూనె ఉత్పత్తి చేస్తుంది. అందుకే రోజుకి రెండు సార్లు అంటే ఉదయం, రాత్రి మాత్రమే ముఖాన్ని కడగాలి. అది కూడా చాలా సున్నితంగా. ఒకవేళ పగటిపూట ఎక్కువ జిడ్డుగా అనిపిస్తే పేపర్ టవల్‌తో ముఖాన్ని తుడుచుకోండి, మళ్లీ మళీ కడగడం మానకోండి.
టోనర్ ఎక్కువ వాడితే జిడ్డు తగ్గుతుంది
ఆయిలీ స్కిన్ కలిగిన వాళ్లు చాలా మంది టోనర్ విషయంలో సందేహంలో ఉంటారు. నిజానికి టోనర్లు మంచివే కానీ అన్ని టోనర్‌లు ఒకేలా ఉండవు. ఆల్కహాల్ ఎక్కువగా ఉండే టోనర్‌లు మీ చర్మాన్ని పొడిగా చేస్తాయి, దాని వల్ల ఇంకా ఎక్కువ నూనె వస్తుంది. అందుకే నియాసినామైడ్ లేదా సాలిసిలిక్ యాసిడ్ లాంటివి ఉన్న సున్నితమైన టోనర్‌లను వాడండి. అవి నూనెను తగ్గిస్తాయి, రంధ్రాలను శుభ్రంగా ఉంచుతాయి, మీ చర్మాన్ని బిగుతుగా అందంగా మారుస్తాయి.
జిడ్డు చర్మం ఉన్నవాళ్లు మేకప్ వేసుకోకూడదు
జిడ్డు చర్మం గలవారికి మేకప్ వేసుకోవడం కొంచెం కష్టంగా ఉండవచ్చు. కానీ మేకప్ వేసుకోవడం పూర్తిగా మానేయాల్సిన అవసరం మాత్రం లేదు. నూనె లేని, రంధ్రాలను మూసుకుపోని మేకప్ వస్తువులు ఎంచుకుంటే సరిపోతుంది. మాటిఫైయింగ్ ప్రైమర్, నూనెను పీల్చుకునే పౌడర్, సెట్టింగ్ స్ప్రే వాడితే మీ మేకప్ కదలకుండా ఉంటుంది. సరైన పద్ధతిలో మేకప్ వేసుకుంటే ఆయిలీ స్కిన్ కలవారు కూడా అందరిలాగా అందంగా కనిపించవచ్చు. కానీ ప్రతిరోజు మేకప్ వేసుకోకండి, అది ఏ చర్మానికైనా మంచిది కాదు.
జిడ్డు చర్మం తొందరగా ముడతలు పడదు
జిడ్డు చర్మం గలవారు సంతోషాల్సిన విషయం ఇది. జిడ్డు చర్మానికి సహజంగానే తేమ ఎక్కువ ఉంటుంది కాబట్టి ముడతలు కొంచెం ఆలస్యంగా రావచ్చు. కానీ జిడ్డు చర్మానికి వృద్ధాప్యం రాదని కాదు. సూర్యరశ్మి, కాలుష్యం లాంటివి మీ చర్మాన్ని కాలక్రమేణా పాడు చేస్తాయి. కాబట్టి మీకు జిడ్డు చర్మం ఉన్నా కూడా ప్రతిరోజు సన్‌స్క్రీన్ వేసుకోవడం, మంచి చర్మ సంరక్షణ చేయడం చాలా ముఖ్యం. అప్పుడే మీ చర్మం ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంటుంది.