తల్లి అయ్యాక మీ ఆరోగ్యం గురించి పట్టించుకోవడం లేదా? ఈ 5 సింపుల్ అలవాట్లు మీలో కొత్త శక్తిని నింపుతాయి!

Best Web Hosting Provider In India 2024

తల్లి అయ్యాక మీ ఆరోగ్యం గురించి పట్టించుకోవడం లేదా? ఈ 5 సింపుల్ అలవాట్లు మీలో కొత్త శక్తిని నింపుతాయి!

Ramya Sri Marka HT Telugu

కొత్త తల్లుల్లారా.. బిడ్డ పుట్టిన ఆనందంలో మిమ్మల్ని మీరు మర్చిపోయారా? బోసి నవ్వులు చూసి మురిసిపోతూ మీ ఆరోగ్యం గురించి పట్టించుకోవడం లేదా? ఆగండాగండి! సూపర్ మామ్ కావాలంటే సూపర్ హెల్దీగా ఉండాలనే విషయాన్ని మర్చిపోకండి. ఇందుకోసం ఈ 5 పనులను రోజూ చేయడం అలవాటు చేసుకోండి.

పనిబిడ్డను ఎత్తుకున్న తల్లి

బిడ్డ పుట్టాక మీ తల్లుల ప్రపంచం మొత్తం మారిపోతుంది. నిద్ర ఉండదు, తినడానికి సమయం ఉండదు, సొంత పనుల గురించి, ఆరోగ్యం గురించి పట్టించుకోవడానికి అసలు టైమే ఉండదు. పిల్లల కోసం అది చేయాలి, ఇది చేయాలి, పిల్లలను బాగా చూసుకోవాలి ఇదే ఆలోచన. ఎంత కష్టపడ్డా, ఎన్ని పనులు చేసినా చిన్నారి బోసి నవ్వు చూడగానే ఆ బాధంతా మర్చిపోతారు. ఇది మాతృత్వంలోని గొప్పతనం.

కానీ ఇలాగే ఉండే మీ ఆరోగ్యం సంగతేంటి? మీరు ఆరోగ్యంగా ఉంటేనే కదా మీ బిడ్డను బాగా చూసుకోగలరు! మీ గురించి మీరు పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు? మీకేదైనా అయితే మీ కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు. ఎవ్వరూ ఉంపడరు. కాబట్టి మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవాలి. ముఖ్యంగా కొత్తగా తల్లి అయినప్పుడు మీ శరీరం, మనసు రెండు మరింత బలహీనమైతోతాయి. ఇలాంటి సమయంలో మీ మీద మీరు కాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఇందుకోసం ఎక్కువ కష్టపడక్కర్లేదు.. మీ రోజువారీ పనుల్లో ఈ 5 చిన్న చిన్న అలవాట్లు చేర్చుకుంటే మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. అవేంటో ఇది చదివితే మీకే తెలుస్తుంది!

కొత్తగా తల్లి అయిన వారు ఖచ్చితంగా అలవాటు చేసుకోవాల్సిన 5 పనులు..

కొత్తగా తల్లులైన వారు మానసిక, శారీరక ఆరోగ్యం కోసం తప్పక చేయాల్సిన 5 పనుల గురించి HT లైఫ్‌స్టైల్‌తో సర్టిఫైడ్ ఎక్స్‌ప్రెసివ్ ఆర్ట్ థెరపిస్ట్, తుల జర్నీ వ్యవస్థాపకురాలు గుంజన్ ఆద్య ఇలా అన్నారు:

“మనం మన పిల్లలను ఎలాగైతే ప్రేమగా పెంచుతామో, అదే విధంగా మనల్ని మనం కూడా పోషించుకోవడం చాలా ముఖ్యం. పిల్లలు ఎదుగుతున్న క్రమంలో మనం కూడా వారితో పాటు పరిణితి చెందుతాము. ఇరువురి ఎదుగుదల ఆరోగ్యకరంగా, ఆనందంగా ఉండటం అత్యంత అవసరం. ఇందుకోసం ఏం చేయాలో తెలుసుకుందాం..

1. మీపై మీరు దయ చూపించండి:

తల్లిగా వ్యవహరిండం నిజంగా చాలా కష్టమైన విషయం. కాబట్టి మీరు ఏం చేసినా మీరు సరిగ్గా చేయడం లేదని ఎప్పుడూ అనుకోకండి. పనితనంలో అయినా, మీ పిల్లలు పెద్దయ్యాక అయినా వారిని బాగా పెంచుతున్నానా లేదా అనే సందేహాలు మీలో కలగచ్చు. ఇలా ఎప్పుడూ సందేహించకండి. ఓక్కటే గుర్తుంచుకోండి మీరు ఎల్లప్పుడూ మీ పిల్లలకు ప్రేమను, మీ శక్తిని పూర్తిగా ఇస్తున్నారు. కనుక మీ ప్రయత్నాలను నమ్మండి, మీపై మీరు దయ చూపించండి. మీరు అద్భుతమైన తల్లి అని మర్చిపోకండి.

పనిపాపతో పాటు కూర్చుని ఉన్న తల్లి
పనిపాపతో పాటు కూర్చుని ఉన్న తల్లి (Photo by Jonathan Gallegos on Unsplash)

2. మీ పేరెంటింగ్ నైపుణ్యాలను ఇతరులతో పోల్చుకోకండి

తల్లి బిడ్డ సంబంధం ప్రతి ఒక్కరి విషయంలో భిన్నంగా, అందంగా ఉంటుంది. కాబట్టి మీ పేరెంటింగ్ విధానాన్ని మీరు కూడా గౌరవించాలి. తల్లిగా వ్యవహరించడం చాలా కష్టమైన పని. అలాగే మీ బిడ్డకు ఏది మంచిదో ఏది చెడ్డదో ఇతరుల కన్నా మీకే బాగా తెలుస్తుంది. వాళ్లు అలా చేశారని మీరు చేయలేకపోయారని బాధపడకండి. కాబట్టి మీ పిల్లల విషయానికి వస్తే ఎల్లప్పుడూ మీ అంతర్ దృష్టితో ఉండండి. ఇతరులతో పోల్చుకోకండి.

3. మీ ఆలోచనలను రాసుకోండి:

తల్లిగా మారడం ఎంతో ఆనందాన్నిస్తుంది, కానీ ఒక్కోసారి చాలా అలసటగా అనిపిస్తుంది. విసుగు తెప్పిస్తుంది. ఎందుకంటే కొత్త తల్లులకు ఎన్నో రకాల భావోద్వేగాలు కలుగుతుంటాయి. కొన్నిసార్లు వాటికి కారణం కూడా తెలియదు. అలాంటప్పుడు ఒక డైరీలో మీ ఆలోచనలు రాయడం వల్ల మనసు తేలికపడుతుంది. మీ మనసులోని బాధను, సంతోషాన్ని, ఆందోళనను ఎటువంటి భయం లేకుండా రాసుకోవడానికి జర్నలింగ్ అనేది ఒక మంచి మార్గం. ఇది మీ భావోద్వేగాలను అర్థం చేసుకోవడానికి, వాటిని క్రమబద్ధీకరించడానికి సహాయపడుతుంది. కాబట్టి, రోజులో కొంచెం సమయం మీ ఆలోచనల కోసం కేటాయించండి.

4. సహాయం తీసుకోవడానికి వెనుకాడకండి:

మహిళలు చాలా పనులు ఒంటరిగా చేయగల సమర్థులు అనడంలో సందేహం లేదు. కానీ మీ బిడ్డను చూసుకోవడానికి ఇతరుల సహాయం తీసుకోవడం తెలివైన పని. మీ తల్లి, మీ భాగస్వామి లేదా మీ స్నేహితులు ఎవరైనా సరే మీ బిడ్డ సంరక్షణ కోసం మీకు వారి సహాయం అవసరం. ఇది చాలా ముఖ్యం కూడా. ఎందుకంటే మీకు కాస్త విశ్రాంతి దొరికినా, మీ పనులు తేలికవుతాయి. అది మీ ఆరోగ్యంపై మంచి ప్రభావం చూపుతుంది. సహాయం అడగడం బలహీనత కాదు, అది మీ బిడ్డ పట్ల మీకున్న బాధ్యత అని గుర్తుంచుకోండి.

5. మిమ్మల్ని మీరు ప్రేమగా చూసుకోండి:

మీరు ఒక కొత్త ప్రాణానికి జన్మనిచ్చారు. ఇది మాటల్లో చెప్పలేని మంచి విషయం. ఇది అందరు ఆడవాళ్లే చేసేదే కదా అని తీసి పారేయకండి. ప్రతి తల్లి చేసేదే అయినా ఇది చిన్న విషయం కాదని తెలుసుకోండి. ఒక స్త్రీ తనలోని శక్తితో మరో మనిషిని ఈ ప్రపంచంలోకి తీసుకొస్తుంది. ఇది ఒక రకంగా స్త్రీకి పునర్జన్మ లాంటిది. మీ శరీరం, మీ రక్తం, మీ మాంసం ఒక కొత్త జీవితానికి ఊపిరి పోస్తాయి. ఇది అద్భుతమైన విషయం. ఇది చేసిన మీరు కూడా ఒక అద్భుతమే అని గర్వంగా ఫీలవండి. మీ మీద ప్రేమనే మరింత పెంచుకోండి.

మీ శరీరం మళ్లీ శక్తిని పుంజుకోవడానికి మీకు తగినంత సమయం ఇవ్వండి. ఒక మంచి హెడ్ మసాజ్, కాసేపు నిద్రపోవడం లేదా మీ స్నేహితులతో కలిసి నవ్వడం వంటి చిన్న చిన్న విషయాలు కూడా మీకు ఎంతో విశ్రాంతినిస్తాయి. మీ మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. మిమ్మల్ని మీరు ప్రేమగా చూసుకోవడం కూడా మీ బిడ్డ సంరక్షణలో ఒక ముఖ్యమైన భాగం అని గుర్తుంచుకోండి.

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024