





Best Web Hosting Provider In India 2024

సమంత ఇంటర్వ్యూ: నిర్మాత కష్టాలు ఎలా ఉంటాయో తెలిసొచ్చింది.. ఎవరినీ అడగొద్దనే నేను నటించా.. నాకు గుళ్లు కట్టొద్దు: సమంత
సమంత నిర్మాతగా ఉన్న శుభం మూవీ రిలీజ్ కు సిద్ధమైంది. ఈ సందర్భంగా మంగళవారం (మే 6) ఆమె మీడియాతో మాట్లాడింది. నిర్మాత కష్టాలు ఎలా ఉంటాయో తనకు తెలిసొచ్చిందని ఈ సందర్భంగా ఆమె అనడం విశేషం. ఇంకా ఆమె ఏమన్నదో చూడండి.
సమంత నిర్మాతగా మారి నిర్మించిన తొలి మూవీ శుభం. ఈ సినిమా వచ్చే శుక్రవారం (మే 9) రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడింది. నిర్మాతగా తన తొలి శుక్రవారం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు చెప్పింది. అంతేకాకుండా తనకు గుడి కట్టి ఆరాధించడంపైనా ఇదే ఇంటర్వ్యూలో సామ్ స్పందించింది.
గత వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నాను. పోస్ట్ ప్రొడక్షన్ టీం, మిక్సింగ్ టీం, ఎడిటింగ్ ఇలా అందరూ నిద్ర లేకుండా పని చేస్తున్నారు. నాకు నా టీం మీద మరింత గౌరవం పెరిగింది. ‘శుభం’ చిత్రం చాలా బాగా వచ్చింది. మంచి కథ. సినిమాపై నాకు చాలా నమ్మకం ఉంది” అని సమంత చెప్పింది.
శుభం అనే టైటిల్ అందుకే..
తాను నిర్మించిన తొలి సినిమాకు శుభం అని పెట్టడం వెనుక కారణాన్ని సమంత వివరించింది. “‘శుభం’ అనే టైటిల్ పెట్టడానికి కారణం ఉంది. ఈ మూవీలో ఎక్కువగా సీరియల్ గురించి ఉంటుంది. ఆ సీరియల్‌లో శుభం కార్డ్ ఎప్పుడు పడుతుందా అని అంతా ఎదురు చూస్తుంటారు.
అందుకే ఆ టైటిల్ పెట్టాం. ఇక నా ప్రొడక్షన్ కంపెనీకి ట్రా లా లా అని పెట్టడానికి కూడా కారణం ఉంది. చిన్నప్పుడు ‘బ్రౌన్ గర్ల్ ఇన్ ది రెయిన్’ అనే పద్యం ఉండేది. అందుకే ట్రా లా లా అని పెట్టాం” అని సమంత వివరించింది.
గౌతమ్ మేనన్‌లాగే నేనూ..
నిర్మాతగా తన తొలి సినిమాలోనే కొత్త వారికి అవకాశం ఇవ్వడంపైనా సమంత స్పందించింది. “గౌతమ్ మీనన్ గారు నాకు మొదటి ఛాన్స్ ఇచ్చారు. ఆయన తల్చుకుంటే ఆ టైంలో ఏ టాప్ హీరోయిన్ అయినా నటించేవారు.
కానీ ఆయన నాలాంటి కొత్త వారికి అవకాశం ఇచ్చారు. నేను కూడా నిర్మాతగా కొత్త వారిని ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతోనే ఉన్నాను” అని సామ్ తెలిపింది.
ఎవరినీ అడగొద్దనే నేను నటించా..
ఇక ఈ సినిమాలో అతిథి పాత్రలో తాను నటించడంపై సమంత ఏమన్నదంటే.. “శుభం మూవీలో కేమియో పాత్రని నేను చేయాల్సింది కాదు. కానీ నిర్మాతగా మొదటి సారిగా నేను ఎవరి దగ్గరకు వెళ్లి ఫేవర్ అడగాలని అనుకోలేదు.
అందుకే ఆ పాత్రను నేనే పోషించాను. నేను ఈ మూవీని ఇంకో మూడు, నాలుగు రోజులు మాత్రమే ప్రమోట్ చేయగలను. కానీ ఆ తరువాత ఈ మూవీ భారమంతా ప్రేక్షకుల మీదే ఉంటుంది” అని సమంత చెప్పింది.
నాకు గుడి కట్టొద్దు
ఇక తనకు ఓ అభిమాని గుడి కట్టి పూజించడం గురించి సమంత మాట్లాడింది. “ఓ అభిమాని నా కోసం గుడి కట్టారని తెలిసి ఆశ్చర్యపోయాను. నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారా అని అనుకున్నా. ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు. అది అతని ప్రేమను చూపించే తీరు అని అనిపించింది. కానీ ఇలా నాకు గుళ్లు కట్టి, నాకు పూజలు చేసే పద్దతిని మాత్రం నేను ఎంకరేజ్ చేయలేను” అని సామ్ స్పష్టం చేసింది.
సంబంధిత కథనం