ఏపీ దేవాదాయ శాఖలో 137 ఉద్యోగాల భర్తీకి సీఎం చంద్రబాబు ఆమోదం.. డీసీ, గ్రేడ్‌ 1,2 ఈవో పోస్టుల భర్తీ

Best Web Hosting Provider In India 2024

ఏపీ దేవాదాయ శాఖలో 137 ఉద్యోగాల భర్తీకి సీఎం చంద్రబాబు ఆమోదం.. డీసీ, గ్రేడ్‌ 1,2 ఈవో పోస్టుల భర్తీ

Sarath Chandra.B HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Sarath Chandra.B HT Telugu

ఏపీ దేవాదాయ శాఖలో 137 ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. దేవాదాయ శాఖలో గత రెండున్నర దశాబ్దాలుగా డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌జరగక పోవడంతో అధికారుల కొరత తీవ్రంగా ఉంది. రెవిన్యూ అధికారులతో దేవాదాయశాఖలో సర్దుబాటు చేస్తున్నారు. ఈ క్రమంలో ఉద్యోగాల భర్తీకి సీఎం ఆమోదం తెలిపారు.

ఏపీ దేవాదాయ శాఖలో ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on Facebook

ఏపీ దేవాదాయ శాఖలో 137 ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపారు. వీటిలో డిప్యూటీ కమిషనర్ సహా గ్రేడ్ 1, 3 ఈవో పోస్టుల ఖాళీలు ఉన్నాయి. మరో 200 వైదిక సిబ్బంది కొలువుల నియామకాలకు అంగీకారం తెలిపారు. కొత్తగా 16 ఆలయాల్లో నిత్యాన్నదాన పథకం అమలు చేయనున్నారు.

ఏపీలో 23 ప్రధాన ఆలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని, ఆగమశాస్త్రం ప్రకారమే ఆలయాల అభివృద్ధి పనులు చేపట్టాలని ఆదేశించారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా కార్యక్రమాలు చేపట్టాలని, దేవాలయ భూముల్లో శాఖాహార హోటళ్లకు మాత్రమే అనుమతించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

137 పోస్టుల భర్తీకి సీఎం ఆమోదం..

దేవాదాయ శాఖలో ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్న డిప్యూటీ కమిషనర్, గ్రేడ్ 1, 3 ఈవోతో సహా భారీగా పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. మొత్తం 5 విభాగాల్లో 137 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ విధానంలో భర్తీ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

దేవాదాయ శాఖలో డిప్యూటీ కమిషనర్ 6, అసిస్టెంట్ కమిషనర్ 5, గ్రేడ్-1 ఈవో 6, గ్రేడ్-3 ఈవో 104, 16 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయాలని సూచించారు. ఈ నియామక ప్రక్రియ త్వరగా పూర్తిచేసి ఆలయాలు సమర్ధవంతంగా నిర్వహించేలా చూడాలన్నారు. 200 వరకు ఉన్న వైదిక సిబ్బంది ఖాళీలను కూడా అర్హులైన వారితో భర్తీ చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. మంగళవారం సచివాలయంలో దేవాదాయ శాఖపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు.

ప్రతి భక్తుడికు అన్నప్రసాదం..

రాష్ట్రంలోని 23 ప్రధాన ఆలయాలు ఉండగా… వీటిలో శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం, బెజవాడ దుర్గమ్మ, అన్నవరం, ద్వారకా తిరుమల, సింహాచలం ఇలా 7 ఆలయాల్లో మాత్రమే నిత్యాన్నదానం జరుగుతోంది. మిగిలిన 16 ఆలయాల్లో కూడా భక్తులకు అన్నదాన పథకం అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

‘అన్నప్రసాదం’ రుచి, నాణ్యత, పరిశుభ్రత ఉండేలా భక్తులకు పవిత్ర భావన కలిగేలా అందించాలి. ఇందుకోసం వాలంటరీగా వచ్చేవారి సేవలను వినియోగించుకోవాలి. అన్నప్రసాద కార్యక్రమానికి ఆదాయం సరిపోని దేవాలయాలకు 7 ప్రధాన ఆలయాల నుంచి నిధులు సమకూర్చేలా చూడాలని సీఎం సూచించారు.

తిరుమల వెంగమాంబ అన్నప్రసాదం తరహాలో ప్రమాణాలు పాటించాలి. దేశంలో ఎక్కడా లేనట్టుగా రాష్ట్రంలో అన్నప్రసాద వితరణ జరగాలి. అలాగే ప్రసాదాల నాణ్యతపైనా దృష్టి పెట్టాలి. ఆయా ఆలయాల ప్రసాదాల విశిష్టత కొనసాగేలా చూడాలి. నాణ్యతా పరీక్షలను ఎప్పటికప్పుడు నిర్వహించాలని సీఎం ఆదేశించారు.

దశలవారీగా ప్రముఖ ఆలయాల అభివృద్ధి

రాష్ట్రంలోని అన్ని ఆలయాలను దశలవారీగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్న ముఖ్యమంత్రి, మొదటి దశలో 23 ఆలయాలకు సంబంధించి మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అధికారులకు సూచించారు. మాస్టర్ ప్లాన్‌ ఆగమ శాస్త్రానికి అనుగుణంగా ఉండాలని, టెంపుల్ టూరిజానికి ఇవి గ్రోత్ ఇంజిన్లు అయ్యేలా చూడాలని చెప్పారు.

‘దేవాలయ భూములు ఆక్రమణకు గురవ్వకుండా, ఆస్తులను పరిరక్షించేలా.. వాణిజ్య సంస్థలకు లీజుకు ఇచ్చేందుకు కమిటీ వేసి సమగ్ర విధానాన్ని తీసుకురావాలి. వచ్చే ఆదాయాన్ని తిరిగి ఆలయాల అభివృద్ధికి వినియోగించాలని ఈ క్రమంలో ఎక్కడా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలన్నారు. దేవాదాయ భూములు హోటళ్లకు లీజుకు ఇచ్చినప్పుడు అక్కడ శాఖాహారం మాత్రమే అందించేలా అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.

అన్ని నోటిఫైడ్ ఆలయాల్లో సీసీ కెమెరాలు

‘బాలాజీ ఆలయ నిర్మాణ నిధి’ ఏర్పాటు చేసి… రాష్ట్రంలో ప్రతీ నియోజకవర్గంలో ఒకటి చొప్పున కొత్త ఆలయం నిర్మాణం చేపట్టాలని, ఆలయాలు నిర్మించి, నిర్వహణ విస్మరించొద్దని చెప్పారు. ఆలయ కమిటీలను ఏర్పాటు చేయడం ద్వారా నిత్యం దూపదీప నైవేద్యాలు అందేలా చూడాలని దేవాలయాలపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం 50 వేలకు పైగా ఆదాయం ఉన్న ఆలయాల్లో మాత్రమే సీసీ కెమేరాలు ఉండగా… 6సీ కేటగిరీ కింద నోటిఫైడ్ అయిన 24,538 ఆలయాల్లోనూ సీసీ కెమేరాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

శ్రీశైల క్షేత్రం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

రాష్ట్రంలో ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం రెండూ కొలువైన ఒకే ఒక్క క్షేత్రం శ్రీశైలమని… తిరుమల తిరుపతి స్థాయిలో శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు ఆస్కారం ఉందని ముఖ్యమంత్రి అన్నారు. శ్రీశైలంలో దేవాదాయ శాఖ భూములు పరిమితంగా ఉన్నందున ప్రణాళికాబద్ధంగా వినియోగించుకోవాలని సూచించారు. ఇకపై ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులకు భూకేటాయింపుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలని స్పష్టం చేశారు. శ్రీశైలంలో వసతి గృహాలు ప్రభుత్వమే నిర్మించేలా చూడాలని చెప్పారు.

ఏడాదికి రూ.1,300 కోట్లకు పైగా ఆదాయం :

రాష్ట్రంలో మొత్తం నోటిఫైడ్ ఆలయాలకు ఏడాదికి రూ.1,300 కోట్లకుపైగా ఆదాయం వస్తోందని, అందులో రూ.850 కోట్లు టాప్ 7 ఆలయాల నుంచి సమకూరుతోందని అధికారులు ముఖ‌్యమంత్రికి చెప్పారు. రూ.5 లక్షలు కన్నా ఎక్కువ ఆదాయం వచ్చే ఆలయాల నుంచి 9 శాతం మొత్తాన్ని కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్) కింద జమచేస్తున్నారు.

2024-25లో సీజీఎఫ్‌కు రూ.149 కోట్లు రాగా… రాష్ట్రంలో వివిధ ఆలయాల్లో రూ.111 కోట్లతో 48 పనులు జరుగుతున్నాయి. మొత్తం నోటిఫైడ్ ఆలయాలు 25,028 కాగా, వీటిలో ప్రస్తుతం రూ.50 లక్షల పైన ఆదాయం వచ్చే 6ఏ కేటగిరి ఆలయాలు-169, రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షలు వరకు ఆదాయం ఆర్జిస్తున్న 6బీ కేటగిరీ ఆలయాలు-321, రూ.15 లక్షలు కన్నా తక్కువ ఆదాయం వచ్చే 6సీ కేటగిరీ ఆలయాలు-24,538 ఉన్నాయి.

Sarath Chandra.B

TwittereMail
శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం

టాపిక్

Chandrababu NaiduTdpTemplesAp JobsJobs
Source / Credits

Best Web Hosting Provider In India 2024