




Best Web Hosting Provider In India 2024

మళ్లీ తెరపైకి తెలంగాణ క్యాబినెట్ విస్తరణ.. రేవంత్ రెడ్డికి హస్తిన పిలుపు.. జోరుగా ఊహాగానాలు
తెలంగాణ కాంగ్రెస్ నేతల్ని ఎప్పటి నుంచో ఊరిస్తోన్న మంత్రి వర్గ విస్తరణ మళ్లీ తెరపైకి వచ్చింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి హస్తిన నుంచి పిలుపు రావడంతో మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి బుధవారం ఢిల్లీ వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు బుధవారం ఢిల్లీకి రావాలంటూ కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి పిలుపు అందినట్టు ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి పర్యటనతో మంత్రివర్గ విస్తరణపై స్పష్టత వస్తుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.
కాంగ్రెస్ అధిష్టానం పిలుపుతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌లతో కలిసి బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు.
కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నుంచి వచ్చిన పిలుపు కావడంతో.. తెలంగాణలో ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం తీసుకునే అవకాశముందని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌లు రాష్ట్ర నేతలతో గతంలో పలు దఫాలుగా చర్చించారు.
రెండు నెలల క్రితమే మంత్రి వర్గ విస్తరణ అంటూ హడావుడి జరిగినా ఎటూ తేల్చలేదు. చివరిసారిగా అందరి అభిప్రాయాలు తీసుకొని, మంత్రి వర్గ విస్తరణపై నిర్ణయాన్ని తెలియ చేస్తామని చెప్పారు.ఆ తర్వాత ఎలాంటి కదలిక లేకుండా ఉండిపోయింది.
బుధవారం తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు ఢిల్లీకి రావాలని మంగళ వారం రాత్రి పిలుపు రావడంతో మంత్రివర్గ విస్తరణపైనే భేటీ ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. బుధవారం సాయంత్రం నీటిపారుదల శాఖకు చెందిన వివిధ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి పాల్గొనాల్సి ఉండగా ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో వాటిని రద్దు చేశారు.
తెలంగాణ మంత్రివర్గంలో ఆరు ఖాళీలు ఉండగా వాటిని ఆశిస్తున్న వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. తాజా విస్తరణలో నలుగురికి అవకాశం దక్కొచ్చని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. వీరిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, శ్రీహరి ముదిరాజ్, జి. వివేక్, పి.సుదర్శన్ రెడ్డి వంటి వారికి మంత్రి వర్గంలో చోటు దక్కుతుందని ప్రచారం జరుగుతోంది.
సంబంధిత కథనం
టాపిక్