ఆపరేషన్ సింధూర్ యుద్ధచర్యకు సింధూరం పేరు ఎందుకు? భారతీయ సంస్కృతిలో సింధూరానికున్న ప్రాముఖ్యత ఏమిటి?

Best Web Hosting Provider In India 2024

ఆపరేషన్ సింధూర్ యుద్ధచర్యకు సింధూరం పేరు ఎందుకు? భారతీయ సంస్కృతిలో సింధూరానికున్న ప్రాముఖ్యత ఏమిటి?

 

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఆపరేషన్ సింధూర్ మొదలైంది. భారతదేశ సంస్కృతిలో సింధూరం ఒక భాగం. ఉగ్రవాదులను ఏరి వేసే చర్యకు సింధూర్ పేరును ఎందుకు పెట్టారు?

 
ఆపరేషన్ సింధూర్
 

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని భారతీయులు ఎప్పటికీ మర్చిపోలేరు. కొత్తగా పెళ్లై హనీమూన్ కోసం పహల్గాం వెళ్లిన జంట ఆరు రోజుల్లోనే శాశ్వతంగా విడిపోయింది. నుదుటి సింధూరంతో పహల్గాంలో అడుగుపెట్టిన పెళ్లికూతురు ఇంటికి చేరే సరికి ఆ సింధూరం కరిగిపోయింది.

 

ఉగ్రవాదులంతా ఆడవారి ఎదురుగానే వారి భర్తలను చంపేశారు. వారి నుదిటి సింధూరాన్ని తుడిచేశారు. అందుకే ఉగ్రవాదులను ఏరివేసే ఈ యుద్ధ చర్యకు ఆపరేషన్ సింధూర్ అనే పేరును పెట్టారు. భారతీయ సంస్కృతిలో సింధూరానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.

వైవాహిక జీవితంలో సింధూరమే ముఖ్య చిహ్నం. అలాంటి సింధూరాన్ని చెరిపేసిన వ్యక్తులకు ఎలాంటి విలువ ఉండదు. తమ దేశ మహిళల నుదుటిన సింధూరాన్ని చెరిపేసిన ఉగ్రవాదులను నిర్మూలించేందుకే ఆపరేషన్ సింధూర్ మొదలైంది.

కాశ్మీర్లో స్వర్గంలాంటి ప్రాంతం పహల్గామ్. ఏప్రిల్ 22, 2025లో భయంకరమైన ఉగ్రచర్యకు 26 మంది బలైపోయారు. వచ్చిన వారి మతాన్ని అడిగి మరి మగవారిని టార్గెట్ చేసి చంపారు. ఎందరో భారతీయ సోదరీమణులు, తల్లులు, కుమార్తెలు జీవిత భాగస్వామిని కోల్పోయి జీవితంలో కుంకుమను ధరించే అర్హతను పూర్తిగా కోల్పోయారు.

ఆపరేషన్ సింధూర్ పేరు ఎందుకు?

పహల్గామ్ ఉగ్రచర్యకు ఆపరేషన్ సింధూర్‌తో భారత్ ప్రతీకారం తీర్చుకుంది. శక్తివంతమైన సాంస్కృతిక ప్రతిస్పందనను రేకెత్తించడానికి ఆపరేషన్ సింధూర్ అనే పేరును ఎంచుకున్నారు. ఆపరేషన్ సింధూర్ వ్యూహాన్ని ముందే సిద్ధం చేసుకుని మే 7వ తేదీ అర్ధరాత్రి అమలు చేశారు. ఈ దాడి పహల్గామ్ ఉగ్ర చర్యలో మరణించిన 26 మంది భారతీయులకు నిజమైన నివాళి.

 

సింధూరం ప్రాముఖ్యత

భారతీయ సంస్కృతిలో సింధూరానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వివాహత స్త్రీలకు ఇది ముఖ్యం. ఇది ఒక స్త్రీకి పెళ్లి అయిందని సూచించే చిహ్నం. అంతేకాదు భర్త దీర్ఘాయువు కోసం ప్రతిరోజు భార్యలు సింధూరాన్ని ధరించాలి. పెళ్లి తంతులోనే వరుడి చేత వధువు నుదుటిన సింధూరాన్ని పూజిస్తారు. ఆ రోజు నుంచి ఆమె వివాహిత అని ప్రకటించినట్టు లెక్క. ప్రతిరోజూ భార్య సింధూరం తన నుదుటిన పూసుకోవడం ద్వారా భర్త దీర్ఘాయువును, సుఖాన్ని ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు అర్థం. సింధూరం పూసిన స్త్రీని పుణ్యస్త్రీగా పరిగణిస్తారు.

పురాణాల ప్రకారం శివుని భార్య అయిన పార్వతీ తన భర్త పట్ల ఉన్న భక్తిని చాటి చెప్పేందుకే నుదుటిపై సింధూరాన్ని ధరించేదని అంటారు. సింధూరం అంటే శివునికి కూడా ఎంతో ఇష్టమట. నుదుటిపై సింధూరాన్ని ధరించే స్త్రీలు ఆనందకరమైన వైవాహిక జీవితాన్ని కలిగి ఉంటారని కూడా పురాణాల ప్రకారం ఒక నమ్మకం. అంతేకాదు సింధూరాన్ని ధరించిన స్త్రీ జోలికి దుష్ట ఆత్మలు రావని చెబుతారు. సింధూరం రక్తం రంగులో ఉంటుంది. ఇది అగ్ని కీలలను సూచిస్తుంది. కాబట్టి సింధూరాన్ని బలమైన శక్తిగా చెప్పుకోవచ్చు. సింధూరం ధరించిన స్త్రీ మరింత శక్తివంతురాలు అవుతుందని కూడా పురాణాలు చెబుతున్నాయి.

 

హిందూ స్త్రీలు కచ్చితంగా సింధూరాన్ని నుదుటిన ధరించాలి. పెళ్లిలో వరుడు.. వధువు నుదుటిపై సింధూరం పెట్టడం ద్వారా ఆ అమ్మాయి వైవాహిక స్థితి మారిపోతుంది. అంతవరకు అవివాహితగా ఉన్న అమ్మాయి భార్యగా రూపాంతరం చెందుతుంది. అలాగే వరుడు తల్లి తన కోడల్ని ఇంట్లోకి ఆహ్వానించేటప్పుడు కూడా నుదుటిన సింధూరం పెట్టి స్వాగతిస్తుంది.

భారతీయ స్త్రీలు నుదుటిన సింధూరం పెట్టుకునే ఆచారం ఈనాటిది కాదు. వేద కాలం నుండి వచ్చిందని చెబుతారు. తలపై ఉన్న జుట్టును రెండు భాగాలుగా చీలిస్తే పాపిట ఏర్పడుతుంది. ఆ పాపిట్లోనే ఈ సింధూరాన్ని ధరిస్తారు. భారతీయ హిందూ స్త్రీలు పాటించే 16 అలంకారాలలో సింధూరాన్ని ధరించడం కూడా ఒకటని చెబుతారు.

Source / Credits

Best Web Hosting Provider In India 2024