





Best Web Hosting Provider In India 2024

మూడే పదార్థాలతో మామిడికాయ జామ్ ఇలా చేసేయండి, రెసిపీ ఇదిగో
మ్యాంగో జామ్ బయటకొనే కన్నా ఇంట్లోనే చాలా సింపుల్ గా చేసేయొచ్చు. మూడే మూడు పదార్థాలతో మామిడి జామ్ ఎలా చేయాలో తెలుసుకోండి. రెసిపీ చాలా సులువు.
మామిడికాయల సీజన్‌లో వాటితో చేసిన ఆహారాలు కచ్చితంగా తినాల్సిందే. సీజనల్‌గా దొరికే ఆహారాలు తినడం వల్ల శరీరానికి కొత్త శక్తి వస్తుంది. మామిడి కాయలు వేసవిలోనే దొరుకుతాయి. కాబట్టి మామిడితో చేసే కుల్ఫీలు, మామిడి పన్నా వంటి వంటకాలను తయారుచేసుకుని తినేవారి సంఖ్య ఎక్కువే.
ఇక్కడ మేము మామిడికాయ జామ్ రెసిపీ ఇచ్చాము. దీన్ని వండడానికి పెద్దగా కష్టపడక్కర్లేదు. మూడే పదార్థాలు ఇంట్లో ఉంటే చాలు… ఒక్కసారి మామిడికాయ జామ్ తయారు చేసుకుంటే రెండు మూడు నెలల పాటు నిల్వ ఉంటుంది. బ్రెడ్ పై మామిడికాయ జామ్ అప్లై చేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. అలాగే రోటీతో తిన్నా కూడా టేస్టీగా ఉంటుంది. మామిడి మ్యాంగో జామ్ రెసిపీ ఎలాగో చూడండి.
మ్యాంగో జామ్ రెసిపీకి కావలసిన పదార్థాలు
మామిడి పండ్లు – మూడు
పంచదార – 300 గ్రాములు
నిమ్మరసం – ఒక స్పూను
మ్యాంగో జామ్ రెసిపీ
1. మీరు ఏ రకమైన మామిడి పండ్లను అయినా మామిడి జామ్ తయారు చేసుకోవడానికి తీసుకోవచ్చు.
2. అయితే ఎక్కువ గుజ్జు ఉన్న మామిడి పండును తీసుకోవాల్సిన అవసరం ఉంది.
3. ముందుగా మామిడికాయని తొక్కి తీసి లోపల గుజ్జును ఒక గిన్నెలో వేయండి.
4. దాని మిక్సీలో వేసి ఒకసారి రుబ్బితే మృదువైన ప్యూరీలా మారుతుంది.
5. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి పంచదారను వేయండి.
6. అందులోనే మామిడికాయల ప్యూరీ కూడా వేసి చిన్న మంట మీద కలపండి. చక్కెర నెమ్మదిగా కరుగుతూ పాకం లాగా తయారవుతుంది.
7. ఒక ఆరేడు నిమిషాల తర్వాత ఒక టీ స్పూన్ నిమ్మరసం కూడా వేసి బాగా కలపండి.
8. ఈ మొత్తం మిశ్రమాన్ని మరొక ఐదు నిమిషాలు పాటు ఉడికించాలి.
9. దాని రంగు కాస్త పారదర్శకంగా మారడం ప్రారంభమవుతుంది. లేదా బుడగలు రావడం కనిపిస్తుంది.
10. అలాంటి సమయంలో పైన మూతను పెట్టాలి. అయితే పూర్తిగా కళాయి కప్పేటట్టు పెట్టకుండా.. సగం కప్పినట్టు మూతను పెట్టండి.
11. ఆ తర్వాత ఆ మూతను తీసి జామ్ కొద్దిగా పలుచగా అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి.
12. అంతే టేస్టీ మ్యాంగో జామ్ తయారైనట్టే.
మ్యాంగో జామ్ నిల్వ చేయడానికి తడి లేని గాజు జాడీని తీసుకోండి. అందులో వేసుకుంటే రెండు మూడు నెలల వరకు తాజాగా ఉంటుంది. గాజు పాత్రలే నిల్వ ఉంచేందుకు ఉత్తమమైనవి. రోటీ, బ్రెడ్, బిస్కెట్లపై జామ్ ను రాసి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ జామ్ ఒకసారి చేసుకుని చూడండి… మీకు కూడా చాలా సులువుగా అనిపిస్తుంది.