భారత్ వర్సెస్ పాకిస్థాన్ పోరు.. ఐపీఎల్ రద్దు? రేపు బీసీసీఐ అత్యవసర భేటీ.. కీలక నిర్ణయం దిశగా అడుగులు

Best Web Hosting Provider In India 2024


భారత్ వర్సెస్ పాకిస్థాన్ పోరు.. ఐపీఎల్ రద్దు? రేపు బీసీసీఐ అత్యవసర భేటీ.. కీలక నిర్ణయం దిశగా అడుగులు

ఐపీఎల్ 2025 రద్దయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రేపు (మే 9) బీసీసీఐ అత్యవసర భేటీ నిర్వహించనుంది.

ధర్మశాల స్టేడియం నుంచి వెళ్లిపోతున్న ప్రేక్షకులు (AFP)

భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025 సీజన్ రద్దయ్యేలా ఉంది. ఆ దిశగా బీసీసీఐ నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఐపీఎల్ 18 మధ్యలోనే రద్దయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. శుక్రవారం (మే 9) బీసీసీఐ అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించబోతుంది. ఈ భేటీలో ఐపీఎల్ ను కొనసాగించాలా? వద్దా? అనే విషయంపై చర్చించబోతున్నారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో లీగ్ కొనసాగడం సందేహమే.

మ్యాచ్ రద్దు

పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ ‘ఆపరేషన్ సింధూర్’లో భాగంగా మెరుపు దాడి చేసిన సంగతి తెలిసిందే. దీంతో పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు దిగింది. సరిహద్దు వెంబడి కాల్పులకు పాల్పడుతోంది. ఇతర ప్రాంతాలపైనా దాడులు చేస్తోంది. దీంతో ముందు జాగ్రత్తగా గురువారం (మే 8) ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ను మధ్యలోనే రద్దు చేశారు.

ఒకవైపు మాత్రమే ఫ్లడ్ లైట్లను ఉంచి ప్లేయర్స్, ఫ్యాన్స్ ను స్టేడియం నుంచి పంపించేశారు. ఇక ఇప్పటికే ధర్మశాలలో మే 11న జరగాల్సిన ముంబయి ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ ను అహ్మదాబాద్ కు షిఫ్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ప్రాణాల కోసం

ప్రస్తుత పరిస్థితుల్లో ఐపీఎల్ నిర్వహించి ఎందుకు రిస్క్ తీసుకోవడమని బీసీసీఐ ఆలోచిస్తుందని సమాచారం. ప్రభుత్వ పెద్దలు కూడా ఇదే అనుకుంటున్నారని తెలిసింది. ఒకవేళ మ్యాచ్ సమయంలో ఏదైనా అనుకోనిది జరిగితే వాటిల్లే ప్రాణ నష్టం మామూలుగా ఉండదు. అందుకే ముందు జాగ్రత్తగా లీగ్ నే రద్దు చేస్తే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆటగాళ్లు, అభిమానుల ప్రాణాలను రిస్క్ లో పెట్టడం సరికాదనే అంటున్నారు.

ఇంకా 16 మ్యాచ్ లు

ఐపీఎల్ 2025 లో గురువారం వరకూ 58 మ్యాచ్ లు కంప్లీట్ అయ్యాయి. ఈ సీజన్ పూర్తి కావాలంటే ఇంకా 16 మ్యాచ్ లు జరగాలి. షెడ్యూల్ ప్రకారం ఫైనల్ మే 25న జరగాల్సి ఉంది. కానీ ప్రస్తుత యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో సీజన్ మధ్యలోనే రద్దయ్యే అవకాశం ఉంది.

పాయింట్ల పట్టిక ఇలా

ప్రస్తుతం పాయింట్ల టేబుల్ లో గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ 16 చొప్పున పాయింట్లతో వరుసగా తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. జీటీ నెట్ రన్ రేట్ 0.793 కాగా.. ఆర్సీబీది 0.482. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ (15 పాయింట్లు), ముంబయి ఇండియన్స్ (14), ఢిల్లీ క్యాపిటల్స్ (13), కేకేఆర్ (11), లక్నో సూపర్ జెయింట్స్ (10), సన్ రైజర్స్ హైదరాబాద్ (7), రాజస్థాన్ రాయల్స్ (6), చెన్నై సూపర్ కింగ్స్ (6) వరుసగా మూడు నుంచి పది స్థానాల్లో ఉన్నాయి.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం


Best Web Hosting Provider In India 2024


Source link