‘హైడ్రా’ పోలీస్ స్టేషన్ ప్రారంభం – మానవీయ కోణంలో పనిచేయాలని సీఎం రేవంత్ సూచన

Best Web Hosting Provider In India 2024

‘హైడ్రా’ పోలీస్ స్టేషన్ ప్రారంభం – మానవీయ కోణంలో పనిచేయాలని సీఎం రేవంత్ సూచన

Maheshwaram Mahendra Chary HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Maheshwaram Mahendra Chary HT Telugu

హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభమైంది. హైడ్రా కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ పోలీస్ స్టేషన్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన తర్వాత… వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. హైడ్రా కోసం ప్రత్యేకంగా రూపొందించిన వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు.

హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభం
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on Facebook

హైడ్రా కోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటైంది. దీన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ప్రారంభించారు. అంతేకాకుండా హైడ్రాకు కేటాయించిన 122 వివిధ వాహనాలకు జెండా ఊపి ప్రారంభించారు. హైడ్రా కోసం ప్రత్యేకంగా రూపొందించిన వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. హైదరాబాద్ వారసత్వ సంపదను కాపాడుకుంటూ…. ఇక్కడి ప్రకృతిని పరిరక్షిస్తూ దీన్ని ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. సహజ వనరులు, సంపద కాలగర్భంలో కలిసిపోతున్న తరుణంలో ఈ నగరాన్ని పునరుద్ధరించాలన్న ఆలోచనతోనే హైడ్రాను ప్రారంభించామని వివరించారు.

“హైడ్రా అంటే ఇదేదో కేవలం పేదల ఇండ్లు కూల్చడానికన్నట్టు కొందరు చిత్రీకరిస్తున్నారు. శాఖల మధ్య సమన్వయ లోపం వల్ల నగరంలో తలెత్తే సమస్యలు ఎవరు పరిష్కరించాలన్న విషయంలో ఇబ్బందులు తలెత్తాయి. ఈ విషయాన్ని గమనించి నిపుణులతో చర్చించి హైడ్రాను తెచ్చాం” అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

హైడ్రాపై అతిపెద్ద బాధ్యత….

“హైడ్రాపై అతిపెద్ద సామాజిక బాధ్యత పెట్టాం. ఇందులో పనిచేసే వారికి ఉద్యోగం కాదు. కాజ్యువల్ గా పనిచేస్తే కుదరదు. హైడ్రా మానవీయ కోణంలో పనిచేయాలి. నిరుపేదల పట్ల ప్రేమతో, పెద్దొళ్ల పట్ల కఠినంగా వ్యవహరించాలి. పేదవారిని ఆదుకోవడానికి ప్రత్యామ్నాయ ప్రణాళికలు తయారు చేయాలి. వారికి అవసరమైన అన్ని వసతులు ప్రభుత్వం కల్పిస్తుంది” అని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.

“ఇది ఓల్డ్ సిటీ కాదు, ఒరిజినల్ సిటీ. దీన్ని పునరుద్దరించుకోవలసిన అవసరం ఉంది. బెంగుళూరులో నీటి నిలువలను ఒడిసిపట్టుకునే పరిస్థితి లేక వలసపోయే దుస్థితి వచ్చింది. చిన్న వరదలు వచ్చినా ముంబయ్, చెన్నై వరదల మయమైపోయాయి. దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యం నియంత్రించని కారణంగా పార్లమెంట్ నుంచి పాఠశాలల వరకు సెలవులు ప్రకటించుకోవలసిన పరిస్థితి వచ్చింది. దేశంలోని మెట్రోపాలిటన్ సిటీలు నివసించడానికి యోగ్యం కాని నగరాలుగా మారుతున్నాయి. అలాంటి ఉపద్రవాల నుంచి గుణపాఠం నేర్చుకోకపోతే హైదరాబాద్ నగరం కూడా వాటి జాబితాలో చేరుతుంది” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

వారే భయపడుతున్నారు – సీఎం రేవంత్ రెడ్డి

రాజధాని నగర అభివృద్ధిలో హైడ్రా భాగస్వామి అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. “అన్ని శాఖల సమన్వయంతో హైడ్రా అనేక పనులు చేస్తుంది. వర్షాలొస్తే, వరదలొస్తే కాలనీలకు కాలనీలే నీళ్లల్లో మునిగిపోతున్నాయి. చిన్న గాలొస్తే చెట్లు విరిగి పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నీళ్లను తొలగించడానికి, కరెంట్ పోతే పునరుద్దరించడానికి, వరదలు వస్తే చిక్కుకున్న వారిని రక్షించుకోవడానికి హైడ్రా పనిచేస్తుంది. మూసీని ప్రక్షాళన చేయాల్సిన అవసరంపై ప్రజలే అప్రమత్తం కావాలి. చెరువులు, నాలాల్లో ప్రవహించాల్సిన నీరు ఇళ్లల్లో పారుతుంటే వాటిని కాపాడుకోవలసిన అవసరం లేదా…? మూసీలో బతకాలని ఏ పేదవారైనా అనుకుంటారా. నగరంలో 491 చెరువులు, పెద్ద పెద్ద నాలాలు కబ్జాలకు గురయ్యాయి. ఎవరైతే మూసీ ఆక్రమణలను ప్రోత్సహించారో, ఎవరైతే నాలాలను ఆక్రమించారో వారే హైడ్రా అంటే భయపడుతున్నారు” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.

తొందరలోనే మూసీ పరీవాహక ప్రాంత ప్రజల దగ్గరకు ప్రజా ప్రతినిధులు, అధికారులను పంపిస్తామని సీఎం ప్రకటించారు. వారితో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయిస్తామన్నారు. “వారి జీవితాలకు మంచి వెలుగు ఇవ్వాలని అనుకుంటున్నా. కావాలంటే వారందరికీ మరో ప్రాంతంలో ఇళ్ల పట్టాలిస్తాం. మూసీ మురికికూపంలో ఎందుకు బతకాలి. ప్రభుత్వ భూములున్న చోట వారికి అపార్ట్ మెంట్లు కట్టి ఇళ్లిస్తాం. ఆ కుటుంబాలు గౌరవంగా బతకడానికి ఏర్పాటు చేస్తాం” అని సీఎం రేవంత్ రెడ్డి సమగ్రంగా వివరించారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

టాపిక్

HyderabadTelangana NewsHydraCm Revanth ReddyRanganath Ips
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024