



Best Web Hosting Provider In India 2024

ఐస్ బకెట్ ఛాలెంజ్ గురించి మీకు ఎంత తెలుసు? బిల్ గేట్స్, లెబ్రాన్ జేమ్స్ వంటి ప్రముఖులు ఇందులో ఎందుకు పాల్గొన్నారు?
ఐస్ బకెట్ ఛాలెంజ్: ఒకప్పుడు సోషల్ల్ మీడియాలో సంచలనం సృష్టించిన ఐస్ బకెట్ ఛాలెంజ్ మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో లక్షలాది డాలర్లను విరాళంగా సేకరించిన ఈ ఉద్యమం ఇప్పుడు మరో ముఖ్యమైన లక్ష్యంతో మన ముందుకు వస్తోంది. ఏమిటా లక్ష్యం? ఈ ఛాలెంజ్ మళ్లీ ఎందుకు ట్రెండ్ అవుతోంది? తెలుసుకుందాం రండి.
మీకు గుర్తుందా! 2014లో ఒక వింత ఉద్యమం ప్రపంచాన్ని కుదిపేసింది. అదే ఐస్ బకెట్ ఛాలెంజ్. సెలబ్రిటీల నుండి సామాన్యుల వరకు అందరూ దీంట్లో పాల్గొని తలపై చల్లటి నీటిని పోసుకుంటూ, మరొకరిని సవాలు విసిరారు. ఆ రోజుల్లో అది కేవలం ఒక సరదా ట్రెండ్ మాత్రమే కాదు, అరుదైన వ్యాధి అయిన ALS (అమియోట్రోఫిక్ లాటరల్ స్క్లెరోసిస్) పరిశోధన కోసం ఊహించని స్థాయిలో విరాళాలను సేకరించింది. ఇప్పుడు, దాదాపు ఒక దశాబ్దం తర్వాత, అదే ఐస్ బకెట్ ఛాలెంజ్ మళ్లీ ట్రెండ్ అవుతోంది.
అయితే ఈసారి లక్ష్యం మరింత ముఖ్యమైనది, మరింత మానవీయమైనది. ఇంతకీ ఏంటా కొత్త లక్ష్యం? గతంలో ఒక వ్యాధిపై పోరాడిన ఈ ఉద్యమం, ఇప్పుడు దేని కోసం గళం విప్పుతోంది? సోషల్ మీడియాలో మళ్లీ ఎందుకు ఈ హడావుడి? వంటి ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం రండి..
ఐస్ బకెట్ ఛాలెంజ్ అంటే ఏమిటి?
2014లో ఐస్ బకెట్ ఛాలెంజ్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రాథమికంగా లౌ ಗೆహ్రిగ్ వ్యాధి అని పిలువబడే ALS (అమియోట్రోఫిక్ లాటరల్ స్క్లెరోసిస్) గురించి అవగాహన కల్పించడానికి దీనిని రూపొందించారు. ఈ ఛాలెంజ్‌ను స్వీకరించిన వారు తమ తలపై ఒక బకెట్ ఐస్ నీటిని పోసుకోవాలి. ఆ విధంగా అమియోట్రోఫిక్ లాటరల్ స్క్లెరోసిస్ పరిశోధనకు విరాళం ఇవ్వడానికి లేదా ఐస్ బకెట్ ఛాలెంజ్‌ను స్వీకరించడానికి సవాలు విసురుతారు. ఈ ఛాలెంజ్ వినడానికి కాస్త సులభం అనిపించినప్పటికీ ఇది ఇంటర్నెట్‌లో వైరల్ అయింది. ALS కార్యకర్తలు ప్యాట్ క్విన్, పీట్ ఫ్రేట్స్ ఈ ఉద్యమానికి నాయకత్వం వహించారు. సోషల్ మీడియా శక్తిని మంచి ప్రయోజనం కోసం ఉపయోగించడానికి ప్రయత్నించారు. వారి శ్రమ వృథా కాలేదు. ఈ సవాలు సోషల్ మీడియా ద్వారా అందరినీ ప్రభావితం చేసి, సెలబ్రిటీలు, క్రీడాకారులు, సహా అనేక మందికి చేరింది. టేలర్ స్విఫ్ట్, లెబ్రాన్ జేమ్స్, బిల్ గేట్స్ వంటి ప్రముఖులు పాల్గొనడంతో ఇది ప్రపంచవ్యాప్త ట్రెండింగ్ విషయంగా మారింది.
కొత్త ఉద్దేశ్యంతో తిరిగి వచ్చిన ఐస్ బకెట్ ఛాలెంజ్:
ఈసారి ఐస్ బకెట్ ఛాలెంజ్ దృష్టి మానసిక ఆరోగ్య అవగాహనపై కేంద్రీకృతమై ఉంది. దక్షిణ కెరొలినా విశ్వవిద్యాలయంలో 21 ఏళ్ల విద్యార్థి వేడ్ జెఫెర్సన్ ఈ కాన్సెప్ట్‌ను పునరుద్ధరించారు. మానసిక ఆరోగ్యం గురించి చర్చలను ప్రోత్సహించడానికి జెఫెర్సన్ MIND (మానసిక అనారోగ్య చర్చ అవసరాలు) అనే మానసిక ఆరోగ్య అవగాహన క్లబ్‌ను స్థాపించారు. మానసిక ఆరోగ్యం అనేది చాలామంది చర్చించడానికి సంకోచించే, సమాజంలో ఒక కళంకంగా పరిగణించబడే అంశం.
జెఫెర్సన్ ప్రారంభించిన #SpeakYourMIND ఉద్యమం, మానసిక అనారోగ్యంతో పోరాడుతున్న వారికి మద్దతుగా తమ తలపై ఐస్ నీటిని పోసుకోవడానికి ప్రజలను ప్రోత్సహిస్తుంది. ఈ సవాలు ముఖ్యంగా ఇటీవలి కాలంలో అనేక మానసిక సమస్యలు, గందరగోళాలను ఎదుర్కొంటున్న యువతలో మానసిక ఆరోగ్యం గురించి అవగాహన పెంచడానికి, దాని గురించి మాట్లాడటం ప్రారంభించడానికి ఉద్దేశించింది. చాలామంది యువత తమ సమస్యలను ఎవరితో చెప్పుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రచారం యాక్టివ్ మైండ్స్ అనే లాభాపేక్షలేని సంస్థకు విరాళాలు ఇవ్వడానికి కూడా ప్రోత్సహిస్తుంది. ఈ సంస్థ కళాశాల విద్యార్థులలో మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి అంకితభావంతో పనిచేస్తుంది.
ఈ ఛాలెంజ్‌పై విమర్శలు కూడా వస్తున్నాయి
చెప్పుకోలేని, చర్చించడానికి సంకోచించే వివిధ రకాల మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నవారికి ఈ ప్రచారం వరం కావచ్చు. అయినప్పటికీ కొందరు ఇది మానసిక ఆరోగ్యానికి ఎలా సంబంధం కలిగి ఉందో ప్రశ్నిస్తున్నారు. ఎవరూ నేను మానసిక రోగిని అని సమాజంలో, స్నేహితుల ముందు చూపించుకోవడానికి ఇష్టపడరు. అలాంటి వారిని ఇతరులు నామినేట్ చేసి ఐస్ బకెట్ ఛాలెంజ్ స్వీకరించమంటే వారు మరింత ఒత్తిడికి గురవుతారు. అంతేకాకుండా దీనివల్ల వారు సమాజం నుండి దూరంగా ఉండవచ్చు. అందుకే దీని ఉద్దేశ్యం సరైనది కాదని కొందరు అంటున్నారు.