





Best Web Hosting Provider In India 2024

వెన్నులో వణుకు పుట్టించే మలయాళం హారర్ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేసింది.. ఐఎండీబీలో 8.5 రేటింగ్..
ఓటీటీలోకి వెన్నులో వణుకు పుట్టించే మలయాళం హారర్ థ్రిల్లర్ మూవీ ఒకటి స్ట్రీమింగ్ కు వచ్చింది. థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ అయింది. ఐఎండీబీలో 8.5 రేటింగ్ సొంతం చేసుకున్న మూవీ ఇది.
ఈ వీకెండ్ ఓ మాంచి హారర్ థ్రిల్లర్ చూడాలనుకుంటున్నారా? అయితే మీకోసమే ఓ మలయాళం మూవీ ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా పేరు వడక్కన్ (Vadakkan). రెండు నెలల కిందట అంటే మార్చి 7న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ అయింది. అంతేకాదు ఓటీటీలోకి అడుగుపెట్టిన తొలి రోజే టాప్ 10 ట్రెండింగ్ లిస్ట్ లోకి వచ్చేసింది.
వడక్కన్ ఓటీటీ స్ట్రీమింగ్
మలయాళం హారర్ థ్రిల్లర్ మూవీ వడక్కన్ శుక్రవారం (మే 9) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. కిశోర్ లీడ్ రోల్లో నటించిన సినిమా ఇది. కేవలం గంటా 50 నిమిషాల నిడివితోనే వచ్చింది.
మార్చి 7న థియేటర్లలో రిలీజ్ కాగా.. అక్కడ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఓటీటీలోనూ తొలి రోజు నుంచే సత్తా చాటుతోంది. ప్రైమ్ వీడియో టాప్ 10 ట్రెండింగ్ మూవీస్, వెబ్ సిరీస్ జాబితాలో 10వ స్థానంలో నిలవడం విశేషం.
వడక్కన్ మూవీ గురించి..
వడక్కన్ మూవీని సాజీద్ డైరెక్ట్ చేశాడు. ఉన్ని ఆర్‌తో కలిసి అతడే కథ కూడా అందించాడు. కిశోర్ కుమార్ తోపాటు గ్రీష్మ అలెక్స్, గర్గి అనంతన్ లాంటి వాళ్లు లీడ్ రోల్స్ లో నటించారు. ఇది ఓ దీవిలో జరిగే స్టోరీ. అతీంద్రీయ శక్తుల గురించి పరిశోధించే వ్యక్తి.. హెల్సింకీ నుంచి కేరళలోని ఈ దీవికి వస్తారు.
అక్కడ జరిగిన ఓ రియాల్టీ షో షూటింగ్ లో వరుసగా ఒక్కొక్కరు హత్యలకు గురవడం గురించి తెలుసుకొని దాని సంగతేంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలో వాళ్లకు కూడా ఆ అతీంద్రీయ శక్తి నుంచి కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. అసలు అదేంటి? దాని నుంచి వాళ్లు సురక్షితంగా బయటపడతారా లేదా అన్నదే ఈ వడక్కన్ మూవీ.
వడక్కన్ అంటే ఉత్తర దిక్కు నుంచి వచ్చినది అని అర్థం. కేరళలోని ఉత్తర ప్రాంతంలోని జానపదాల ఆధారంగా ఈ వడక్కన్ మూవీని తీశారు. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో మలయాళం ఆడియో, ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో అందుబాటులోకి వచ్చింది.
సంబంధిత కథనం