



Best Web Hosting Provider In India 2024

ఈడీ తరహాలో ఆస్తులను ప్రభుత్వానికి అటాచ్ చేస్తాం.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సీరియస్ వార్నింగ్!
హైడ్రా.. ఈ పేరు మళ్లీ మారుమోగుతోంది. ఇటీవలే దీనికి సంబంధించిన పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా కూడా ఈడీ తరహాలో ఆస్తులను ప్రభుత్వానికి అటాచ్ చేస్తుందని స్పష్టం చేశారు. హైడ్రా పోలీస్ స్టేషన్ పనితీరు గురించి వివరించారు.
హైదరాబాద్ నగరంలో కబ్జాలు చేస్తే.. కఠిన చర్యలు ఉంటాయని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, పార్క్‌లు కబ్జాచేస్తే.. ఈడీ తరహాలో వారి ఆస్తులను ప్రభుత్వానికి అటాచ్ చేస్తామని హెచ్చరించారు. హైడ్రా పోలీస్‌స్టేషన్‌లో నేరుగా కేసులు నమోదు చేయరన్న రంగనాథ్.. ఫిర్యాదులపై ప్రాథమిక విచారణ జరిపిన తర్వాతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నాంపల్లి ఏసీజే ప్రత్యేక కోర్టులో.. హైడ్రా కేసులను విచారణ చేస్తారని వివరించారు. కబ్జా చేసినట్టు నిరూపణ అయితే జైలు శిక్ష పడుతుందని.. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు.
దయతో వ్యవహరించాలి..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మే 8వ తేదీన హైదరాబాద్‌లో మొట్టమొదటి హైడ్రా పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించారు. దీన్ని ముఖ్యంగా చెరువులు, పార్కులు, ప్రభుత్వ ఆస్తులు వంటి ముఖ్యమైన ప్రభుత్వ భూములను పరిరక్షించడానికి ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘పేద, బలహీన వర్గాల పట్ల మానవత్వం, దయతో వ్యవహరించాలి. అదే సమయంలో నీటి వనరులు, ప్రభుత్వ భూములపై అనధికారిక ఆక్రమణలను తొలగించాలి. పేదలకు సంబంధించిన కేసులను ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలి’ అని సీఎం సూచించారు.
హైడ్రా కోసం వాహనాలు..
హైడ్రా సిబ్బంది వినియోగం కోసం కొత్త వాహనాలను కూడా ముఖ్యమంత్రి ప్రారంభించారు. వీటిలో డీసీఎంలు, స్కార్పియో కార్లు, బైక్‌లు ఉన్నాయి. హైడ్రా కేవలం కూల్చివేతల సంస్థ కాదని, చట్టవిరుద్ధమైన ఆక్రమణల వల్ల నాలాలు మూసుకుపోవడం, స్వల్ప వర్షాలకే వరదలు రావడం వంటి సమస్యలను నివారించడానికి, ప్రజల ఆస్తులను రక్షించడానికి ఏర్పాటు చేసినట్టు ముఖ్యమంత్రి వివరించారు.
విపత్తు నిర్వహణ..
హైదరాబాద్ నగరంలో వరదలు, అగ్ని ప్రమాదాలు వంటి విపత్తుల సమయంలో ప్రజలు, ఆస్తులను రక్షించడానికి హైడ్రా త్వరగా స్పందిస్తుందని అధికారులు చెబుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ఎస్డీఎంఏ) వంటి ఇతర ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటుంది. భవిష్యత్తులో సంభవించే విపత్తులను అంచనా వేయడానికి రిస్క్ అసెస్మెంట్ డేటాబేస్‌ను కూడా హైడ్రా నిర్వహిస్తుంది.
కూల్చివేతలే కాదు..
నీటి నిలుపుదల, రోడ్లు దెబ్బతినడం, ఇతర విపత్తుల సమయంలోనూ హైడ్రా యాక్టివ్‌గా ఉంటుంది. ఆయా సమయాల్లో ట్రాఫిక్‌ను నియంత్రించడానికి.. ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకుంటుంది. తద్వారా ట్రాఫిక్ జామ్‌లను తగ్గించి, రాకపోకలకు అంతరాయం లేకుండా చూస్తుంది. హైడ్రా కేవలం కూల్చివేతలకే పరిమితం అని చాలామంది ప్రచారం చేస్తున్నారని.. కానీ హైడ్రా అనేక విధులు నిర్వర్తిస్తోందని అధికారులు వివరిస్తున్నారు.
సంబంధిత కథనం
టాపిక్