కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ మే 12: నీ కూతురిని తీసుకొచ్చా అత్తా: సుమిత్రతో కార్తీక్.. వణికిపోయిన జ్యోత్స్న.. పారు కంగారు

Best Web Hosting Provider In India 2024

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ మే 12: నీ కూతురిని తీసుకొచ్చా అత్తా: సుమిత్రతో కార్తీక్.. వణికిపోయిన జ్యోత్స్న.. పారు కంగారు

 

కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్ మే 12: దీపను శివన్నారాయణ ఇంటికి తీసుకెళతాడు కార్తీక్. సుమిత్రను శాంతపరిచేందుకు ప్రయత్నిస్తాడు. దీప నీ కూతురే అంటాడు. దీంతో జ్యోత్స్న వణికిపోతుంది. పారు నోరు పారేసుకుంటుంది. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.

 
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ మే 12: నీ కూతురిని తీసుకొచ్చా అత్తా: సుమిత్రతో కార్తీక్.. వణికిపోయిన జ్యోత్స్న.. పారు కంగారు
 

కార్తీక దీపం 2 నేటి (మే 12, 2025) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. మిమ్మల్ని ఎవరు పొడిచారో చూశారా అని ఆసుపత్రిలో బెడ్‍పై ఉన్న దీపను ఎస్ఐ ప్రశ్నిస్తాడు. పొడిచిన వ్యక్తి ఆడా, మగా అని ప్రశ్నిస్తాడు. మగవాడే అని దీప బదులిస్తుంది. ముసుగు వేసుకున్నందుకు గుర్తు పట్టలేకపోయానని అంటుంది. ఎవరి మీద అయినా అనుమానం ఉందా అని ఎస్ఐ అంటే లేదంటుంది. ఈ మధ్య ఎవరితోనైనా గొడవ పడ్డారా అని ఎస్ఐ అడుగుతాడు. లేదని దీప సమాధానం చెబుతాడు. జ్యోత్స్న కుటుంబం వారు ఎవరూ సంబంధం లేదన్నట్టు మాట్లాడుతున్నారని, ఆ మూడో వ్యక్తి ఎవరో తెలిస్తేనే ఈ హత్యాయత్నం ఎవరు చేశారని తెలుస్తుందని ఎస్ఐ చెబుతాడు. ఆ ఏరియాలోనే సీసీ టీవీ ఫుటేజ్ చూస్తామని చెప్పి ఎస్ఐ వెళ్లిపోతాడు. జ్యోత్స్న వాళ్ల ఇంటికి ఎస్ఐ ఎందుకు వెళ్లాడని కార్తీక్‍ను దీప అడుగుతుంది.

 

ఆ అవసరం జ్యోత్స్న, గౌతమ్‍లకే..

కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎవరి మీద అయినా డౌట్ ఉందా అని అడిగితే.. ఈ మధ్య జరిగిన కోర్టు గొడవలు చెప్పానని కార్తీక్ అంటాడు. జ్యోత్స్న మీద అనుమానం ఉందని చెప్పానని చెబుతాడు. ఎంక్వైరీకి వాళ్ల ఇంటికి వెళ్లారని అంటాడు. ఉన్న గొడవలు సరిపోవా.. వాళ్ల పేరు ఎందుకు చెప్పారని దీప అంటుంది. “నా భార్యను ఎవరు చంపాలనుకున్నారో నాకు తెలియాలి.. ఆ అవసరం ఎవరికి ఉంది.. ఒకటి జ్యోత్స్నకు.. రెండు గౌతమ్‍కు. నీ మాట కోసమే వెయిట్ చేశా. ఆ ముసుగు మనిషి మగాడు అని చెప్పావ్ కదా. వాడు గౌతమ్ ఎందుకు కాకూడదు” అని కార్తీక్ అంటాడు.

నా స్టైల్‍లో ఎంక్వైరీ చేస్తా

గౌతమ్‍పై కార్తీక్‍కు అనుమానం బలపడుతుంది. గౌతమ్ గురించి ఎస్‍ఐకు కూడా చెప్పనని, నా స్టైల్‍లో ఎంక్వైరీ చేస్తానని దీపతో కార్తీక్ అంటాడు. వాడే అయితే ఏం చేస్తానో తెలియదు దీప అని కార్తీక్ చెబుతాడు. కార్తీక్ బాబు అని దీప అంటే.. చంపను.. అలా చేస్తే వాడికి నాకు తేడా ఏంటని అంటాడు. ఆ ముసుగు మనిషి ఎవరో తెలిస్తే.. ఏం చేయాలో తర్వాత చెబుతానని కార్తీక్ ఆలోచిస్తాడు.

 

శివన్నారాయణ ఇంటికి కార్తీక్, దీప

దీపకు ఎలా ఉందో ఏంటో అని సుమిత్రతో దశరథ్ అంటాడు. బాగానే ఉందట, ఈరోజు డిశ్చార్జ్ చేస్తారట అని వెటకారంగా అంటుంది పారిజాతం. దీప వల్ల ఈ ఇల్లు పడుతున్న కష్టాలను చూసి.. ఎందుకైనా మంచిదని వివరాలు తెలుసుకున్నానని అంటుంది. దీపను మళ్లీ ఈ ఇంట్లో అడుగుపెట్టనివ్వనని సుమిత్ర చెబుతుంది. ఇంతలోనే దీపను శివన్నారాయణ ఇంటికి తీసుకొస్తాడు కార్తీక్. నన్ను ఇక్కడికి తీసుకొచ్చారేంటి అని కార్తీక్ అంటే.. నీ ఇంటికి నిన్ను తీసుకొచ్చానని కార్తీక్ బదులిస్తాడు. నా ఇల్లేంటి అని దీప ప్రశ్నిస్తే.. రా దీప చెబుతాను అని అంటాడు. తన అత్తామామ దశరథ్, సుమిత్ర అసలు కూతురు దీపే అని కార్తీక్‍కు తెలియడంతో వారి మళ్లీ దగ్గర చేసేందుకు కార్తీక్ ప్లాన్ మొదలుపెట్టేశాడు.

వద్దు గొడవలు అవుతాయి అని దీప అంటుంది. ఇన్నాళ్లు జరిగిన గొడవలు మనుషులను దూరం చేస్తే.. ఈ రోజు జరిగేది దగ్గర చేస్తుందని కార్తీక్ అంటాడు. అందరితో పాటు నీకు ఓ విషయం చెబుతా.. లోపలికి వెళదాం పదా అని చెబుతాడు. కత్తిపోటు వల్ల ఆపరేషన్ జరిగిన దీపను జాగ్రత్తగా పట్టుకొని ఇంట్లోకి వెళతాడు కార్తీక్. దీప ముఖం చూడాలంటేనే నాకు చిరాకు అని పారిజాతం అంటుంటేనే.. ఈ ఇంట్లో అడుగుపెడతారు కార్తీక్, దీప. వీడేంటి దీపను మన ఇంటికే తీసుకొస్తున్నాడని పారిజాతం అరుస్తుంది.

 

నీ కూతురిని నీ ఇంటికి తీసుకొచ్చా

పేషెంట్‍వి కదా.. నిలబడలేవు అని దీపను కూర్చొబెడతాడు కార్తీక్. దీపను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావని సుమిత్ర అరుస్తుంది. “నీ కూతురిని నీ ఇంటికి కాక ఇంకెక్కడికి తీసుకెళతా అత్తా” అని కార్తీక్ అంటాడు. దీంతో అందరూ అయోమయంగా చూస్తారు. కూతురు ఏంటి అని పారిజాతం ప్రశ్నిస్తుంది. చాలా చెప్పాలి పారు.. చెప్పాలంటే అందరూ ఉండాలి కదా అని కార్తీక్ అంటాడు. నీకు ఎలా ఉంది మామయ్య అని దశరథ్‍ను పలుకరిస్తాడు.

పారిజాతం కంగారు

మంచి వాళ్లకు ఏమీ కాదు.. ఏదైనా జరిగితే చూసుకోవడానికి దేవుడు అంటాడు కార్తీక్ అంటాడు. పారిజాతం వైపు వెరైటీగా చూస్తాడు. పుట్టిన వెంటనే దీప స్థానంలో జ్యోత్స్నను పారిజాతం పెట్టిన విషయాన్ని కార్తీక్ గుర్తు చేసుకుంటాడు. వీడేంటి నన్ను తేడాగా చూస్తున్నాడని పారిజాతం కంగారు పడుతుంది. దేవుడు.. పాపాలు అంటాడేంటి అని ఆలోచిస్తుంది. నువ్వు చేసిన పనికి పనిష్మెంట్ మామూలుగా ఉండదని మనసులో అనుకుంటాడు కార్తీక్. ఏంటి అలా చూస్తున్నావని పారిజాతం అడుగుతుంది. అన్నీ అందరికీ అర్థమయ్యేలా వచ్చానని కార్తీక్ అంటాడు. తాత.. తాత అని పిలుస్తాడు.

మీ నానమ్మ పాపానికి ప్రతిరూపం

ఇంతలో జ్యోత్స్న వస్తుంది. దీపను చంపాలనుకున్నది, తనపై దాడి చేసింది జ్యోత్స్నే అని దాసు చెప్పిన మాటలను కార్తీక్ గుర్తు చేసుకుంటాడు. దీపను బావ ఇక్కడి తీసుకొచ్చాడేంటి అని జ్యోత్స్న ఆలోచిస్తుంది. దశరథ్‍కు బుల్లెట్ తగిలేందుకు కూడా జ్యోత్స్న కారణం అయి ఉంటుందని, సుమిత్ర, దశరథ్‍ల కూతురు, శివన్నారాయణ అసలైన మనవరాలు, అసలైన వారసురాలు దీపే అని దాసు చెప్పిన మాటలను కార్తీక్ గుర్తు చేసుకుంటాడు. జ్యోత్స్న వంక తదేకంగా చూస్తాడు. మీ నానమ్మ చేసిన పాపానికి ప్రతిరూపం నువ్వు, నాకు నిజం తెలిసింది.. ఇక మీ ఆటలు సాగవు అని కార్తీక్ అనుకుంటాడు.

 

నిజం తెలిసిందా: వణికిన జ్యోత్స్న

శివన్నారాయణ కూడా అక్కడికి వస్తాడు. ఎవడు మిమ్మల్ని లోపలికి రానిచ్చారని కోపంగా అంటాడు. ఇదే మాట సుమిత్ర అడిగితే.. నీ కూతురుని నీ ఇంటికేగా తీసుకురావాల్సిందని కార్తీక్ అంటున్నాడని పారిజాతం చెబుతుంది. ఆ మాటతో జ్యోత్స్నలో వణుకు మొదలవుతుంది. దీపే అసలైన వారసురాలు అనే విషయం కార్తీక్‍కు తెలిసిపోయిందా అనేలా చూస్తుంది. ఈ మాటకు నీ బుర్ర తిరిగిపోతుందని నాకు తెలుసు జ్యోత్స్న అని కార్తీక్ మనసులో అనుకుంటాడు. దీప.. మమ్మీ కూతురు అని చెప్పడం ఏంటి.. నిజం తెలిసిపోయిందా అని జ్యోత్స్న ఆలోచిస్తుంది. నిజం తెలిసిపోయిందే.. నా చిన్న మరదలా.. నీ టెంపరేచర్ వంద దాటుతుంది చూడు అని అనుకుంటాడు కార్తీక్. సోఫాలో కూర్చున్న దీప ఇబ్బంది పడుతూ ఉంటుంది.

ఏ ఆడదైనా సిగ్గుపడుతుంది

ఏం అర్థమయ్యేలా చెప్పాలని అని కార్తీక్‍ను జ్యోత్స్న అడుగుతుంది. కంగారు వద్దు నీ దగ్గరి నుంచే మొదలుపెడతానని కార్తీక్ అంటాడు. బావకు ఏదో తెలిసిందని జ్యో కంగారు పడుతుంది. అత్తతో మొదలుపెడతానని కార్తీక్ అంటాడు. దీప తన కూతురు లాంటిదని సుమిత్ర అత్త అనేది అని కార్తీక్ అంటాడు. ఇంకోసారి దీపను నా కూతురు అనొద్దని సుమిత్ర కోప్పడుతుంది.

 

బస్టాండ్‍లో పడేసేదాన్ని

సుమిత్ర, దశరథ్ అసలైన కూతురు దీపే అని దాసు చెప్పిన విషయాన్ని మళ్లీ గుర్తు చేసుకుంటాడు కార్తీక్. జ్యో కూడా ఆ విషయాన్ని తలుచుకొని భయపడుతుంది. తన స్వార్థం కోసం ఎదుటివాళ్ల జీవితాలతో ఆడుకునే ఇలాంటి మనిషికి తల్లి అని చెప్పుకునేందుకు ఏ ఆడదైనా సిగ్గు పడుతుంది రా అని సుమిత్ర ఆగ్రహంగా అంటుంది. దీపే తన అసలైన కూతురు అని తెలియక నానా మాటలు అంటుంది. దీంతో దీప కన్నీరు పెట్టుకుంటుంది.

“నువ్వు సిగ్గు పడినా.. చిరాకు పడినా దీప మాత్రం నీ కూతురే మమ్మీ. కానీ ఈ విషయం బావకు ఎలా తెలుసు” అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. ఒకవేళ మన దరిద్రం కొద్ది దీపే కూతురిగా పుడితే.. ఇలాంటి కూతురు వద్దు అని ఏ బస్టాండ్‍లోనో పడేసే దాన్ని అని సుమిత్ర అంటుంది. దీప పుట్టగానే చంపేయమని సైదులుకు ఇచ్చిందని దాసు చెప్పిన విషయాన్ని జ్యో గుర్తు చేసుకుంటుంది. ఆ పని నేనే చేశా, నీ వారసురాలిని బస్టాండ్ పాలు చేశా.. కానీ కార్తీక్ ఏంటి దీపే వారసురాలిగా కూతురు.. కూతురు అంటూ సుమిత్రను చంపుతున్నాడు అని పారిజాతం ఆలోచిస్తుంది.

 

పురిట్లోనే నీ బిడ్డను దూరం చేశారు

నిజంగానే నీ కూతురిని నీకు దూరం చేసి.. బస్టాండ్‍లో విసిరేశారు.. పురిట్లోనే నీ బిడ్డను దూరం చేశారు.. దీపే నీ కూతురు అని మనసులో అనుకుంటాడు కార్తీక్. అడిగిన వెంటనే అగ్రిమెంట్‍పై సంతకం పెట్టింది ఇందుకా అని జ్యోత్స్న ఆలోచిస్తుంది. ఇప్పుడు బావ నిజం చెబితే నా పరిస్థితి ఏంటి అని భయపడుతుంది. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావ్ దశరథ్ అడుగుతాడు.

సుమిత్ర అత్త కూతురునే కాంచన కొడుకు పెళ్లి చేసుకున్నాడు

దీపకు ఎవరూ లేరని అంటే.. నేనున్నానని ఒకప్పుడు అత్త అనిందని కార్తీక్ అంటాడు. దీప నా కూతురు అని అత్త అప్పుడు చెప్పిందని, అందుకే ఇక్కడికి తీసుకొచ్చానని కార్తీక్ అంటాడు. సుమిత్ర అసలు కూతురు దీపే అనే నిజాన్ని చెప్పడు. దీంతో జ్యోత్స్న ఊపిరి పీల్చుకుంటుంది. అదంతా ఒకప్పుడు.. ఇప్పుడు ఆ మనిషి ఇంటికి శత్రువు అని సుమిత్ర అంటుంది. సుమిత్ర కూతురికి, కాంచన కొడుక్కి పెళ్లి జరగాలని దశరథ్, కాంచన మాట ఇచ్చుకున్నా జరిగిందా అని పారిజాతం వెటకారంగా అంటుంది. దేవుడు కాదు.. ఆ మాటను బావే నిజం చేశాడు అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. సుమిత్ర అత్త కూతురు మెడలోనే కాంచన కొడుకు తాళికట్టాడు పారు అని మనసులో ఆలోచిస్తాడు కార్తీక్. అనుకున్నవ్నీ జరగవంటూ నోరు పారేసుకుంటూ ఉంటుంది పారిజాతం.

 

ఏ మార్చురీలోనో ఉండేది

ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అని దశరథ్ అంటాడు. అవును ఇవన్నీ అవసరం.. అసలు ఎందుకు వచ్చావో చెప్పు అని కార్తీక్‍ను శివన్నారాయణ అడుగుతాడు. దీపే ఇంటి ఈ వారసురాలు అని చెప్పేస్తాడా అని టెన్షన్ పడుతుంది జ్యోత్స్న. దీప జీవితాంతం జైలులోనే ఉంటుందని కొందరు అనుకున్నారని, కానీ న్యాయం గెలిచిందని కార్తీక్ అంటాడు. ఆ న్యాయాన్ని డబ్బుతో కొన్నావని శివన్నారాయణ అంటాడు. ఆసుపత్రి దాటి నీ భార్య ఇంటికి రాదని నువ్వు అన్నావని కార్తీక్ అంటే.. అది మా దయ అని శివన్నారాయణ పొగరుగా చెబుతాడు. తనను కాపాడిన దానికి రుణం తీర్చుకోవాలనే సుమిత్ర రక్తం ఇవ్వాలనుకుందని, జ్యోత్స్న ముందుకొచ్చిందని అంటాడు. మీ మీద మేం దయ తలచకపోతే దీప ఏ మార్చురీలోనో ఉండేదని కఠినంగా మాట్లాతాడు. దీంతో దీప బాధపడుతుంది. కార్తీక్ షాక్ అవుతాడు.

పంచాయతీలు కోర్టులోనే జరిగేవి

నువ్వు మీ నాన్నలా ఆలోచిస్తున్నావని శివన్నారాయణ అంటాడు. నేను మా నాన్నలాగ ఆలోచిస్తే మనిద్దరి మధ్య చాలా పంచాయతీలు కోర్టులో జరిగేవి తాత అని కార్తీక్ అంటాడు. ఆస్తి గురించి మాట్లాడుతున్నాడని పారిజాతం అంటుంది. మిమ్మల్నే మేం భరిస్తున్నామని కార్తీక్ అంటాడు. ఇక బయలుదేరు అని శివన్నారాయణ అంటే.. చెప్పాల్సింది వేరే ఉంది అని కార్తీక్ అంటాడు.

 

సుమిత్రకు నమస్కరించిన కార్తీక్, దీప

ఎంత కోపంగా మాట్లాడినా.. నీలో ఇంకా అమ్మతనం ఇంకా బతికే ఉంది అత్తా.. ఎన్ని కోపాలు దాటి కూడా దీపను కాపాడేందుకు అడుగుు ముందుకు వేశావ్ అని కార్తీక్ అంటాడు. సుమిత్రకు కార్తీక్, దీప నమస్కారం పెడతారు. సాయం చేసిన వారికి కృతజ్ఞత చెప్పడం బాధ్యత, అందుకే వచ్చానని కార్తీక్ అంటాడు. థ్యాంక్ గాడ్ నేను బావకు నిజం తెలిసిందని భయపడ్డానని ఊపిరి పీల్చుకుంటుంది జ్యోత్స్న. అనవసరమైన నిందలు మోయకుండా కుటుంబం కోసం చేసిన పని ఇది పారిజాతం అంటుంది. ఎవరు స్వార్థపరులో తొందరలోనే తేలతాయి అని కార్తీక్ అంటాడు.

ఆ ముసుగు మనిషి దొరకాలి

“మిస్సైన బుల్లెట్‍కు లెక్కలు తేలాలి, నా భార్యను చంపాలనుకున్న ముసుగు మనిషి దొరకాలి, ఈ రెండు జరిగినప్పుడు మనం మళ్లీ మాట్లాడుకుందా” అని కార్తీక్ అంటాడు. జ్యోత్స్న కంగారు పడుతుంది. వెళదాం పదా అని దీపతో కార్తీక్ అంటాడు. ఇంతలో దశరథ్ పలుకరిస్తాడు. దీప.. ఇప్పుడు నీకు ఎలా ఉందమ్మా అని ప్రేమగా అడుగుతాడు. బాగానే ఉందని దీప సమాధానం ఇస్తుంది. నీ పలకరింపే మాకు ఆశీర్వాదమని కార్తీక్ అంటాడు. దీపను తీసుకొని వెళతాడు కార్తీక్.

 

నువ్వే అసలైన వారసురాలు అని తెలిసే చేస్తా

“ఇది నీ ఇల్లు.. ఇది నీ కుటుంబం దీపా. వీళ్లందరి మనసులో నీ మీద ఉన్న అభిప్రాయాన్ని మారుస్తా. పారిజాతం, జ్యోత్స్న గురించి అందరికీ తెలిసేలా చేస్తా. నువ్వు అసలైన వారసురాలు అని తెలిసేలా చేస్తా” అని మనసులో అనుకుంటాడు కార్తీక్. జ్యోత్స్నను తీసుకొని ఇంటి పైకి వెళుతుంది పారిజాతం. ఆటోలో దీపను తీసుకెళతాడు కార్తీక్. దీంతో కార్తీక దీపం 2 నేటి (మే 12) ఎపిసోడ్ ముగిసింది.

Best Web Hosting Provider In India 2024