



Best Web Hosting Provider In India 2024

ఈ 5 రకాల పండ్లను మసాలా దినుసులతో కలిపి తినచ్చని మీకు తెలుసా? ఇలా చేయడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసా?
పండ్లు, మసాలా దినుసుల కలయిక గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? వీటిని కలిపి తింటే ప్రయోజనాలు రెట్టింపు అవుతాయని మీకు తెలుసా? అవును.. కొన్ని ప్రత్యేకమైన మసాలా దినుసులతో కలిపి తినడం వల్ల పండ్ల ప్రయోజనాలు రెట్టింపు అవుతాయట. ఆ పండ్లు ఏంటో, వాటితో కలిపి తినాల్సిన మసాలా దినుసులేంటో తెలుసుకుందాం రండి.
పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు. కానీ వాటిని సరైన పద్ధతిలో తింటేనే ఆ ఆరోగ్యం మనకు పూర్తిగా అందుతుంది. చాలామంది పండ్లను ఎప్పుడంటే అప్పుడు తింటారు. భోజనం చేశాక వెంటనే, లేదంటే ఖాళీ కడుపుతో తింటుంటారు. ఇలా తింటే ఒక్కోసారి గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం లాంటి సమస్యలు వస్తాయి.
పండ్ల విషయంలో చాలా మందికి తెలియని ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. మన వంటింట్లో ఉండే కొన్ని మసాలా దినుసులు ఈ పండ్ల రుచిని పెంచడమే కాకుండా, వాటిని మరింత ఆరోగ్యకరంగా మారుస్తాయి. ఆయుర్వేదం కూడా ఇదే చెబుతోంది. పండ్లను కొన్ని ప్రత్యేకమైన మసాలాతో కలిపి తింటే అవి మన శరీరానికి మరింత బలాన్నిస్తాయి. వినడానికి కాస్త వింతగా ఉన్నా ఇందులో నిజం ఉంది. పండ్లను మసాలాలతో కలిపి తినడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. రండి మసాలా దినుసులతో కలిపి తినాల్సిన పండ్లుఏంటో, వాటి వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
అరటిపండు
అరటిపండు శక్తినిచ్చే ఒక అద్భుతమైన పండు. కానీ కొందరికి ఇందులో ఉండే అధిక ఫైబర్ కారణంగా మలబద్ధకం వచ్చే అవకాశం ఉంది. అలాంటప్పుడు అరటిపండును ఒంటరిగా తినడానికి బదులుగా కొద్దిగా యాలకుల పొడితో కలిపి తీసుకోండి. యాలకులు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి, తద్వారా అరటిపండు తేలికగా జీర్ణమవుతుంది, మలబద్ధకం సమస్యను నివారిస్తుంది.
మామిడిపండు
వేసవి వచ్చిందంటే చాలు మామిడిపండు లేని ఇల్లు ఉండదు. రుచిలో తియ్యగా ఉండే ఈ పండును చాలామంది ఇష్టంగా తింటారు. కానీ అధికంగా తింటే కడుపులో గ్యాస్ వచ్చే అవకాశం ఉంది. ఈ సమస్యను అధిగమించడానికి మామిడిపండు ముక్కలపై ఒక చిటికెడు ఎండిన అల్లం పొడి (శొంఠి) చల్లుకోండి. శొంఠి శరీరంలో మామిడి వల్ల పెరిగే వేడిని తగ్గించడంలో సహాయపడుతుంది, జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. ఇలా చేశారంటే మీకిష్టమైన మామిడి పండును భయపడకుండా తినేయచ్చు.
పుచ్చకాయ
పుచ్చకాయను చాలామంది ఉప్పు చల్లుకొని తింటారు. ఇది కేవలం రుచి కోసం మాత్రమే కాదు. పుచ్చకాయలో నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిని కొద్దిగా నల్ల ఉప్పుతో కలిపి తింటే, శరీరంలో ఎలక్ట్రోలైట్ల సమతుల్యత బాగా మెరుగుపడుతుంది. నల్ల ఉప్పులో ఉండే సోడియం శరీరానికి అవసరమైన ఖనిజాలను అందిస్తుంది, ముఖ్యంగా వేసవిలో చెమట ద్వారా కోల్పోయిన లవణాలను తిరిగి పొందడానికి సహాయపడుతుంది. రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం అన్నమాట.
దోసకాయ
ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే దోసకాయను చాలామంది నేరుగా తింటారు. కానీ పోషకాహార నిపుణులు ప్రకారం.. దీనిపై కొద్దిగా చాట్ మసాలా చల్లితే అది మరింత సులభంగా జీర్ణమవుతుంది. చాట్ మసాలాలో ఉండే వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు వాతాన్ని సమతుల్యం చేస్తాయి. దోసకాయలోని పోషకాలను శరీరం బాగా గ్రహించేలా చేస్తాయి. ఇకపై దోసకాయను మరింత రుచికరంగా, ఆరోగ్యకరంగా మార్చుకుని తినండి.
అనాస, నారింజ, నిమ్మ
అనాస, నారింజ, నిమ్మ వంటి సిట్రస్ పండ్లు వేసవిలో మనకు ఉపశమనం కలిగిస్తాయి. అయితే వీటిని నేరుగా తినడంతో కంటే కొద్దిగా పుదీనా ఆకులతో కలిపి తీసుకుంటే వాటి రుచి మరింత పెరుగుతుంది. అదనపు ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. పుదీనా జీర్ణక్రియకు సహాయపడుతుంది, శరీరానికి చల్లదనాన్నిస్తుంది. ఈ పండ్లను ఇలా తీసుకోవడం వల్ల వేసవి తాపాన్ని తట్టుకోవచ్చు. వాటిలోని విటమిన్లు, ఖనిజాలను పూర్తిగా పొందవచ్చు.