





Best Web Hosting Provider In India 2024

నిప్పుల కుంపటిలా ఏపీ వాతావరణం.. 44డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు.. పెరుగుతున్న ఎండలు.. వడగాల్పులు
భానుడి భగభగలతో ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం నిప్పుల కుంపటిలా మారింది. వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతలతో జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికే భయపడుతున్నారు. వాతావరణంలో తేమ అధికం కావడంతో కోస్తా జిల్లాలో భరించలేని ఉక్కపోత వాతావరణం ఉంటోంది. అధిక ఉష్ణోగ్రతలు మంగళవారం కూడా కొనసాగనున్నాయి.
ఏపీలో ఎండతీవ్రత క్రమంగా పెరుగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. సోమవారం పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కాకానిలో 43.7°C గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని 17 జిల్లాల్లో 41°Cకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డైంది.
ఏపీలో అధిక ఉష్ణోగ్రతలతో జనం అల్లాడి పోతున్నారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో 43.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంగళవారం 42డిగ్రీల నుంచి 43.5° డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ అంచనా వేసింది.
రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో 4, విజయనగరంలో 2, పార్వతీపురంమన్యంలో 11, కాకినాడలో 3, తూర్పుగోదావరిలో 1 మండలంలో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా మరో 32 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉంది. బుధవారం 22 మండలాల్లో తీవ్ర, 36 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. గురువారం రాష్ట్రంలో మోస్తారు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉంది.
మంగళవారం శ్రీకాకుళం-2, విజయనగరం-14, పార్వతీపురంమన్యం-2, అల్లూరి సీతారామరాజు-3, కాకినాడ-4, తూర్పుగోదావరి-7 మండలాల్లో వడగాలులు(32) వీచే అవకాశం ఉంది.
44 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు..
సోమవారం పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కాకానిలో అత్యధికంగా 43.7డిగ్రీలు, బాపట్ల జిల్లా ఇంకొల్లులో 43.5డిగ్రీలు, ప్రకాశం జిల్లా జువ్విగుంటలో 43.3డిగ్రీలు, ఎన్టీఆర్ జిల్లా మొగులూరులో 43.1డిగ్రీలు, తూర్పుగోదావరి జిల్లా చిట్యాల 42.8డిగ్రీలు, ఏలూరులో 42.6డిగ్రీలు, విజయనగరం జిల్లా ధర్మవరంలో 42.5డిగ్రీలు, తిరుపతి జిల్లా గూడూరులో 42.3° డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు అధికారులు తెలిపారు.
పల్నాడు జిల్లాలో 21 ప్రాంతాల్లో, ఎన్టీఆర్ జిల్లాలో 15, ప్రకాశంలో 12, బాపట్లలో 9, గుంటూరులో 8 సహా ఇతర చోట్ల కలిపి 116 ప్రాంతాల్లో 41°C కు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
మంగళవారం రాయలసీమ జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పిడుగులు, ఈదురుగాలులు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు హోర్డింగ్స్, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు దగ్గర నిలబడరాదని సూచించారు.
ఎండలతో జాగ్రత్త..
ఎండలో బయటకు వెళ్లేప్పుడు నెత్తికి టోపి పెట్టుకోండి లేదా రూమాలు కట్టుకోండి, తెలుపురంగు గల కాటన్ వస్త్రాలను ధరించండి. అదేవిధంగా మీ కళ్ళ రక్షణ కోసం సన్ గ్లాసెస్ ఉపయోగించండి. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలి. గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదని, శారీరక శ్రమతో కూడిన కఠినమైన పనులను ఎండలో చేయరాదని అధికారులు సూచించారు.
సంబంధిత కథనం
టాపిక్