క్రిస్పీ పొటాటో రింగ్స్ తినాలనుకుంటున్నారా.. నిమిషాల్లో రెడీ అయ్యే బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ మీ కోసం!

Best Web Hosting Provider In India 2024

క్రిస్పీ పొటాటో రింగ్స్ తినాలనుకుంటున్నారా.. నిమిషాల్లో రెడీ అయ్యే బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ మీ కోసం!

 

పొటాటో రింగ్స్ అంటే మీకు చాలా ఇష్టమా? ఇకపై వాటి కోసం బయటికి వెళ్లాల్సిన అవసరం లేదు. నిమిషాల్లో ఇంట్లోనే తయారుచేసుకోగలిగే ఈ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ మీ కోసం రెడీగా ఉంది. ఆలస్యం చేయకుండా ఎలా తయారుచేయాలో చూసేయండి.

 
పొటాటో రింగ్స్ వండాలనుకుంటున్నారా?
 

మీ పిల్లలు పొటాటో చిప్స్ ఇష్టంగా తింటారా? అయితే వారికి ఈ సారి బ్రేక్ ఫాస్ట్‌లో ఈ ఐటెం ఎందుకు ట్రై చేయకూడదు. ఒక కొత్త రుచిని పరిచయం చేయాలనే మీకు క్రిస్పీ పొటాటో రింగ్స్ ఒక కరెక్ట్ ఆప్షన్. చూడటానికి ఉంగరాలుగా, తినడానికి కరకరలాడుతూ ఉండే ఈ బంగాళదుంప స్నాక్స్‌ను మీ పిల్లలు తప్పకుండా ఇష్టపడతారు. వీటిని తయారుచేయడం కూడా చాలా సులువు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా లేదా సాయంత్రం స్నాక్స్‌గా ఎప్పుడైనా చేసి పెట్టొచ్చు. మరి ఆలస్యం ఎందుకు? ఇప్పుడే ఎలా తయారుచేయాలో చూసేద్దాం రండి!

 

కావలసిన పదార్థాలు:

  • బంగాళదుంపలు – 2 మీడియం సైజు ఉడికించినవి
  • కారం పొడి – 1/2 టీస్పూన్ (మీ రుచికి తగ్గట్టుగా)
  • ఉప్పు – రుచికి తగినంత
  • మిరియాల పొడి – 1/4 టీస్పూన్ (నల్ల మిరియాల పొడి అయితే బాగుంటుంది)
  • కార్న్ ఫ్లోర్ – 1/2 కప్పు (మొక్కజొన్న పిండి)
  • నూనె – వేయించడానికి తగినంత

పొటాటో రింగ్స్ తయారీ విధానం:

  1. ముందుగా రెండు మీడియం సైజు బంగాళదుంపలను బాగా ఉడికించి వాటి తొక్క తీసేయండి. వెచ్చగా ఉన్నప్పుడే ఒక గిన్నెలోకి తీసుకుని స్పూన్ లేదా పప్పు గుత్తితో ఎక్కడ ఉండలు లేకుండా మెత్తగా మెదపండి. బంగాళదుంపలు చల్లారితే మెదపడం కొంచెం కష్టంగా ఉంటుంది.
  2. మెదిపిన బంగాళదుంపల్లో కారం పొడి వేయండి. రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలపండి. తాజాగా దంచిన మిరియాల పొడి వేస్తే మంచి సువాసన వస్తుంది. కాబట్టి 1/4 టీస్పూన్ మిరియాల పొడి వేసి మళ్లీ ఒకసారి కలపండి.
  3. మరింత రుచి కోసం మీరు కొద్దిగా చాట్ మసాలా లేదా ఆమ్చూర్ పౌడర్ (మామిడి పొడి) కూడా పిండిలో కలపవచ్చు.
  4. ఇప్పుడు సగం కప్పు కార్న్ ఫ్లోర్ వేయండి. కార్న్ ఫ్లోర్ వేయడం వల్ల రింగ్స్ క్రిస్పీగా, విరిగిపోకుండా ఉంటాయి. పిండి మొత్తం బంగాళదుంప మిశ్రమంలో బాగా కలిసేలా చేత్తో లేదా స్పూన్‌తో కలపండి.
  5. ఈ మిశ్రమాన్ని బాగా కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు అలా వదిలేయండి. కార్న్ ఫ్లోర్ బంగాళదుంపలోని తేమను పీల్చుకుని పిండి కొంచెం గట్టిపడుతుంది.
  6. ఇప్పుడు మీ చేతులకు కొద్దిగా నూనె రాసుకుని పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోండి. ఒక్కో ముద్దను తీసుకుని అరచేతిలో గుండ్రంగా ఒత్తండి. తర్వాత మధ్యలో వేలితో లేదా ఏదైనా చిన్న మూతతో రంధ్రం పెట్టండి.
  7. రింగ్స్ మరీ మందంగా కాకుండా కొంచెం పలుచగా చేస్తే అవి మరింత క్రిస్పీగా వస్తాయి. పిల్లల కోసం చేస్తున్నట్లయితే మంచి షేప్‌లలోకి చేసుకోవచ్చు.
  8. డీప్ ఫ్రై చేయడానికి కడాయిలో తగినంత నూనె పోసి మీడియం వేడి మీద కాగనివ్వండి.
  9. నూనె బాగా వేడెక్కిందో లేదో తెలుసుకోవడానికి ఒక చిన్న పిండి ముక్కను వేసి చూడండి, అది వెంటనే పైకి వస్తే నూనె సరిగ్గా వేడెక్కినట్లు.
  10. నూనె వేడెక్కిన తర్వాత తయారు చేసుకున్న పొటాటో రింగ్స్‌ను ఒక్కొక్కటిగా కడాయిలో వేయండి. మంటను మీడియంగా ఉంచితే రింగ్స్ లోపల కూడా బాగా ఉడుకుతాయి.
  11. ఒకేసారి ఎక్కువ వేసి కడాయి నిండా కాకుండా చూసుకోండి. వాటిని బంగారు రంగు వచ్చేంత వరకు, క్రిస్పీగా మారే వరకు వేయించండి.
  12. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి, అవి అన్ని వైపులా వేగేలా జాగ్రత్తపడండి.
  13. రింగ్స్ బాగా వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. అదనపు నూనెను పీల్చుకోవడానికి ప్లేట్‌లో టిష్యూ పేపర్ వేయవచ్చు.

అంతే! మీ క్రిస్పీ పొటాటో రింగ్స్ రెడీ అయిపోయినట్లే. చల్లారిపోకుండా వేడిగా ఉన్నప్పుడే టమాటా సాస్ లేదా రెడ్ చట్నీతో వేడిగా వేడిగా సర్వ్ చేసుకుంటే, పిల్లలు ఇష్టపడి తినేస్తారు.

 
 

Source / Credits

Best Web Hosting Provider In India 2024