Best Web Hosting Provider In India 2024
నెల్లూరు: మెట్ట ప్రాంత రైతాంగ అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు. సోమశిల జలాశయంలో నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పటికి మెట్ట ప్రాంత రైతాంగం పరిస్థితిని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి వివరించి ఆత్మకూరు నియోజకవర్గ ప్రాంత రైతులకు నీటిని అందచేస్తున్నట్లు ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. సోమవారం సోమశిల జలాశయం ఉత్తరకాలువ ద్వారా నీటి విడుదలను ఆయన ప్రారంభించారు. తొలుత జలాశయం ఉత్తరకాలువ వద్ద అధికారులు, ప్రజాప్రతినిధులతో కలసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి నీటి విడుదలను స్వీచ్ ఆన్ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపధ్యంలో 20 రోజుల క్రితం సోమశిల జలాశయంలో 26 టీయంసీల నీటి నిల్వ ఉన్న సమయంలో ఆత్మకూరు నియోజకవర్గ రైతాంగం కోసం నాలుగు టీయంసీల నీటిని అందించాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి వివరించామని, ఆయన సహృదయంతో అన్నమయ్య నుండి 2 టీయంసీలు, జలాశయం మిగులు జలాల నుండి ఒక టీయంసీ నీటిని నియోజకవర్గ రైతాంగానికి అందచేసేందుకు అంగీకరించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారని అన్నారు.
జిల్లా ఐఏబి సమావేశంలో తీర్మానించిన మేరకు ముందుగా డెల్టాకు నీటిని విడుదల చేయాలని తీర్మానించినప్పటికి, ఆత్మకూరు నియోజకవర్గంలో 90 శాతం రైతాంగం ఉండడంతో ముఖ్యమంత్రికి విన్నవించగానే ఆయన అంగీకరించారని, అదృష్టం కొద్ది రెండు వారాల్లో బాగా వర్షాలు కురిశాయని, దీంతో జలాశయానికి సుమారు ఐదు టీయంసీల నీటి లభ్యత జరిగిందని అన్నారు.
దీంతో అన్నమయ్య ప్రాజెక్ట్ నుంచి నీటి అవసరం లేకుండానే సోమశిల జలాశయం నుండి ఉత్తరకాలువ ద్వారా 3 టీయంసీల నీటిని, దక్షిణకాలువ ద్వారా ఒక టీయంసీ నీటిని విడుదల చేయనున్నట్లు వివరించారు. గతంలో నిర్వహించిన ఐఏబి సమావేశంలో సోమశిల జలాశయంలో 35 టీయంసీల నీటి నిల్వ పెరిగితే దక్షిణకాలువకు నీటి విడుదల చేస్తామని తీర్మానించి ఉండడంతో మరో టీయంసీ నీటిని దక్షిణకాలువకు విడుదల చేసే అవకాశముందని అన్నారు.
ఉత్తర, దక్షిణకాలువల ద్వారా నీటిని విడుదల చేయడంతో నియోజకవర్గంలో రైతాంగం 45 వేల ఎకరాల ఆయకట్టు సాగు చేసుకోవచ్చునని, గతంలో మాదిరిగానే ఈ దఫా అధిక దిగుబడులు, అధిక ధరలు వస్తాయనే నమ్మకం ఉందని, దీంతో అధికారులకు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందని అన్నారు.
నీటి వృధాను అరికట్టి అవసరమైనంత మేరే నీటి వినియోగం చేసేలా చూడాలని తెలపడం జరిగిందని వివరించారు. ఉత్తరకాలువ ద్వారా ఏఎస్ పేట వరకు, దక్షిణకాలువ ద్వారా చేజర్ల ఆఖరి వరకు నీటి విడుదల చేస్తున్నామని, రైతులు కూడా నీటిని వృధా చేయకుండా పంటలు పండించుకునే విధంగా చూడాలని కోరారు.
ఉత్తరకాలువ ద్వారా సాగునీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డికి పలువురు రైతులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భూములు పదునెక్కడంతో నార్లు వేసుకుని ఉన్నామని, ఈ సమయంలో నీటిని విడుదల చేయడం ద్వారా తమకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఎమ్మెల్యే చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు.