ఉసిరి పులిహోర ఇలా చేసుకుని తిన్నారంటే టేస్టీగా ఉంటుంది, ఎన్నో రోగాలు కూడా రావు

Best Web Hosting Provider In India 2024

ఉసిరి పులిహోర ఇలా చేసుకుని తిన్నారంటే టేస్టీగా ఉంటుంది, ఎన్నో రోగాలు కూడా రావు

Haritha Chappa HT Telugu

ఉసిరికాయలతో చేసే ఈ ఆహారమైన ఆరోగ్యానికి మీరే చేస్తుంది. ఇక్కడ మేము ఉసిరికాయ పులిహోర రెసిపీ ఇచ్చాము. ఇది పుల్లపుల్లగా రుచిగా ఉండటమే కాదు ఆరోగ్యాన్ని అందిస్తుంది.

ఉసిరి పులిహోర రెసిపీ

ఆరోగ్యాన్ని, అందాన్ని ఇచ్చే ఆహారంలో ఉసిరి ముందుంటుంది. ఉసిరితో చేసే ఊరగాయ నుంచి పచ్చడి వరకు అన్ని రుచిగానే ఉంటాయి. మనకు కావాల్సిన పోషకాలను అందిస్తాయి. ఒకసారి ఉసిరి పులిహోర మేము చెప్పినట్లు చేసి చూడండి. ఇది కూడా అద్భుతంగా ఉంటుంది. మీరు నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోర, గోంగూర పులిహోర వంటివి టేస్ట్ చూసి ఉంటారు. ఉసిరి పులిహోర కూడా అద్భుతంగా ఉంటుంది. నాలుగు పెద్ద ఉసిరికాయలు ఉంటే చాలు అద్భుతంగా రుచిగా తయారైపోతుంది. ఇక రెసిపీ తెలుసుకోండి.

ఉసిరి పులిహార రెసిపీకి కావలసిన పదార్థాలు

ఉసిరికాయలు – నాలుగు

బియ్యం – ఒక కప్పు

నూనె – మూడు స్పూన్లు

పల్లీలు – గుప్పెడు

పచ్చి శనగపప్పు – ఒక స్పూను

మినప్పప్పు – ఒక స్పూను

ఆవాలు – అర స్పూను

జీలకర్ర – అర స్పూను

ఎండుమిర్చి – నాలుగు

వెల్లుల్లి రెబ్బలు – నాలుగు

ఉప్పు – రుచికి సరిపడా

పసుపు – పావు స్పూను

ఇంగువ – చిటికెడు

కరివేపాకులు – గుప్పెడు

ఉసిరి పులిహోర రెసిపీ

1. అన్నాన్ని ముందుగానే ఉడికించి పొడిపొడిగా వచ్చేలా చూసుకోవాలి. ఒక ప్లేట్లో ఉడికిన అన్నాన్ని వేసి ఆరబెట్టాలి.

2. ఇలా చేయడం వల్ల అన్నం ముద్ద కాకుండా ఉంటుంది.

3. ఇప్పుడు ఉసిరికాయలను విత్తనం తీసేసి రోట్లో వేసి మెత్తగా దంచుకోవాలి.

4. అందులోనే రుచికి సరిపడా ఉప్పును వేసి బాగా దంచుకోవాలి.

5. ఈ మిశ్రమాన్ని తీసి ఆరబెట్టిన అన్నంలో వేసి బాగా కలుపుకోవాలి.

6. ఇప్పుడు ఈ అన్నానికి తాళింపును వేసుకోవాలి. దీనికోసం స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

7. ఆ నూనెలో ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి.

8. అవి చిటపటలాడుతున్నప్పుడు వేరుశనగ పలుగులు, శెనగపప్పు, మినపప్పు వేసి బాగా వేయించాలి.

9. తర్వాత ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకులు వేసి కలుపుకోవాలి.

10. ఇందులోనే ఇంగువ, పసుపు వేసి బాగా కలుపుకోవాలి.

11. ఈ తాళింపును అన్నంపై వేసి పులిహోర లాగా కలుపుకోవాలి. అంతే టేస్టీ ఉసిరి పులిహోర రెడీ అయినట్టే.

12. దీన్ని చేయడానికి కూడా చాలా తక్కువ సమయమే పడుతుంది.

13. లంచ్ బాక్స్ రెసిపీ గా కూడా ఉపయోగపడుతుంది. ఒక్కసారి దీన్ని చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ మీరే చేసుకొని తింటారు.

ఉసిరికాయల్లో ఉండే విటమిన్ సి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఎన్నో వ్యాధులను మన దరి చేరకుండా కాపాడుతుంది. అంతేకాదు చర్మాన్ని మెరిసిపోయేలా చేయడంలో కూడా ఇది ముందుంటుంది. కాబట్టి నాలుగు ఉసిరికాయలు కనిపిస్తే కచ్చితంగా ఉసిరి పులిహార చేసుకోవడం మర్చిపోవద్దు.

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024