





Best Web Hosting Provider In India 2024

రానా నాయుడు సీజన్ 2 వచ్చేస్తోంది.. రానా, వెంకటేశ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ఇదే
టాలీవుడ్ స్టార్ హీరోలు వెంకటేశ్, రానా నటించిన రానా నాయుడు వెబ్ సిరీస్ సీజన్ 2 వచ్చేస్తోంది. మంగళవారం (మే 20) ఈ కొత్త సీజన్ స్ట్రీమింగ్ తేదీని నెట్‌ఫ్లిక్స్ అనౌన్స్ చేసింది.
రానా నాయుడు.. నెట్‌ఫ్లిక్స్ లో రెండేళ్ల కిందట వచ్చిన ఈ సిరీస్ సంచలనం సృష్టించింది. టాలీవుడ్ కు చెందిన ఇద్దరు స్టార్ హీరోలు, బాబాయ్ అబ్బాయ్ లు వెంకటేశ్, రానా నటించిన ఈ సిరీస్ లో బూతు కంటెంట్ ఉండటం ఆశ్చర్యం కలిగించింది. ఇప్పుడీ సిరీస్ రెండో సీజన్ కూడా రాబోతోంది. తొలి సీజన్ పై విమర్శల నేపథ్యంలో ఇందులో అలాంటి కంటెంట్ తక్కువే ఉంటుందని గతంలోనే వెంకటేశ్ చెప్పిన నేపథ్యంలో ఈ కొత్త సీజన్ పై ఆసక్తి పెరిగిపోయింది.
రానా నాయుడు సీజన్ 2 స్ట్రీమింగ్ డేట్
రానా నాయుడు వెబ్ సిరీస్ రెండో సీజన్ జూన్ 13 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ మంగళవారం (మే 20) వెల్లడించింది. కరణ్ అన్షుమన్ క్రియేట్ చేసి, డైరెక్ట్ చేసిన ఈ వెబ్ సిరీస్ రెండో సీజన్ పై ఎంతగానో ఆసక్తి నెలకొంది.
తొలి సీజన్ తో సంచలనం రేపిన వెంకటేశ్, రానా ఈ కొత్త సీజన్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. “కుటుంబం విషయానికి వస్తే రానా అన్ని హద్దులూ దాటేస్తాడు.. రానా నాయుడు సీజన్ 2 జూన్ 13న కేవలం నెట్‌ఫ్లిక్స్ లోనే స్ట్రీమింగ్ కానుంది” అనే క్యాప్షన్ తో ఈ విషయాన్ని వెల్లడించింది.
రానా దగ్గుబాటి, వెంకటేష్ దగ్గుబాటి, అర్జున్ రాంపాల్, సుర్వీన్ చావ్లా, కృతి ఖర్బందా, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, డినో మోరియాలాంటి వాళ్లు ఇందులో నటించారు.
రానా నాయుడు తొలి సీజన్‌లో ఏం జరిగిందంటే?
రానా నాయుడు వెబ్ సిరీస్ తొలి సీజన్ 2023లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్ అంశాలకు ఫ్యామిలీ ఎమోషన్స్ మేళవించి రూపొందించిన సిరీస్ ఇది. కంప్లీట్ మోడ్రన్ సెటప్‌లో కథ సాగుతుంది. అందుకు తగినట్లుగానే ఎక్కువగా మసాలా సీన్స్, డబుల్ మీనింగ్ డైలాగ్స్ కనిపిస్తాయి.
తండ్రిని ద్వేషించే ఓ కొడుకు, అతడికి గుణపాఠం చెప్పాలని ప్రయత్నించే తండ్రి సింపుల్‌గా ఈ రెండు క్యారెక్టర్స్ చూట్టే ఈ కథ సాగుతుంది. ఈ రెండు పాత్రలతో మిగిలిన క్యారెక్టర్స్‌ను లింక్ చేస్తూ పది ఎపిసోడ్స్‌తో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు దర్శకద్వయం కరణ్ అన్షుమన్, సుపర్న్ వర్మ.
రానా నాయుడు, నాగనాయుడిగా వెంకటేశ్, రానా పాత్రలు పోటాపోటీగా సాగాయి. తనకున్న ఫ్యామిలీ ఇమేజ్‌కు భిన్నంగా ప్లేబాయ్ తరహా పాత్రలో వెంకటేశ్ చెలరేగిపోయాడు. రానా నాయుడిగా నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్రలో రానా నటన పవర్‌ఫుల్‌గా ఉంది. మరి ఈ బాబాయ్ అబ్బాయ్ లు రెండో సీజన్లో ఏం చేశారో జూన్ 13న తెలవనుంది.
సంబంధిత కథనం