ఏరోబిక్ ఎక్సర్‌సైజులు చేయడం చాలా సులువు, వీటితో బరువు తగ్గొచ్చు, గుండెపోటు రాకుండా జాగ్రత్త పడొచ్చు

Best Web Hosting Provider In India 2024

ఏరోబిక్ ఎక్సర్‌సైజులు చేయడం చాలా సులువు, వీటితో బరువు తగ్గొచ్చు, గుండెపోటు రాకుండా జాగ్రత్త పడొచ్చు

Haritha Chappa HT Telugu

చాలామందికి ఏరోబిక్ వ్యాయామాల్లో అంటే ఏమిటో తెలియదు. వాటి పేరును వినే ఉంటారు. నిజానికి ఏరోబిక్ వ్యాయామాలు ఇతర ఎక్సర్ సైజులతో పోలిస్తే చేయడం చాలా సులువు.

ఏరోబిక్ వ్యాయామాలు (Pixabay)

ఆధునిక కాలంలో ఆరోగ్య సమస్యలు సులువుగా వచ్చి పడుతున్నాయి. వ్యాయామాలు, యోగా వంటి వాటితో ప్రత్యేకంగా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది వ్యాయామాలలో ఏరోబిక్ ఎక్సర్‌సైజులు కూడా ఒకటి. ఇవి చేయడం చాలా సింపుల్.

చాలామంది వీటి పేరు వినే ఉంటారు. కానీ ఏరోబిక్ వ్యాయామాల జాబితాలోకి ఎలాంటి ఎక్సర్ సైజులు వస్తాయో మాత్రం తెలియదు. ఏరోబిక్ వ్యాయామాల గురించి క్లుప్తంగా తెలుసుకోండి.

ఏరోబిక్ వ్యాయామాలు అంటే ఏవి?

ఏరోబిక్ వ్యాయామాలు అంటే పరుగు, సైక్లింగ్, వేగంగా నడవడం, డాన్స్ చేయడం, ఈత వంటివి. వీటిలో మీకు నచ్చినవి ప్రతిరోజూ పాటించవచ్చు. పరుగు, సైక్లింగ్, నడక డాన్స్ ఇవన్నీ చాలా సులువుగానే చేయొచ్చు. ఈత కోసమే స్విమ్మింగ్ పూల్ అవసరం పడుతుంది. డాన్స్ ఇంట్లోనే చేసుకోవచ్చు. సైక్లింగ్, పరుగు, వాకింగ్ వంటివి రోడ్డు మీద చేసుకోవచ్చు. వీటికి పెద్దగా ఖర్చు కాదు. కాబట్టి ఏరోబిక్ వ్యాయామాలు సింపుల్ మాత్రమే కాదు. పెద్దగా ఖర్చు అవసరం లేని వ్యాయామాలు ఇవన్నీ.

ఖర్చు లేని వ్యాయామాలు

మీరు ఏరోబిక్ వ్యాయామాలు చేయడం ద్వారా కూడా ఫిట్ గా మారవచ్చు. ఇది హృదయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అంటే గుండెకు రక్షణ కల్పిస్తుంది. గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది. స్ట్రోక్ వంటి ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. బరువును తగ్గించడంలో క్యాలరీలను బర్న్ చేయడంలో ముందుంటుంది. బరువు తగ్గాలనుకునేవారు పెద్దపెద్ద బరువులు ఎత్తాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు కాసేపు వాకింగ్ చేయడం లేదా రన్నింగ్ చేయడం వంటివి చేస్తే చాలు. గదిలో మీకు నచ్చిన పాట పెట్టుకొని కాసేపు డాన్స్ చేయండి. అలా కూడా ఎన్నో క్యాలరీలు కరుగుతాయి.

ఇక్కడ చెప్పిన ఏరోబిక్ వ్యాయామాలను ప్రతిరోజూ పాటించడం వల్ల మీ ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. శరీరం చురుగ్గా మారుతుంది. మీ శక్తి స్థాయిలు పెరుగుతాయి. అలసట చాలా వరకు తగ్గుతుంది. కొంతమంది చిన్న చిన్న పనులకి అలసిపోతూ ఉంటారు. అలాంటివారు ఏరోబిక్ వ్యాయామాల్లో మీకు నచ్చినది ఎంపిక చేసుకొని ప్రతిరోజు చేస్తే ఉత్తమమైన ప్రయోజనాలను పొందుతారు.

డయాబెటిస్ తగ్గుతుంది

రక్తంలో చక్కెర స్థాయిలు నిర్వహించడానికి కూడా ఏరోబిక్ వ్యాయామాలు ఉపయోగపడతాయి. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు ప్రతిరోజు ఏరోబిక్ వ్యాయామాలను ఏదో ఒకటి పాటించడం ఉత్తమం. వీరు చురుకైన నడక లేదా సైక్లింగ్, రన్నింగ్ వంటివి ఎంపిక చేసుకొని రోజు అరగంట పాటు చేయడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది. ఇక టైప్ 2 డయాబెటిస్ బారిన పడకుండా ముందు జాగ్రత్త తీసుకునే వారు కూడా ఏరోబిక్ వ్యాయామాలను పాటించవచ్చు.

ఈ వ్యాయామాలు కేవలం శారీరక ఫిట్నెస్ కోసమే కాదు మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. మానసిక స్థితిని సాధారణంగా మార్చి ఒత్తిడిని తగ్గిస్తాయి. డిప్రెషన్, ఆందోళన వంటి బారిన పడకుండా కాపాడుతాయి. అలాగే ఆర్థరైటిస్ వంటి సమస్యలు రాకుండా కూడా అడ్డుకుంటాయి. శరీరంలోనే కొవ్వును కరిగించే సత్తా కూడా ఏరోబిక్ వ్యాయామాలకు ఉంది. ఇంకెందుకు ఆలస్యం ప్రతిరోజూ కాసేపు నడిచేందుకు లేదా రన్నింగ్ చేసేందుకు ప్రయత్నించండి.

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024