





Best Web Hosting Provider In India 2024

అయ్యనా మానే వెబ్ సిరీస్ రివ్యూ -కథ మొత్తం ఒకే ఇంట్లో -కుల దేవత శాపంతో మరణాలు -మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ ఎలా ఉందంటే?
ఖుషి రవి ప్రధాన పాత్రలో నటించిన కన్నడ సిరీస్ అయ్యనా మానే తెలుగులోకి వచ్చింది. జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే?
కన్నడ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ అయ్యనామానే ఇటీవలే జీ5 ఓటీటీ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఖుషిరవి ప్రధాన పాత్రలో నటించిన ఈ వెబ్‌సిరీస్‌కు రమేష్ ఇందిర దర్శకత్వం వహించారు. ఆరు ఎపిసోడ్స్‌తో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే?
అత్తింటి మిస్టరీ…
జాజి(ఖుషి రవి)కి దుష్యంత్‌తో (అక్షయ్ నాయక్) పెళ్లి జరుగుతుంది. సంతోషంగా అత్తింట్లో భర్తతో కలిసి కుడికాలు పెట్టబోతుండగా దుష్యంత్ తండ్రి చనిపోతాడు. కొత్త కోడలి వల్లే ఈ మరణం సంభవించిందని పూజారి నిందలు వేస్తాడు. కానీ దుష్యంత్ మాత్రం జాజి తప్పేం లేదని భార్యను వెనకేసుకొస్తాడు. దుష్యంత్‌కు శివ, మహేష్ అనే ఇద్దరు అన్నయ్యలు ఉంటారు.
శివ భార్య చారుమతి, మహేష్ వైఫ్ పుష్పవతి ఆత్మహత్య చేసుకున్నారనే నిజం జాజికి తెలుస్తుంది. దుష్యంత్‌కు ఇంతకుముందే పెళ్లయిందనే, అతడి మొదటి భార్య బిందుమాలిని కూడా అదే ఇంట్లో చనిపోయిందనే నిజం కూడా బయటపడుతుంది. కోడళ్లు చేసిన తప్పుల కారణంగా కొండయ్య దేవత శాపానికి గురై వారు చనిపోయినట్లు జాజితో అత్త నాగమ్మ (మానసి సుధీర్) అంటుంది.
కానీ అవన్నీ అబద్దాలని, ముగ్గురు కోడళ్ల మాదిరిగానే తనకు ప్రాణభయం ఉందని జాజి గ్రహిస్తుంది. ఆ ఇంట్లో ఏం జరిగిందో తెలుసుకోవడం మొదలుపెడుతుంది. దుష్యంత్ ఇంటిని పగతో రలిగిపోతున్న కొన్ని ఆత్మలు వెంటాడుతున్నాయని జాజితో పుజారి చెబుతాడు.
మరోవైపు తన మొదటి భార్యను దుష్యంత్ ఇన్సూరెన్స్ డబ్బుల కోసం చంపించినట్లు ఊరివాళ్లుచెప్పడం జాజి వింటుంది. తన స్నేహితుడైన పోలీస్ ఆఫీసర్ మహంతేష్ సహాయంతో అత్తింట్లో జరుగుతోన్న వరుస మరణాల మిస్టరీని జాజి ఎలా ఛేదించింది? నిజంగా ఆ ఇంటికి శాపం ఉందా? ఈ హత్యల వెనుక ఎవరున్నారు అన్నదే ఈ వెబ్‌సిరీస్ కథ.
ఒకే ఇంట్లో…
అయ్యనా మానే వెబ్‌సిరీస్ కథ మొత్తం ఒకే ఇంట్లో సాగుతుంది. పదికి మించి పాత్రలు కనిపించవు. కానీ వెబ్‌సిరీస్‌ను మాత్రం చివరి వరకు ఇంట్రెస్టింగ్‌గా నడిపించారు డైరెక్టర్ రమేష్ ఇందిర.
కొత్త కోడలికి అత్తిళ్లే పెద్ద మిస్టరీగా మారుతుంది. ఆ ఇంట్లోని ఒక్కొక్కొరు ఒక్కోలా ప్రవర్తిస్తుంటారు. మరోవైపు వరుస మరణాలు…వాటి చుట్టూ అల్లుకున్న మలుపులతో సిరీస్ థ్రిల్లింగ్‌ను పంచుతుంది. దేవుడి శాపం… ఆత్మ రివేంజ్ అంటూ ఒక్కో ఎపిసోడ్‌లో ఒక్కో ట్విస్ట్ చివరి వరకు క్యూరియాసిటీతో సిరీస్‌ను చూసేలా చేశారు.
విలన్ ఎవరు…
విలన్ ఎవరన్నది ఆడియెన్స్ ఏ మాత్రం గెస్ చేయకుండా స్క్రీన్‌ప్లే రాసుకోవడం బాగుంది. ఓ సారి దుష్యంత్, మరోసారి శివ…ఇలా ఒక్కో ఎపిసోడ్‌లో ఒక్కక్కరిని విలన్ అని అనుమానించేలా చేయడం బాగుంది. ఈ హత్యల వెనుక ఎవరున్నారన్నది రివీల్ అయ్యే సీన్ బాగున్నా…కారణం మాత్రం బలంగా లేదు.
గ్రాఫిక్స్, భారీ బడ్జెట్‌లు, కమర్షియల్ హంగులేవి లేకుండా చాలా సింపుల్‌గా ఈ సిరీస్ సాగుతుంది. కథ మొత్తం ఒకే చోట సాగడంతో కొన్నిసార్లు సీరియల్ చూస్తున్న ఫీలింగ్‌ను కలిగిస్తుంది. దుష్యంత్ ఫస్ట్ లవ్‌స్టోరీ కథలో బలవంతంగా ఇరికించినట్లుగా అనిపిస్తుంది.
పాత్రకు న్యాయం..
జాజి పాత్రలో ఖుషి రవి ఒదిగిపోయింది. పాత్ర కోసం ఎంత వరకు నటించాలో అంతే చేసింది. ఎక్కడ ఓవర్ యాక్టింగ్ అనే ఫీలింగ్ కలగదు. అత్తగా మానసి సుధీర్ పాజిటివ్‌గా కనిపించే నెగెటివ్ క్యారెక్టర్‌లో అదరగొట్టింది. దుష్యంత్‌గా అక్షయ నాయక్ ఒకే.
ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ సిరీస్…
అయ్యనా మానే సింపుల్ స్టోరీతో సాగే ఇంట్రెస్టింగ్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్. రన్ టైమ్ తక్కువే. తెలుగు డబ్బింగ్ బాగా కుదిరింది.
సంబంధిత కథనం