




Best Web Hosting Provider In India 2024
రూ.లక్ష లోపు రుణాలపై యువత అనాసక్తి.. లక్ష్యాన్ని చేరుకోని రాజీవ్ యువ వికాసం దరఖాస్తులు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన రాజీవ్ యువ వికాసం పథకంలో 1, 2 క్యాటగిరీల రుణాలకు ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాలేదు. భారీ లక్ష్యాలను పెట్టుకున్నా చిన్న మొత్తాల రుణాలను తీసుకోడానికి యువత ఆసక్తి చూపించక పోవడం చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న రాజీవ్ యువవికాసం పథకంలో రూ.లక్షలోపు రుణాలకు దరఖాస్తులు ఆశించిన స్థాయిలో రాలేదు. రూ.50వేల లోపు రుణాలకు అంతంత మాత్రంగా అప్లికేషన్లు అందితే రూ.లక్షలోపు రుణాలకు కూడా యువత పెద్దగా ఆసక్తి చూపలేదు.
రాజీవ్ యువ వికాసం పథకంలో రూ.లక్షలోపు రుణాలకు యువత పెద్దగా ఆసక్తి చూపించలేదు. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యువ వికాసంలో అర్హులైన 5 లక్షలమందికి రుణాలను మంజూరు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
కేటగిరీ-1, 2లలో 1.22లక్షల యూనిట్లను లక్ష్యంగా పెట్టుకుంటే 93వేల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. పథకం తొలి దశలో 1.32 లక్షల లబ్దిదారులకు పథకాన్ని అమలు చేసేందుకు రూ. 1,100 కోట్లు అవసరమని లెక్క కట్టింది.
క్యాటగిరీ 1,2లలోని లబ్ధిదారులకు తొలివిడతలో ప్రాధాన్యమివ్వాలని, మిగతా కేటగిరీలకు రెండు, మూడు విడతల్లో స్వయం ఉపాధి యూనిట్లు మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.అయితే రాజీవ్ యువ వికాసం స్వయం ఉపాధి రుణాల దరఖాస్తుల్లో లక్ష్యాన్ని చేరుకోలేక పోయినట్టు దరఖాస్తుల సంఖ్యను బట్టి అర్థమవుతోంది.
కార్పొరేషన్‌ల వారీగా దరఖాస్తులు
ఎస్సీ కార్పొరేషన్ విభాగంలో 24వేల మంది లబ్దిదారులకు పథకాన్ని అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దరఖాస్తులు మాత్రం 11, 065 మాత్రమే వచ్చాయి. క్యాటగిరీ 2లో 40, 359మందికి పథకం అందించాలని భావించిన దరఖాస్తులు మాత్రం 4,302మాత్రమే వచ్చాయి.
ఎస్టీ విభాగంలో క్యాటగిరీ 1లో 40వేల మందిని లక్ష్యంగా పెట్టుకుంటే 574మంది దరఖాస్తు చేసుకున్నారు. క్యాటగిరీలో 2లో 22,223 మందిని లక్ష్యంగా పెట్టుకుంటే 3,083 దరఖాస్తులు అందాయి.
బీసీ కార్పొరేషన్ పరిధిలో క్యాటగిరీ 1లో 64,800మందికి లక్ష్యంగా పెట్టుకుంటే 16,641 దరఖాస్తులు, క్యాటగిరీ 2లో 34వేల మందిని లక్ష్యంగా పెట్టుకుంటే 24,274మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఈబీసీ కార్పొరేషన్ పరిధిలో క్యాటగిరీ 1లో 21,600మందికి రాజీవ్ యువ వికాసం పథకాన్ని అమలు చేయాలని భావిస్తే 1180 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. క్యాటగిరీ 2లో 11,333 యూనిట్లకు 1063 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి.
మైనార్టీ దరఖాస్తులే అధికం
మైనార్టీ కార్పొరేషన్ పరిధిలో రూ.50వేల లోపు రుణాలకు 7,500మందిని లక్ష్యంగా పెట్టుకుంటే 9,603 మంది దరఖాస్తు చేసుకున్నారు. క్యాటగిరీ 2లో 13వేల మందికి 60,087 మంది దరఖాస్తు చేసుకున్నారు.
క్రిస్టియన్ మైనార్టీలలో 750మందికి రాజీవ్ యువ వికాసం పథకాన్ని ఇవ్వాలని భావిస్తే 338మంది దరఖాస్తు చేసుకున్నారు. క్యాటగిరీ 2లో 1625మందికి 524మంది దరఖాస్తు చేసుకున్నారు. అన్ని కార్పొరేషన్‌ల పరిధిలో క్యాటగిరీ 1లో యాభై వేలు లోపు స్వయం ఉపాధి పథకాలను 1,58,650మందికి అందించాలని భావిస్తే కేవలం 39,401 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు.క్యాటగిరీ 2లో 1,22, 540మందికి అందించాలని భావిస్తే 93,233మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు.
అన్ని విభాగాలలో 16.23 లక్షల మంది టార్గెట్..
రాజీవ్ యువ వికాసం పథకానికి అన్ని క్యాటగిరీల్లో కలిపి 16.23లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుల్లో 3,4 విభాగాల్లోనే ఎక్కువ దరఖాస్తులు అందాయి. మే నెలాఖరుకు లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను జిల్లా మంత్రులు ఖరారు చేస్తారు. ఈ పథకానికి నెలకు రూ.2వేల కోట్ల చొప్పున మూడు విడతలుగా రూ.6వేల కోట్లను ఖర్చు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.
రూ.50వేల లోపు రుణాలను మంజూరు చ చేసే క్యాటగిరీ 1 రుణాలకు తప్ప మిగిలిన వాటిని బ్యాంకు లింకేజీతోనే మంజూరు చేస్తారు. మొదటి రెండు క్యాటగిరీలకు అనుకున్న స్థాయిలో దరఖాస్తులు రాలేదు.
రెండు క్యాటగిరీల్లో రాష్ట్రంలో 2.8లక్షల మందికి రుణాలను అందించాలని భావించినా 1.32లక్షల దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. రూ.50వేల లోపు రుణాలను 100శాతం గ్రాంటుగా అందిస్తారు. క్యాటగిరీ 1లో రూ.50వేల లోపు రుణాలకు మూడో వంతు దరఖాస్తులు కూడా రాలేదు. క్యాటగిరీ 2లో 1.22లక్షల మందికి రుణాలు ఇవ్వాలని భావిస్తే 93వేల మంది దరఖాస్తు చేసుకున్నారు.
సంబంధిత కథనం
టాపిక్