ఏస్ రివ్యూ – విజ‌య్ సేతుప‌తి మ్యాజిక్ ప‌నిచేసిందా? లేటేస్ట్ క్రైమ్ కామెడీ మూవీ ఎలా ఉందంటే?

Best Web Hosting Provider In India 2024

ఏస్ రివ్యూ – విజ‌య్ సేతుప‌తి మ్యాజిక్ ప‌నిచేసిందా? లేటేస్ట్ క్రైమ్ కామెడీ మూవీ ఎలా ఉందంటే?

Nelki Naresh HT Telugu

విజ‌య్ సేతుప‌తి, రుక్మిణి వ‌సంత్ జంట‌గా న‌టించిన ఏస్ మూవీ మే 23న థియేట‌ర్ల ద్వారా ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ మూవీ ఎలా ఉందంటే?

ఏస్ మూవీ రివ్యూ

త‌మిళంలో వెర్స‌టైల్ యాక్ట‌ర్‌గా పేరుతెచ్చుకున్నాడు విజ‌య్ సేతుప‌తి. క‌థ పాత్ర‌ల ప‌రంగా చూపించే వైవిధ్య‌తే విజ‌య్ సేతుప‌తికి తెలుగులో చ‌క్క‌టి ఫాలోయింగ్‌ను తెచ్చిపెట్టింది. విజ‌య్ సేతుప‌తి హీరోగా న‌టించిన తాజా మూవీ ఏస్ శుక్ర‌వారం (మే 23న‌) త‌మిళంతో పాటు తెలుగులోనే ఒకే రోజు రిలీజైంది.

రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీలో దివ్యా పిళ్లై, యోగి బాబు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. అరుముగ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీని బి. శివ‌ప్ర‌సాద్ తెలుగులో రిలీజ్ చేశారు. ఏస్ ఎలా ఉంది? తెలుగు ప్రేక్ష‌కుల‌ను విజ‌య్ సేతుప‌తి మెప్పించాడా? లేదా? అంటే?

బోల్ట్ కాశీ రాబరీ…

బోల్ట్ కాశీ (విజయ్ సేతుపతి) బ‌తుకు తెరువు కోసం మలేషియాకు వ‌స్తాడు. అక్కడ జ్ఞాన‌మ్‌ (యోగి బాబు) తో బోల్ట్ కాశీకి ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. అత‌డి ద్వారా కల్పన (దివ్యా పిళ్లై) నడిపే హోటల్‌లో చెఫ్‌గా జాబ్‌లో జాయిన్ అవుతాడు కాశీ. మ‌లేషియాలోనే త‌న‌కు ప‌రిచ‌య‌మైన రుక్మిణితో తొలిచూపులోనే ప్రేమ‌లో ప‌డ‌తాడు కాశీ. పోలీస్ ఆఫీస‌ర్ అయిన రాజా దొరై (బబ్లూ) కార‌ణంగా రుక్మిణి ఓ స‌మ‌స్య‌లో ఉంద‌నే నిజం కాశీకి తెలుస్తుంది. మ‌రోవైపు క‌ల్ప‌న కూడా హోట‌ల్ లోన్ క‌ట్టేందుకు డెడ్‌లైన్ త‌క్కువ‌గా ఉండ‌టంతో టెన్ష‌న్ ప‌డుతుంది.

రుక్మిణి, క‌ల్ప‌న‌ల‌కు సాయం చేయ‌బోయి ధ‌ర్మ అనే రౌడీకి పెద్ద మొత్తంలో డ‌బ్బు బాకీ ప‌డ‌తాడు కాశీ. బ్యాంకు రాబ‌రీ చేసి వ‌చ్చిన డ‌బ్బుల‌తో స‌మ‌స్య‌ల నుంచి గ‌ట్టెక్కాల‌ని అనుకుంటాడు. అత‌డి ప్లాన్ స‌క్సెస్ అయ్యిందా? త‌న‌కు ఇవ్వాల్సిన డ‌బ్బు కోసం కాశీని ధ‌ర్మ ఎలాంటి ఇబ్బందులు పెట్టాడు?

ఇండియాలో బోల్డ్ కాశీ అస‌లు జైలుకు ఎందుకు వెళ్లాడు? అత‌డి గ‌తం ఏమిటి? రాజాదొరై…రుక్మిణికి ఏమ‌వుతాడు? ధ‌ర్మ బారి త‌మ ప్రాణాలు కాపాడుకోవ‌డానికి కాశీ, జ్ఞానందం ఏం చేశారు అన్న‌దే ఈ మూవీ కథ.

విజ‌య్ సేతుప‌తి మ్యాజిక్‌…

ఏస్‌…డార్క్‌ కామెడీ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన క్రైమ్ కామెడీ థ్రిల్ల‌ర్ మూవీ. క‌థ రొటీనే కానీ విజ‌య్ సేతుప‌తి స్క్రీన్ ప్ర‌జెన్స్‌, యాక్టింగ్‌, మ్యాన‌రిజ‌మ్స్‌తో డైరెక్ట‌ర్ మ్యాజిక్ చేశాడు. చివ‌రి వ‌ర‌కు న‌వ్విస్తూనే ఎంగేజింగ్‌గా ఈ మూవీని న‌డిపించాడు. లాజిక్‌లు, ప్ర‌యోగాల జోలికి పోకుండా ఓ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలో ఏయే హంగులు ఉండాలో అవ‌న్నీ జోడిస్తూ ఏస్ సినిమాను తెర‌కెక్కించారు.

కామెడీ రిలీఫ్‌…

ఈ సినిమాలో విజ‌య్ సేతుప‌తితో పాటు యోగిబాబు పాత్ర చివ‌రి వ‌ర‌కు క‌నిపిస్తుంది. వారిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చే కామెడీ ఏస్ మూవీకి బిగ్గెస్ట్ రిలీఫ్‌గా నిలిచాయి. సీరియ‌స్ సిట్యూవేష‌న్‌లో యోగిబాబు వేసే పంచ్‌లు వ‌ర్క‌వుట్ అయ్యాయి.

టైమ్‌పాస్‌…

ఫ‌స్ట్ హాఫ్‌లో హీరోతో పాటు యోగిబాబు పాత్ర‌ల ప‌రిచ‌యం, మ‌లేషియాలో హీరోయిన్‌ను చూసి కాశీ ప్రేమ‌లో ప‌డ‌టం లాంటి సీన్స్ తో సినిమా స‌ర‌దాగా సాగిపోతుంది. కామెడీకే ఇంపార్టెన్స్ ఇస్తూ డైరెక్ట‌ర్ టైమ్‌పాస్ చేశారు. సెకండాఫ్ కంప్లీట్‌గా థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లోకి ట‌ర్న్ అయిన త‌ర్వాతే క‌థ‌లో వేగం పెరుగుతుంది. బ్యాంకు రాబ‌రీ కోసం హీరో వేసే ప్లాన్‌, ఆ క్రైమ్ నుంచి త‌ప్పించుకోవ‌డానికి వేసే ఎత్తులు థ్రిల్లింగ్‌ను పంచుతాయి.

రెగ్యుల‌ర్ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీస్‌కు భిన్నంగా క్లైమాక్స్‌ను ప్లాన్ చేసుకోవ‌డం బాగుంది. ఎండింగ్‌లో వ‌చ్చే ట్విస్ట్‌లు స‌ర్‌ప్రైజింగ్‌గా ఉంటాయి. విజ‌య్ సేతుప‌తిపై చిత్రీక‌రించిన యాక్ష‌న్ ఎపిసోడ్స్‌, మ‌లేషియా బ్యాక్‌డ్రాప్ కూడా ఈ సినిమాకు ప్ల‌స్స‌య్యాయి.

మెరుపులు మిస్‌…

థ్రిల్ల‌ర్ సినిమాల్లో క‌నిపించే రేసీ స్క్రీన్‌ప్లే, మెరుపులు ఏస్‌లో మిస్స‌య్యాయి. చాలా వ‌ర‌కు ప్రెడిక్ట‌బుల్‌గా మూవీ సాగుతుంది. లాజిక్‌ల‌ను ద‌ర్శ‌కుడు చాలా చోట్ల మిస్ చేశాడు. క‌థ‌లోని లోపాల‌ను కామెడీతో క‌వ‌ర్ చేశాడు. బోర్ కొట్ట‌కుండా జాగ్ర‌త్త‌ప‌డ్డాడు.

నిజాయితీగా…

బోల్ట్ కాశీగా విజ‌య్ సేతుప‌తి ఈజీగా ఒదిగిపోయారు. కామెడీ, రొమాన్స్‌, యాక్ష‌న్ ఇలా పాత్ర కోసం ఏం చేయాలో అన్ని చేశారు. నిజాయితీగా క‌ష్ట‌ప‌డ్డారు. యోగిబాబు కామెడీ ఈ సినిమాకు ప్ర‌ధాన బ‌లంగా నిలిచింది. సినిమా డౌన్ అవుతోన్న ప్ర‌తిసారి త‌న కామెడీతో నిల‌బెట్టాడు.

రుక్మిణి వసంత్ గ్లామ‌ర్‌తో ఆక‌ట్టుకుంది. దివ్యా పిళ్లై యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న పాత్ర‌లో క‌నిపించింది. ది. అవినాష్ విలనిజం ఆక‌ట్టుకుంది. బ‌బ్లూ పృథ్వీరాజ్‌కు మంచి పాత్ర ద‌క్కింది.

శామ్ సీఎస్ బీజీఎమ్ ఈ సినిమాకు ప్ల‌స్స‌య్యింది.థ్రిల్ల‌ర్ మూవీకి త‌గ్గ‌ట్లుగా ఆర్ ఆర్ కుదిరింది. తెలుగు డ‌బ్బింగ్ ఓకే.

విజ‌య్ సేతుప‌తి యాక్టింగ్ కోసం…

ఏస్ మ‌నీ హీస్ట్ కాన్సెప్ట్‌తో వ‌చ్చిన కామెడీ థ్రిల్ల‌ర్ మూవీ. విజ‌య్ సేతుప‌తి యాక్టింగ్‌, యోగిబాబు కామెడీ కోసం ఈ మూవీని చూడొచ్చు.

రేటింగ్‌: 2.75/5

నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024