భయం తొలగిన రోజే విజయం నీ సొంతమవుతుంది: జానకి కథ చదివితే మీకిది బాగా అర్థమవుతుంది

Best Web Hosting Provider In India 2024

భయం తొలగిన రోజే విజయం నీ సొంతమవుతుంది: జానకి కథ చదివితే మీకిది బాగా అర్థమవుతుంది

Ramya Sri Marka HT Telugu

“నా వల్ల కాదు” అని భయపడితే, జింక కూడా పరిగెత్తలేదు. పరిగెత్తలేనని భయపడిన జింక, ధైర్యంతో మొదటి అడుగు వేసినప్పుడే విజయం వైపు తన ప్రయాణం మొదలైంది. తప్పులను చూసి నవ్వే ప్రపంచంలో, ప్రయత్నించేందుకు చేసే సంకల్పమే నిజమైన గెలుపు అవుతుంది.

విజయం దక్కాలంటే భయాలను తొలగించుకోవాలి

ప్రతి ఒక్కరి జీవితంలో ఒక సమయంలో నిశ్శబ్దంగా మనల్ని వెనక్కి లాగే భయాలు ఉంటాయి. “నాకా శక్తి లేదు”, “వాళ్లంతా నన్ను నమ్మరు”, “నేను ఓడిపోతానేమో” అనే సందేహాలు మన మనసులో పుట్టుకొస్తాయి. కానీ, నిజమైన విజయాలు ఎప్పుడు మొదలవుతాయంటే, ఆ భయాల్ని, అపనమ్మకాలను ఎదురించి తొలి అడుగు వేసినప్పుడే. ఈ కథ కూడా అలాంటి ఒక సాధారణమైన చిన్న జీవిది. జానకి అనే జింకపిల్ల గొప్ప పోరాటం గురించి. తనపై తనకు నమ్మకం లేని జానకి, ఒక్కసారి కిందపడినా మళ్లీ లేచి ఎలా పరిగెత్తిందో తెలుసుకుంటే, మనకూ జీవితంలో కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగుతాం. ఎందుకంటే… జీవితం పరుగు పందెం కాదు గానీ, ధైర్యంతో పోరాడాల్సిన యుద్ధం.

జానకి కథ ఏంటంటే..

చెరువులు, చెట్లతో నిండిన ఒక అందమైన అడవిలో, జానకి అనే జింకపిల్ల ఉండేది. అందమైన కళ్ళతో నునుపైన చర్మంతో ముద్దుగా మెరిసిపోయేది. కానీ, మిగిలిన జింకల కంటే భిన్నంగా పరిగెత్తాలంటే చాలా ఇబ్బంది పడుతుండేది. ఆ భయంతో ఎప్పుడూ మిగతా వాటితో కలవాలంటే సంకోచిస్తూ వేరుగా ఉంటుండేది. అడవిలోని మిగతా జింకపిల్లలన్నీ ఉదయాన్నే పరుగు పందాలలో పాల్గొని ఆడుకుంటూ హాయిగా తిరిగేవి. కానీ, జానకి మాత్రం పక్కనే ఉండి “నాకు పరిగెత్తడం రాదు. నేను పడిపోతాను” అనే ఫీలింగ్ లో బతికేసేది.

జింకల గుంపు
జింకల గుంపు

ఒక రోజు, జానకి అమ్మమ్మ అయిన తెలివైన వృద్ధ జింక ఇది గమనించింది. దగ్గరకు వెళ్లి “జానకి, నువ్వు పరిగెత్తడం లేదు ఎందుకు?” అని అడిగింది. జానకి ముఖం దిగులుగా పెట్టుకుని, “నేను పడిపోతానేమోనని, నాకు భయం అమ్మమ్మ. అంతే కాదు, మిగతా జింకలు కూడా నవ్వుతాయి” అని బదులిచ్చింది. అది విన్న అమ్మమ్మ నవ్వేసి.. “జానకి, పడిపోకుండా పరిగెత్తడం ఎవ్వరూ నేర్చుకోలేదు. ప్రతి ఒక్కరూ పడతారు. కానీ, మనం ఎన్ని సార్లు పడ్డామో కాదు, తిరిగి లేచి ప్రయత్నించడంలోనే మన బలం కనిపిస్తుంది” అని చెప్పిన మాటలు జానకి మనసును తాకాయి. అప్పుడే ఆమె లోపల ఓ చిన్న ధైర్యం మొదలైంది.

కొన్ని రోజుల తర్వాత ఒక ఉదయం, మిగతా జింకలు ఆడుకుంటుండగా జానకి చిన్నగా గెంతింది. మొదట నెమ్మదిగా, ఎంతో జాగ్రత్తగా ఎగరడంతో గాలి జానకి చెవులకు తాకింది. కానీ, కాస్త తడబడి నేలపై పడిపోయింది. అంతే, తాను ఎప్పుడూ పడిపోలేదని గుర్తొచ్చి ఏడుపు తన్నుకొచ్చింది. అదే క్షణంలో తన అమ్మమ్మ మాటలు జ్ఞాపకం వచ్చి, పడితే ఏమవుతుంది? మళ్లీ ప్రయత్నిద్దాం అనుకుంది. గాయం కంటే ఎక్కువ ఆత్మవిశ్వాసంతో మరోసారి గెంతింది. ఈ సారి పడిపోలేదు. ఇక జానకిలో ధైర్యం వచ్చింది. ప్రతిరోజూ కొంచెం కొంచెంగా ఎక్కువ దూరం పరిగెత్తింది. ఒక్కోసారి పడిపోతున్నా, ప్రతి సారి లేచి మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉంది. కొన్ని రోజుల్లో, ఆమె కాళ్ళు బలంగా మారాయి. ఆమె గుండెలోని భయం పూర్తిగా తగ్గిపోయింది.

పరుగు పందెం..

కొన్ని వారాల తర్వాత, అడవిలో ఒక పెద్ద పరుగు పందెం నిర్వహించారు. అందరూ పాల్గొనాలని ఆదేశించారు. జానకి మొదట భయపడింది. కానీ ఆమె అమ్మమ్మ దగ్గరకు వెళ్లి అడిగింది. “నేను గెలవగలనా అమ్మమ్మ” అని. దానికి జానకి అమ్మమ్మ నవ్వి.. “నువ్వు ఇప్పటికే భయాన్ని దాటి గెలిచేశావు జానకి!” అని చెప్పింది. ఆ స్ఫూర్తితో జానకి పందెంలో పాల్గొనాలనుకుంది.

పరుగులు పెడుతున్న జింక
పరుగులు పెడుతున్న జింక

పందెం మొదలైంది! జానకి మొదట వెనుకబడి పోయింది. మిగతా జింకలు వేగంగా పరిగెత్తుతున్నాయి. కానీ జానకి క్రమంగా వేగం పెంచుతూ తన స్థిరమైన అడుగులతో ముందుకు సాగింది. ఒకసారి తడబడింది, మరోసారి పడిపోయింది. కానీ ప్రతి సారి లేచి పరిగెత్తింది. చివరకు, పందెం ముగిసే సమయానికి, జానకి చివరి వరకూ పరుగెత్తి తన పందెం పూర్తి చేయగలిగింది. వేగంగా పరిగెత్తలేమనో, వేరే వాళ్లు ఏమైనా అనుకుంటారనో ఆలోచిస్తూ ఉంటే జానకి పందెంలో చివరి వరకూ పరిగెత్తగలిగేది కాదు. ఆ రోజు జానకి చేసిన ప్రయత్నానికి అడవిలోని జంతువులంతా చప్పట్లు కొట్టాయి. జానకిని అందరూ మెచ్చుకున్నారు. తన ధైర్యాన్ని శభాష్ అని పొగిడేశారు. ఎప్పుడూ పరిగెత్తని జానకి పరుగును పూర్తి చేయగలిగిందనే విషయాన్ని స్ఫూర్తిగా చెప్పుకున్నారు.

జానకి పరిగెత్తింది. కాకపోతే, పరిగెత్తి గెలవలేకపోయింది. కానీ భయాన్ని జయించింది. అది నిజమైన గెలుపు. ఎందుకంటే విజయాలన్నీ గమ్యం చేరడం వల్ల కాకుండా, ప్రయత్నించడం వల్ల మొదలవుతాయి.

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024