





Best Web Hosting Provider In India 2024

సమ్మర్లో చక్కెర, కొవ్వులు లేకుండా రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ
రోజును ఆరోగ్యంగా, శక్తివంతంగా మొదలుపెట్టడానికి ఒక సూపర్ ఐడియా ఈ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ. ఇంట్లోనే సులువుగా చక్కెర, కొవ్వులు లేని హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ మిక్స్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఒక్కసారి చేసుకుని, చాలా రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు కూడా.
బిజీ లైఫ్‌స్టైల్‌లో పడిపోయి ఉదయాన్నే ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవడాన్ని చాలా వరకూ నిరక్ల్యపెడతాం. తరచుగా సమయం లేకనో, ఏది ఆరోగ్యకరమైనదో తెలియకనో, బయట దొరికే ప్రాసెస్ చేసిన అల్పాహారాలను ఆశ్రయిస్తూ ఉంటాం. అయితే, చక్కెరలు, అనవసరమైన కొవ్వులు లేని, ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోగల నో షుగర్, నో యాడెడ్ ఫ్యాట్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ మిక్స్‌ను ఒక్కసారి తయారుచేసుకుంటే, రోజంతా శక్తివంతంగా ఉండొచ్చు. ఇంట్లో చేసుకునే ఈ పోషకాహార మిశ్రమం మీ శరీరానికి అవసరమైన శక్తిని అందించి, రోజంతా మిమ్మల్ని యాక్టివ్‌గా ఉంచుతుంది.
ఉదయాన్నే ఆరోగ్యకరమైన అల్పాహారం కావాలంటే, బయట దొరికే వాటిపై ఆధారపడకుండా, ఇంట్లోనే ఈ పోషకాలతో నిండిన బ్రేక్‌ఫాస్ట్ మిక్స్‌ను సులభంగా తయారుచేసుకోండి.
ఈ బ్రేక్‌ఫాస్ట్ మిక్స్ కోసం కావలసినవి:
- మఖానా: 2 కప్పులు
- శనగలు: 1-2 కప్పులు
- ఓట్స్: 1/2 కప్పు
- నట్స్ మిశ్రమం (వాల్‌నట్స్, జీడిపప్పు, బాదం పప్పు): అన్నీ కలిపి 3/4 కప్పు
- అవిసె గింజలు (ఫ్లాక్స్‌సీడ్స్): 1/4 కప్పు
- గుమ్మడి గింజలు (పంపకన్ సీడ్స్): 1/4 కప్పు
- పొద్దుతిరుగుడు పువ్వు గింజలు (సన్‌ఫ్లవర్ సీడ్స్): 1/4 కప్పు
- నెయ్యి: కొద్దిగా (వేయించడానికి)
మ్యాంగో యోగర్ట్ స్మూతీ కోసం:
- పండిన మామిడికాయ ముక్కలు: తగినన్ని
- ఖర్జూరాలు: 2-3 (లేదా మీ తీపికి తగ్గట్టు)
- పెరుగు: (షుగర్ లేనిది)
ఎటువంటి హానికారక కొవ్వులు, చక్కెర వినియోగించకుండా తయారుచేసుకునే విధానం ఎలాగో చూసేద్దాం.
తయారుచేసే పద్ధతి:
మఖానా, శనగలు, ఓట్స్ రోస్ట్ చేయడం:
- ముందుగా, స్టవ్ మీద ఒక మందపాటి పాన్ ఉంచి అందులో కొద్దిగా నెయ్యి వేసి వేడి చేయండి.
- నెయ్యి కరిగిన తర్వాత, మఖానాలను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు, క్రిస్పీగా మారేవరకు (సుమారు 3-5 నిమిషాలు) రోస్ట్ చేసి, ఒక మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకోండి.
- అదే పాన్‌లో శనగలను కూడా సుమారు 2-3 నిమిషాలు వేయించండి. వాటిని కూడా మఖానా బౌల్‌లో వేయండి.
- చివరగా, ఓట్స్‌ను కూడా అదే పాన్‌లో బంగారు రంగు వచ్చేవరకు (సుమారు 1-2 నిమిషాలు) వేయించి, మిక్సింగ్ బౌల్‌లో కలపండి.
- ఇప్పుడు, అదే పాన్‌లో నెయ్యి అవసరమైతే కొద్దిగా వేసి, బాదం పప్పు, జీడి పప్పు, వాల్‌నట్స్‌ను వేసి, సుమారు 2-3 నిమిషాలు దోరగా వేయించండి.
- వేయించిన నట్స్‌ను కూడా మిక్సింగ్ బౌల్‌లో వేయండి.
గింజలు రోస్ట్ చేయడం:
- చివరగా, అదే పాన్‌లో గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు పువ్వు గింజలు, అవిసె గింజలను కలిపి, సుమారు 1-2 నిమిషాలు నెయ్యి లేకుండా డ్రై రోస్ట్ చేయండి.
- ఈ వేయించిన గింజలను కూడా మిక్సింగ్ బౌల్‌లో వేసి, అన్నీ బాగా కలిసేలా గరిటెతో తిప్పండి.
- ఇలా తయారుచేసుకున్న హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ మిశ్రమాన్ని గాలి చొరబడని కంటైనర్‌లో నిల్వ చేసుకోండి.
- ప్రతిరోజూ ఉదయం అల్పాహారం కోసం 2-3 చెంచాల మిశ్రమాన్ని తీసుకోవచ్చు.
మామిడి యోగర్ట్ స్మూతీ తయారీ:
- ఒక బ్లెండర్‌లో పండిన మామిడికాయ ముక్కలు, ఖర్జూరాలు (గింజలు తీసివేసి), తగినంత పెరుగు వేసి, మెత్తని స్మూతీలా గ్రైండ్ చేయండి.
- ఇప్పుడు, ఈ మ్యాంగో స్మూతీలో మీరు నిల్వ చేసుకున్న మఖానా మిశ్రమాన్ని అవసరమైన మేర (ఉదాహరణకు, 2-3 చెంచాలు) వేసి బాగా కలపండి.
అంతే. చక్కెర లేకపోయినా తియ్యగా, కొవ్వులు లేకున్నా మృదువుగా అనిపించే ఈ అద్భుతమైన హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెడీ అయినట్లే. బయట దొరికే కృత్రిమ సప్లిమెంట్స్, లేదా అనారోగ్యకరమైన ప్రాసెస్డ్ బ్రేక్‌ఫాస్ట్‌ల కంటే, ఇంట్లో తయారుచేసుకునే ఈ పోషకాలతో నిండిన మిశ్రమం మీ ఆరోగ్యానికి చాలా బెస్ట్ ఆప్షన్. మీ రోజువారీ అల్పాహారంలో దీన్ని భాగం చేసుకొని, రోజంతా ఉత్సాహంగా ఉండండి.