




Best Web Hosting Provider In India 2024

కవితపై కుట్ర జరిగిందా…? కోవర్టులెవరు..? తెరపైకి కొత్త ప్రశ్నలు…!
పార్టీలో కోవర్టులు ఉన్నారంటూ కవిత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయని… వాటి వల్లే పార్టీకి నష్టమంటూ కుండబద్ధలు కొట్టారు. తనపై కుట్ర చేశారని.. అందులో భాగంగానే లేఖను లీక్ చేశారని ఆరోపించారు. అయితే కవిత ఎవర్నీ ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారనేది హాట్ టాపిక్ గా మారింది.
“ఎల్కతుర్తి సభ తర్వాత రెండు వారాల క్రితం పార్టీ అధినేత కేసీఆర్‌కు లేఖ రాశా. అంతర్గతంగా రాసిన లేఖ ఎలా బయటికి వచ్చిందో అర్థం కావడం లేదు. కేసీఆర్ కుమార్తెనైన నేను రాసిన లేఖ లీక్ అయింది. దీన్ని బట్టి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నా పరిస్థితే ఇలా ఉంటే మిగిలిన వారి పరిస్థితేంటి? నా లేఖ లీక్ వెనుక ఎవరో ఉండి ఉండొచ్చు”… ఇవి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన తాజా వ్యాఖ్యలు…! లేఖ రాసింది నిజమేనని స్పష్టం చేసిన ఆమె…. పార్టీలో కోవర్టులు ఉన్నారని… కేసీఆర్ చుట్టు దెయ్యాలున్నాయని ఆరోపించారు. అయితే కవిత చేసిన ఈ వ్యాఖ్యలు… పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
లేఖ లీక్… కుట్ర జరిగిందా…?
అంతర్గతంగా రాసిన లేఖ ఎలా బయటికి వచ్చిందో అర్థం కావటం లేదని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. లేఖ లీక్ వెనక కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. కవిత చేసిన ఈ ఆరోపణలతో అనేక అంశాలు తెరపైకి వస్తున్నాయి. అసలు కవిత లేఖను నేరుగా కేసీఆర్ కు ఇచ్చారా…? లేక ఎవరితోనైనా పంపారా..? అన్న ప్రశ్న ప్రధానంగా తెరపైకి వస్తోంది. అంతేకాదు రాసిన లేఖ కేసీఆర్ కు చేరినప్పటికీ… బయటికి లీక్ చేసిందెవరు…? చేయాల్సిన అవసరం ఏం వచ్చిందన్న చర్చ జరగుతోంది.
పార్టీ అధినేతకు సొంత కుమార్తె కవిత అంతర్గతగా రాసిన లేఖ బయటికి రావటమంటే చిన్న విషయం కాదు. ఇదే అనుమానాన్ని కూడా కవిత కూడా వ్యక్తం చేశారు. తనకే ఇలాంటి పరిస్థితి ఉంటే… మిగిలిన వారి పరిస్థితేంటి అని ప్రశ్నించారు. కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయని ముందుగానే చెప్పానని…అందులో భాగంగానే ఇదంతా జరిగిందని కూడా వ్యాఖ్యానించారు. లేఖ బహిర్గతం కావడంపై పార్టీలో ఉన్న అందరం ఆలోచించుకోవాల్సిన విషయమంటూ హితవు పలికారు.
ఎవర్నీ ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు…!
సొంత పార్టీలోని నేతలే కుట్రలు చేస్తున్నారని కవిత ఆరోపించటం సంచలనంగా మారింది. అంతే కాదు కేసీఆర్ చుట్టు కొన్ని దెయ్యాలున్నాయని అన్నారు. ఈ కామెంట్స్ పార్టీలో ప్రకంపనలు సృషిస్టున్నాయి. అధికారం కోల్పోయిన తర్వాత… కేసీఆర్ ఫామ్ హౌస్ కేంద్రంగానే రాజకీయాలు చేస్తున్నారు. సందర్భాన్ని బట్టి తెలంగాణ భవన్ లేదా నందినగర్ లోని తన నివాసానికి వస్తున్నారు. పైగా కేసీఆర్ చుట్టూ అతికొద్ది మంది నేతలే ఉంటారు. వీరిలో పార్టీలోని నేతలతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. వీరిలో ఎవర్నీ ఉద్దేశించి… కవిత వ్యాఖ్యలు చేశారనేది అతిపెద్ద ప్రశ్నగా మారింది.
తాజా పరిణామాల నేపథ్యంలో కవితపై నిజంగానే సొంత పార్టీ నేతలు కుట్ర చేశారా…? అన్న చర్చ గట్టిగా జరుగుతోంది. కవిత ఆరోపిస్తున్నట్లు కేసీఆర్ చుట్టు ఉన్న దెయ్యలెవరు..? లేఖను బయటపెట్టిన కోవర్టులెవరు..? కవితను టార్గెట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. కవిత వ్యాఖ్యల నేపథ్యంలో… గులాబీ బాస్ కేసీఆర్ రియాక్షన్ ఎలా ఉండబోతుందనేది కూడా ఉత్కంఠను రేపుతోంది…!
సొంతంగా కార్యక్రమాలు…!
గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ కవిత తీరు కూడా చర్చనీయాంశంగానే ఉంది. బీసీ అజెండాతో పలు కార్యక్రమాలను నిర్వహిస్తూ ముందుకెళ్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ జెండా కాకుండా…. కవిత కేంద్రంగానే ఇదంతా నడుస్తోంది. జిల్లా పర్యటనలు చేస్తూ తమ మార్క్ ను చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సామాజిక తెలంగాణ సాధించుకోలేపకపోయామంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.
కొద్దిరోజుల కిందట మీడియాతో మాట్లాడిన కవిత… తనపై కుట్రలు చేస్తున్నారంటూ కూడా మాట్లాడారు. వాళ్లెవరో తనకు తెలుసని… టైమ్ వచ్చినప్పుడు బయటపెడతానంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించాల్సిన బాధ్యత పార్టీపై కూడా ఉందంటూ ఆవేదనను వ్యక్తపరిచేలా మాట్లాడారు. అయితే కవిత…. పార్టీలోని ఒక్కరిద్దరూ నేతలను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని పార్టీ అధినేత కేసీఆర్ దృష్టికి కూడా తీసుకెళ్లారని తెలుస్తోంది..!
ఎమ్మెల్సీ కవిత తీరు చూస్తుంటే పార్టీలోని పరిస్థితులపై ఆమె తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలే ఆమె చేస్తున్న వ్యాఖ్యలతో పాటు తాజాగా లేఖ లీక్ వంటి అంశాలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయని చెప్పొచ్చు. పార్టీ నుంచి తనని సైడ్ చేస్తున్నారనే భావన ఆమెలో బలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. పార్టీలో తన ప్రియారిటీని తగ్గించే పరిణామాలు కనిపిస్తున్నాయనే భావనలో కూడా కవిత ఉన్నట్లు తెలుస్తోంది…! ఏది ఎలా ఉన్నా తమ నాయకుడు కేసీఆరే అని… ఆయన నాయకత్వమే తెలంగాణకు మేలు జరుగుతుందనే విషయం స్పష్టం చేయటంతో…ఆమెకు మరో ఆలోచన లేదనే విషయం కూడా చెప్పకనే చెప్పేసింది…!
సంబంధిత కథనం
టాపిక్