





Best Web Hosting Provider In India 2024

నిశబ్ద ప్రేమ రివ్యూ.. ట్విస్టులతో సాగే సస్పెన్స్ లవ్ డ్రామా.. కిల్లర్‌గా హీరో శ్రీరామ్ మూవీ ఎలా ఉందంటే?
హీరో శ్రీరామ్, ప్రియాంక తిమ్మేష్ జంటగా నటించిన లేటేస్ట్ తెలుగు సస్పెన్స్ లవ్ డ్రామా మూవీ నిశబ్ద ప్రేమ. రాజ్ దేవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 23న థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా అనే వివరాలను నిశబ్ద ప్రేమ రివ్యూలో తెలుసుకుందాం.
మూవీ పేరు: నిశ్శబ్ద ప్రేమ
నటీనటులు: శ్రీరామ్, ప్రియాంక తిమ్మేష్, హరీశ్ పెరడి, వియాన్, నిహారిక పాత్రో తదితరులు
దర్శకత్వం: రాజ్ దేవ్
సంగీతం: జుబిన్
ఎడిటర్: మదన్.జి
డీవోపీ: యువరాజ్.ఎం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పరిటాల రాంబాబు
నిర్మాత: కార్తికేయన్. ఎస్
బ్యానర్: సెలెబ్రైట్ ప్రొడక్షన్స్
విడుదల తేది: మే 23, 2025
టాలీవుడ్‌లో తన సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు హీరో శ్రీరామ్. హీరోగానే కాకుండా పలు సినిమాల్లో నటుడిగా కూడా మెప్పించాడు. తాజాగా శ్రీరామ్ తెలుగులో నటించిన సస్పెన్స్ లవ్ డ్రామా మూవీ నిశబ్ద ప్రేమ. రాజ్ దేవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 23న థియేటర్లలో విడుదలైంది. మరి ఈ మూవీ మెప్పించిదా, ఎలా ఉంది అనే వివరాలను నిశబ్ద ప్రేమ రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
సంధ్య (ప్రియాంక తిమ్మేష్)ను వాళ్లింట్లోనే ఓ ముసుగు మనిషి వెంబడిస్తూ చంపే ప్రయత్నం చేస్తుంటారు. ఆమె ఆ ముసుగు మనిషిని తప్పించుకుని వీధిలోకి వచ్చి పరుగెడుతుండగా ఓ వ్యక్తి ఆమెకు యాక్సిడెంట్ చేస్తాడు. యాక్సిడెంట్ అయి రోడ్డుపై పడి ఉన్న సంధ్యను రఘు అనే వ్యక్తి హాస్పిటల్‌లో చేర్చి ట్రీట్‌మెంట్ ఇప్పించగా, తలకు తగిలిన దెబ్బతో ఆమె గతం మరిచిపోతుంది.
తనని హాస్పిటల్‌లో చేర్చిన రఘు ఎవరో కాదు తన భర్తే అని పరిచయం చేసుకుని తన ఇంటికి తీసుకెళ్లి యోగ క్షేమాలు చూస్తుంటాడు. ఈ క్రమంలో పాత డైరీని చూసిన సంధ్య.. అతను రఘు కాదని, విఘ్నేష్ (శ్రీరామ్) అని తెలుసుకుంటుంది. మరోవైపు తన భార్య సంధ్య కనిపించడం లేదంటూ రఘు (వియాన్) పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. విచారణ మొదలెట్టిన కమిషనర్ అడ్వర్డ్ (హరీశ్ పెరడి)కు యునానిమస్ కిల్లర్ దగ్గర సంధ్య ఉందని తెలుస్తుంది.
మూవీలోని ట్విస్టులు
అసలు సంధ్యను విఘ్నేష్ ఎందుకు తన ఇంటికి తీసుకెళ్లాడు? సంధ్య ఎలా అతని నుంచి తప్పించుకుంది? అసలు విఘ్నేష్ ఎవరు? రఘు ఎవరు? వీరిద్దరికి, సంధ్యకి ఉన్న సంబంధం ఏమిటి? మధ్యలో రఘు పర్సనల్ సెక్రటరీ అయిన షీలా (నిహారిక పాత్రో) పాత్రేమిటి? అసలు సంధ్యని చంపాలనుకున్నది ఎవరు? వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ఈ నిశబ్ద ప్రేమను చూడాల్సిందే.
విశ్లేషణ:
ఇది ఒక సస్పెన్స్ లవ్ డ్రామా సినిమా. ఇందులో పాత్రలను పరిచయం చేయడం కోసం పెద్దగా టైమ్ తీసుకోకుండా, డైరెక్ట్‌గా కథలోకి తీసుకెళ్లిన విధానం బాగుంది. సినిమాలో రెండే రెండు పాటలు ఉన్నాయి. ఒక థ్రిల్లర్ చిత్రానికి ఐదారు పాటలు పెట్టి ఫ్లో చెడగొట్టకుండా, ఎక్కడ పాటలు రావాలో అక్కడే సెట్ చేశారు. దర్శకుడు మొదటి నుంచి చివరి వరకు ఎంగేజ్ చేయడంలో సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు.
సగం సినిమా అయ్యే సమయానికి, అసలు సంధ్యని చంపాలనుకున్నది ఎవరు? అనేది ఓ క్లారిటీ వస్తుంది. కానీ, అతను ఎలా బయటకు వస్తాడు? అతన్ని ఎవరు కనిపెడతారు? అనేది ఉత్కంఠగా సాగుతుంది. చివరకు ఇచ్చిన ముగింపు కూడా కన్వెన్సింగ్‌గానే ఉంది. శ్రీరామ్ డైలాగ్స్‌తో టైటిల్ జస్టిఫికేషన్ ఇవ్వడంలో కూడా దర్శకుడు సక్సెస్ అయ్యాడు.
ట్విస్టులతో పాటు వివరణ
ఓవరాల్‌గా అయితే, ఎక్కడా బోర్ కొట్టకుండా, ట్విస్ట్‌లతో పాటు వాటికి వివరణ ఇచ్చిన విధానం ప్రేక్షకులకు ఒక మంచి సినిమా చూశామనే ఫీల్‌ని ఇస్తుంది. ఇక యునానిమస్ కిల్లర్ విఘ్నేష్ పాత్రలో శ్రీరామ్ నటన బాగుంది. ఈ సినిమాకు హైలెట్‌లా నిలిచింది. సీరియస్ ఫేస్‌తో కనిపించడమే కాకుండా, క్రూరంగా హత్యలు చేసే పాత్రని ఆయన ఇందులో పోషించారు.
ఇందులో మరో కోణం ఆయన పాత్రకి ఉంది. ఆ పాత్రలోనూ శ్రీరామ్ తన అనుభవాన్ని కనబరిచారు. అలాగే, సంధ్యగా నటించిన ప్రియాంక తిమ్మేష్ పాత్రపైనే ఈ సినిమా అంతా నడుస్తుంది. గృహిణిగా చక్కని అభినయం ఆమె ప్రదర్శించింది. మరో కీలక పాత్రలో షీలాగా నటించిన నిహారిక పాత్రో కనిపించేది కాసేపే అయినా గ్లామర్‌తో చేసింది.
అలరించే పాత్రలు
రఘు పాత్రలో నటించిన వియాన్ అమాయకుడిగానూ, అలాగే కథలో కీలకమైన పాత్రలోనూ మెప్పించారు. ఇంకా హరీశ్ పెరడితో పాటు ఇతర పాత్రలలో నటించిన వారంతా వారి పాత్రల పరిధిమేర నటించి అలరించారు. సాంకేతికంగా సినిమా చాలా ఉన్నతంగా ఉంది. ముఖ్యంగా జుబిన్ బీజీఎమ్ హైలెట్ అయింది. సినిమాటోగ్రఫీ కూడా మూడ్‌కి అనుగుణంగా ఉంది.
ఫైనల్‌గా చెప్పాలంటే
ఎడిటింగ్ పరంగా కూడా ఎటువంటి వంకలు లేవు. మధ్యలో ఒకటి రెండు సీన్లు కాస్త స్లో అనిపించినా, కథలోని థ్రిల్లింగ్ అంశాలు దానిని డామినేట్ చేస్తాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. స్ట్రైయిట్ తెలుగు సినిమా చూస్తున్న ఫీల్‌ని కలిగించారు. దర్శకుడు తను రాసుకున్న కథని, సైడ్ ట్రాక్‌కి వెళ్లకుండా పర్‌ఫెక్ట్‌గా చిత్రీకరించి ప్రతిభ చాటుకున్నారు. ఫైనల్‌గా చెప్పాలంటే టైమ్ ఉంటే చూడాల్సిన సస్పెన్స్ లవ్ డ్రామా సినిమా నిశబ్ద ప్రేమ.
రేటింగ్: 2.75/5
సంబంధిత కథనం