తెలంగాణను మూడు జోన్లుగా విభజించి మాస్టర్ ప్లాన్.. నీతి ఆయోగ్​ సమావేశంలో రేవంత్ వెల్లడి

Best Web Hosting Provider In India 2024

తెలంగాణను మూడు జోన్లుగా విభజించి మాస్టర్ ప్లాన్.. నీతి ఆయోగ్​ సమావేశంలో రేవంత్ వెల్లడి

Basani Shiva Kumar HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Basani Shiva Kumar HT Telugu

తెలంగాణను మూడు జోన్లుగా విభజించి మాస్టర్ ప్లాన్ రూపొందించినట్టు.. సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. నీతి ఆయోగ్​ సమావేశంలో మాట్లాడిన ముఖ్యమంత్రి.. తెలంగాణ అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఆపరేషన్ సింధూర్‌పై స్పందిస్తూ.. ప్రధాని మోదీకి, భారత సైన్యానికి అభినందనలు చెప్పారు.

నీతి ఆయోగ్ సమావేశంలో రేవంత్ రెడ్డి

2047 నాటికి భారతదేశాన్ని సూపర్ పవర్‌గా, నెంబర్ వన్‌గా నిలబెట్టాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పాన్ని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతించారు. వికసిత భారత్ ప్రణాళికను రూపొందించడం అభినందనీయమన్నారు. పహల్గాంలో మారణకాండ సృష్టించిన ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ నిర్వహించినందుకు.. మోదీకి, భారత సైన్యానికి అభినందనలు చెప్పారు. 1971లో ఇందిరాగాంధీ నాయకత్వంలో పాకిస్థాన్‌ను ఓడించి, ఆ దేశాన్ని రెండు ముక్కలుగా చీల్చిన చరిత్రను గుర్తుచేశారు.

ఆదర్శవంతమైన లక్ష్యాలతో..

‘తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళిక సిద్ధమైంది. ఆర్థిక, సామాజిక, పరిపాలన రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్​-2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించాం. పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రా డెవలప్మెంట్, పారదర్శక సుపరిపాలన లక్ష్యాలకు ప్రాధాన్యమిస్తాం. తెలంగాణ సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ కుల గణన, బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌లు, ఎస్సీల ఉప వర్గీకరణకు ప్రజా ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది’ అని రేవంత్ రెడ్డి వివరించారు.

దేశంలో మొదటిసారిగా..

‘తెలంగాణ సమగ్రాభివృద్ధికి ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ, ఇన్ఫ్రా అండ్ ఇండస్ట్రియల్ పాలసీ, టూరిజం పాలసీలను సిద్ధం చేసి కార్యాచరణలో పెట్టాం. అభివృద్దిలో, సంక్షేమంలో ఆయా వర్గాలకు న్యాయమైన వాటా ఇవ్వాలన్నది తమ సంకల్పం. అందుకే తెలంగాణలో సామాజిక, ఆర్ధిక, విద్య, ఉద్యోగ, రాజకీయ కుల గణన చేపట్టాం. బీసీలకు విద్య, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ ఉపకులాల వర్గీకరణ.. ఈ రెండు చరిత్రాత్మక నిర్ణయాలను దేశంలోనే మొట్టమొదటగా తెలంగాణ అమలు చేయడం గర్వంగా ఉంది’ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం..

‘దేశవ్యాప్త కుల గణనకు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. కులగణనలో తెలంగాణ అనుభవాలను పంచుకునేందుకు సిద్ధంగా ఉంది. 2028 నాటికి రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మహిళలకు కీలక పాత్ర ఉండేలా విధానాలు రూపొందించాం. మహాలక్ష్మీ ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళా సంఘాలకు రూ.లక్ష కోట్ల రుణాలు, మహిళా సంఘాలకు పాఠశాలల నిర్వహణ, శిల్పారామంలో 100 స్టాళ్లతో మహిళా బజార్లను ఏర్పాటు చేశాం. సోలార్ పవర్ జనరేషన్ లోనూ భాగస్వామ్యం కల్పించి మహిళలను వ్యాపార, పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహించే కార్యక్రమాలు అమలు చేస్తున్నాం’ అని సీఎం చెప్పారు.

మన యువతే భవిష్యత్తు..

‘మన దేశ భవిష్యత్తు మన యువత. తెలంగాణ రాష్ట్ర సాధనలో యువతదే కీలక పాత్ర. అందుకే యువత ఆశయాల సాధనకు అనుగుణంగా యూత్ పాలసీ అమలు చేస్తున్నాం. 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం. ప్రైవేటు రంగంలో లక్ష ఉద్యోగాలు సృష్టించాం. ఒకవైపు మానవ వనరులకు డిమాండ్ పెరుగుతున్నా.. మరోవైపు నిరుద్యోగ సమస్య నెలకొంది. నైపుణ్యాల కొరతే ఈ అంతరానికి కారణమని గుర్తించాం. అందుకే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, పోలీస్ స్కూల్, ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్, ఐటీఐలను అడ్వాన్సుడ్ టెక్నాలజీ సెంటర్లుగా ఆధునీకరించి స్కిల్ శిక్షణ ఇస్తున్నాం’ అని రేవంత్ వివరించారు.

రైతుకు భరోసా ఇస్తున్నాం..

‘రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా యువతకు రూ.5 లక్షల స్వయం ఉపాధి పథకాన్ని జూన్ 2 నుంచి ప్రారంభిస్తున్నాం. దేశానికి రైతే వెన్నెముక. ఆ వెన్నెముకను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. రైతుల ఆత్మహత్యలకు అప్పులే ప్రధాన కారణం. వారిని అప్పుల ఊబి నుండి బయటకు తేవడం, తిరిగి ఆ ఊబిలోకి జారిపోకుండా నిలబెట్టాలన్న లక్ష్యాలతో పని చేస్తున్నాం. తెలంగాణలో 25.35 లక్షల మంది రైతులకు, రూ.20,616 కోట్ల రుణమాఫీ చేసి వారిని రుణ విముక్తులను చేశాం. సాగు కోసం రైతు మళ్లీ అప్పుల పాలు కాకూడదన్న ఉద్దేశంతో ఎకరాకు రూ.12 వేల రైతు భరోసా సాయం చేస్తున్నాం’ అని ముఖ్యమంత్రి నీతి ఆయోగ్ సమావేశంలో చెప్పారు.

మాట ఇస్తున్నాను..

‘వికసిత భారత్‌ లక్ష్య సాధన మనందరి ఆశయం. అందులో తెలంగాణ కీలక పాత్ర పోషించాలని మా ఆకాంక్ష. నేషన్ ఫస్ట్ – పీపుల్ ఫస్ట్.. అన్న ప్రాధాన్యతతో ముందుకు వెళుతున్నాం. ఈ దేశం రాష్ట్రాల సమాఖ్య. కేంద్రం సహాయ సహకారం మద్దతు లేకుండా తెలంగాణ రైజింగ్ విజన్ అమలు చేయలేం. తెలంగాణ సమగ్రాభివృద్ధికి సహకరించండి. వికసిత భారత్ లక్ష్య సాధనలో తెలంగాణ మొదటి వరుసలో ఉంటుందని మాట ఇస్తున్నాను’ అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Basani Shiva Kumar

eMail

సంబంధిత కథనం

టాపిక్

Revanth ReddyNarendra ModiTelangana NewsTrending Telangana
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024