





Best Web Hosting Provider In India 2024

తిరుమలలో త్వరితగత సేవలకు ఏఐ వినియోగం, టీటీడీలో అన్యమతస్తులపై చర్యలు- ఈవో శ్యామలరావు
తిరుమలను ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేయడానికి టీటీడీ పట్టణ ప్రణాళిక శాఖను ఏర్పాటు చేశామని ఈవో శ్యామలరావు తెలిపారు. ఇటీవలే పలు పోస్టుల భర్తీకి క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపిందన్నారు. సీఎం ఆదేశాల మేరకు టీటీడీలో ప్రక్షాళన చేపట్టామన్నారు.
టీటీడీలో మరింత పారదర్శకంగా సాంకేతిక సేవలు అమలు చేయనున్నట్లు టీటీడీ ఈవో జె.శ్యామలరావు వెల్లడించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్ లో శనివారం ఉదయం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా టీటీడీ చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి టీటీడీ ఈవో వెల్లడించారు.
వేసవి నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు
• వేసవి నేపథ్యంలో తిరుమల, టీటీడీ స్థానిక ఆలయాల్లో భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేపట్టారు.
• భక్తులు ఎండ తీవ్రతకు ఇబ్బంది పడకుండా ఆలయ మాడ వీధుల్లో చలువ పందిళ్లు, కూల్ పెయింట్, నిరంతరాయంగా నీటిని పిచికారి చేస్తున్నారు.
• రద్దీ ప్రాంతాల్లో, క్యూలైన్లలో తాగునీరు, మజ్జిగ విరివిగా పంపిణీ చేస్తున్నారు.
• తిరుపతిలో శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్ లలో దర్శన టోకెన్ల కోసం వేచి ఉండే భక్తులకు మంచినీరు, మజ్జిగ, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారు.
మరింత పటిష్టంగా శ్రీవారి సేవ
సీఎం నారా చంద్రబాబు ఆదేశాల మేరకు టీటీడీలో మరింత పటిష్టంగా శ్రీవారి సేవను అమలు చేసేందుకు చర్యలు చేపట్టామని ఈవో తెలిపారు.
శ్రీవారి ఎన్ఆర్ఐ సేవలు
ఎన్ఆర్ఐలు శ్రీవారి సేవ చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
గోమాత సేవ
గోమాతలకు సేవ చేసేందుకు ‘గోసేవ’ను అందుబాటులోకి తీసుకురానున్నామని ఈవో శ్యామలరావు తెలిపారు.
గ్రూప్ లీడర్ల వ్యవస్థ
గ్రూప్ లీడర్ల వ్యవస్థను ప్రవేశపెట్టి వారికి దశలవారీగా శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.
తిరునామధారణ పునరుద్ధరణ:
తిరుమలలో తిరునామధారణ కార్యక్రమాన్ని పునరుద్ధరించామని ఈవో తెలిపారు.
శ్రీవారి సేవకులతో తిరుమలలోని 18 ప్రాంతాల్లో ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతోందని చెప్పారు.
టీటీడీలో ప్రణాళికబద్ధంగా అభివృద్ధి:
• తిరుమలను ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేయడానికి టీటీడీ పట్టణ ప్రణాళిక శాఖను ఏర్పాటు చేశాం.
• ఇటీవలే పలు పోస్టుల భర్తీకి క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది.
• దేశవ్యాప్తంగా ఉన్న ఆర్కిటెక్ఛర్ కన్సెల్టెన్సీల ద్వారా టీటీడీలో అన్ని ఆలయాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం.
మొదటి దశలో
తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, అమరావతి వేంకటేశ్వరస్వామి ఆలయం, నారాయణవనం కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం, కపిలతీర్థం కపిలేశ్వరస్వామి ఆలయం, నాగాలాపురం వేదనారాయణస్వామి ఆలయం, ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయం, తిరుమలలోని ఆకాశగంగ, పాపవినాశనం అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ తయారు చేసేందుకు చర్యలు చేపట్టామని డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఈవో శ్యామలరావు తెలిపారు.
వసతి గృహాల పేర్లు మార్పు
• తిరుమలలోని 45 విశ్రాంత భవనాల పేర్లు మార్పునకు 75 ఆధ్యాత్మిక పేర్లను టీటీడీ ఎంపిక చేసింది.
• ఇందులో 42 మంది టీటీడీ సూచించిన పేర్లను మార్పు చేశారు.
• ఇదివరకే 33 కాటేజీలకు వివిధ దేవతల పేర్లు కలిగి ఉన్నాయి.
• మిగిలిన రెండు విశ్రాంతి గృహాలు స్పందించలేదు.
• దీంతో ఈ విశ్రాంతి గృహాల పేర్లను టీటీడీనే మార్పు చేసేందుకు, ఇండియన్ ఆర్మీకి చెందిన సైనిక్ నివాస్ పేరు విషయంలో వారితో చర్చించేందుకు బోర్డు నిర్ణయించింది.
టీటీడీలో ప్రక్షాళన:
సీఎం ఆదేశాల మేరకు టీటీడీలో ప్రక్షాళన చేపట్టామని ఈవో అన్నారు. భక్తులకు దర్శనం, వసతి, అన్నప్రసాదాలు, లడ్డూ ప్రసాదంలో సమూల మార్పులు తీసుకొచ్చామన్నారు. తిరుమల అటవీ ప్రాంతంలో 68 శాతం నుండి 80 శాతానికి పచ్చదనాన్ని పెంపొందించేందుకు చర్యలు చేపట్టామన్నారు.
వివిధ రాష్ట్రాల రాజధానుల్లో టీటీడీ ఆలయాల నిర్మాణం
శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో టీటీడీ ఆలయాలు నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
అందులో భాగంగా ఇప్పటికే 8 రాష్ట్రాల్లో ఆలయాల నిర్మాణం జరిగిందన్నారు.
ఇటీవల బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు టీటీడీ మిగిలిన నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాలు, 15 రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసిందని చెప్పారు. వారి ఆమోదం మేరకు ఆయా రాష్ట్రాల రాజధానుల్లో ఆలయాల నిర్మాణం చేపడతామన్నారు.
అన్యమతస్తులపై చర్యలు
టీటీడీ తీసుకున్న విధానపరమైన నిర్ణయం ప్రకారం అన్యమతస్తులపై చర్యలు చేపట్టామన్నారు. ఇప్పటికే టీటీడీలో ఉన్న 29 మంది అన్యమత ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ ఇచ్చేందుకు టీటీడీ బోర్డు ఆమోదం తెలిపిందన్నారు.
వైఖానస ఆగమ సలహా కమిటీ నియామకం
ప్రస్తుత వైఖానస ఆగమ సలహా కమిటీని రద్దు చేసి, ఐదుగురు సభ్యులతో కొత్త కమిటీని టీటీడీ నియమించింది.
నాణ్యంగా ఆహార పదార్థాలు
• భక్తులకు మరింత నాణ్యంగా, రుచికరంగా ఆహార పదార్థాలు అందించేందుకు తిరుమలలోని బిగ్ క్యాంటీన్లు, జనతా క్యాంటీన్లను పేరొందిన సంస్థలకు ఇవ్వాలని నిర్ణయించామని ఈవో తెలిపారు.
• ఆదాయంతో సంబంధం లేకుండా నిర్వాహకుల సామర్థ్యాన్ని బట్టి, పేరొందిన సంస్థలకు కేటాయించడానికి త్వరలోనే టెండర్లను పిలుస్తామన్నారు.
మరింత పారదర్శకంగా సాంకేతిక సేవలు
సాంకేతిక పరిజ్ఞానంతో భక్తులకు మరింత పారదర్శకంగా, సులభతరంగా త్వరితగతిన సేవలు అందించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటలిజన్స్, FMS MONITORING, WHATSAPP GOVERNANCE , గూగుల్ తో ఒప్పందం, ఆధార్ నమోదు, కియోస్క్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నామని ఈవో తెలిపారు.
అభిప్రాయ సేకరణ
భక్తుల నుంచి ఎప్పటికప్పుడు అభిప్రాయాలను సేకరించి మరింత మెరుగైన సేవలు అందించేందుకు వాట్సాప్ ఫీడ్ బ్యాక్ సిస్టమ్ అందుబాటులోకి తీసుకొచ్చామని ఈవో తెలిపారు.
తిరుమలలో వసతి గృహాల ఆధునీకరణ
• తిరుమలలో వసతి గృహాల ఆధునీకరణ, కాలం చెల్లిన వసతి గృహాల పునఃనిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఆహార నాణ్యత పెంచేందుకు క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్
• టీటీడీ భక్తులకు మరింత నాణ్యంగా అన్నప్రసాదాలు అందించేందుకు క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ అందుబాటులోకి తీసుకొస్తున్నాం.
• తిరుమలలో 12వేల చదరపు అడుగుల స్థలంలో ఈ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నాం.
• టీటీడీలో అన్నప్రసాదాల తయారీకి ఉపయోగించే పప్పు దినుసుల నాణ్యత పెంచేందుకు నిపుణుల సహకారం తీసుకుంటున్నాం.
• ఇందుకోసం రిలయన్స్ రీటైల్ సంస్థ ఉచితంగా సేవలు అందించేందుకు ముందుకు రావడంతో ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్నాం.
గోశాలపై ప్రత్యేక దృష్టి
• టీటీడీ గోశాలలో గోసంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టామని ఈవో తెలిపారు.
• గోవులు, లేగ దూడలకు రోజువారీ అందిస్తున్న నాణ్యమైన దాణా, పశుగ్రాసం అందించేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు.
సంబంధిత కథనం
టాపిక్