



Best Web Hosting Provider In India 2024

ఆందోళన, ఆలోచనలతో బాధపడుతున్నారా? మనసుకు శాంతినిచ్చే ఈ 6 యోగాసనాలు మీకోసమే!
యోగా ప్రస్తుత క్షణంపై దృష్టి పెట్టడం ద్వారా, మీ ఆందోళనకరమైన ఆలోచనలను తగ్గించి, స్థిరత్వాన్నిస్తుంది.
ఆధునిక ప్రపంచంలో మనం నిత్యం ఏదో ఒక ఒత్తిడికి లోనవుతూనే ఉంటాం. అది పని ఒత్తిడి కావచ్చు, వ్యక్తిగత సమస్యలు కావచ్చు, లేదా రోజువారీ జీవితంలోజరిగే చిన్న చిన్న సంఘటనలు కావచ్చు. ఇవన్నీ కలిసి మన మనసులో ఆందోళనను, అనవసరపు ఆలోచనలను పెంచుతూ, ప్రశాంతతను దూరం చేస్తాయి. రాత్రిపూట నిద్రపట్టక, పగలంతా ఏ పనీ సరిగా చేయలేక, ఒక తెలియని భారంతో జీవిస్తున్నామని చాలా మంది బాధపడుతున్నారు. మనం ఎంత ప్రయత్నించినా, ఆ ఆలోచనల సుడిగుండంలోంచి బయటపడలేకపోతున్నామనే నిస్సహాయత మనల్ని మరింత కుంగదీస్తుంది.
అయితే, ఈ సమస్యకు యోగాలో ఒక అద్భుతమైన, శాశ్వతమైన పరిష్కారం ఉంది. యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు, ఇది మన మనస్సును, శరీరాన్ని, ఆత్మను కలిపే ఒక గొప్ప సాధనం. కొన్ని సరళమైన ఆసనాలను క్రమం తప్పకుండా సాధన చేయడం ద్వారా మనసును ప్రశాంతంగా, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకొవచ్చు. ఆత్మను ఉత్సాహంగా ఉంచుకోవచ్చు.
HT లైఫ్స్టైల్తో ఇచ్చిన ఇంటర్వ్యూలో, హిమాలయన్ సిద్ధా అక్షర్, యోగా నిపుణుడు, అలాగే అక్షర్ యోగా కేంద్రం వ్యవస్థాపకుడు, యోగా ఆందోళనకరమైన మానసిక స్థితిని ఎలా తగ్గిస్తుందో వివరంగా చెప్పారు.
ఆయన ప్రకారం, “యోగా అనేది శారీరక ఆరోగ్యం, మానసిక స్థిరత్వాన్ని పెంపొందించడానికి ప్రసిద్ధి చెందిన ఒక ప్రాచీన పద్ధతి. ఇది ఒక సమగ్ర శిక్షణ, భావోద్వేగ నియంత్రణ, ఆత్మజ్ఞానం కోసం సాధనాలను అందిస్తుంది. తద్వారా మానసిక సామరస్యాన్ని సాధించడంలో యోగా సహాయపడుతుంది. క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం వల్ల నాడీ వ్యవస్థ శాంతించి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.”
ఆందోళన, అధిక ఆలోచనల నుంచి బయటపడి, మీకు మానసిక శాంతిని, అద్భుతమైన ప్రశాంతతను అందించే ఆ 6 శక్తివంతమైన యోగాసనాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం రండి.
ఆందోళన, ఆలోచనలను తగ్గించే 6 రకాల యోగాసనాలు:
1. వృక్షాసనం (చెట్టు భంగిమ):
ఈ ఆసనం ఏకాగ్రత మరియు స్థిరత్వాన్ని పెంచుతుంది. దీన్ని ఎలా చేయాలంటే
- ముందుగా సమస్థితిలో నిలబడండి
- మీ కుడి పాదాన్ని ఎత్తి, ఎడమ తొడపై ఉంచండి
- తరువాత చేతులను ప్రణామ ముద్రలో పెట్టుకొని, పైకి ఎత్తండి
- ఒక బిందువుపై దృష్టి పెట్టి ముందుకు చూడండి
- 10 సెకన్ల పాటు ఇలాగే ఉండి ఆ తర్వాత యథాస్థితికి రండి.
2. సేతుబంధ సర్వాంగసనం (బ్రిడ్జ్ భంగిమ)
ఇది నాడీ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. దీన్ని ఎలా చేయాలంటే..
- నేలపై వెల్లకిలా పడుకుని, మోకాళ్ళను వంచండి. పాదాలు పిరుదులకు దగ్గరగా, నేలపై ఉండాలి.
- చేతులు శరీరానికి ఇరువైపులా, అరచేతులు నేల వైపు ఉంచండి.
- శ్వాస లోపలికి తీసుకుంటూ, పిరుదులు, నడుము, వీపును నెమ్మదిగా పైకి లేపండి.
- భుజాలు, తల మాత్రమే నేలపై ఉండాలి. తొడలు నేలకు సమాంతరంగా ఉంచడానికి ప్రయత్నించండి.
- మీ చేతులను వీపు కింద కలుపుకోవచ్చు లేదా నేలపై ఉంచవచ్చు.
- కొద్దిసేపు ఆ స్థానంలో ఉండి, నెమ్మదిగా శ్వాసను బయటికి వదులుతూ కిందకు రండి.
- చివరగా, మోకాళ్ళను ఛాతీ వైపు లాగి కౌగిలించుకోండి.
3. శాంత అనులోమ విలోమ (ప్రత్యామ్నాయ నాసికా శ్వాస)
ఇది లోతైన విశ్రాంతిని కలిగిస్తుంది, మానసిక శాంతిని పెంచుతుంది.
- నిటారుగా కూర్చోండి (పద్మాసనంలో లేదా మామూలుగా).
- కుడి బొటనవేలితో కుడి ముక్కును మూయండి.
- ఎడమ ముక్కుతో నెమ్మదిగా ఊపిరి పీల్చుకోండి.
- ఎడమ ముక్కును మూసి, రెండు ముక్కులను కొద్దిసేపు మూసి ఉంచండి.
- కుడి ముక్కును తెరిచి, ఊపిరి వదలండి.
- ఇప్పుడు కుడి ముక్కుతోనే ఊపిరి పీల్చుకోండి.
- కుడి ముక్కును మూసి, రెండు ముక్కులను కొద్దిసేపు మూసి ఉంచండి.
- ఎడమ ముక్కును తెరిచి, ఊపిరి వదలండి.
- ఇలాగే మాటిమాటికీ ముక్కులు మార్చుకుంటూ ఊపిరి పీల్చుకోవడం, వదలడం చేయండి. ఇలా రోజూ 5 నిమిషాలు అభ్యాసం చేయండి.
4. శాంత భస్త్రిక ప్రాణాయామం
ఈ అభ్యాసం ఒత్తిడి, కోపాన్ని తగ్గించడానికి అనువైనది. ఇది శరీరం, మనసును చల్లబరచడానికి సహాయపడుతుంది. దీన్ని ఎలా చేయాలంటే..
- ముందుగా నిటారుగా కూర్చోండి.
- లోతుగా ఊపిరి పీల్చుకోండి, మీ పొట్ట ఉబ్బేలా.
- వేగంగా, శక్తివంతంగా ఊపిరి వదలండి, మీ పొట్ట లోపలికి వెళ్లేలా.
- మళ్ళీ వేగంగా ఊపిరి పీల్చుకోండి (బొగ్గుల కొలిమిలో గాలి నింపినట్టు).
- వేగంగా, శక్తివంతంగా ఊపిరి వదలండి (బొగ్గుల కొలిమి నుండి గాలిని బయటికి నెట్టినట్టు).
- ఇలాగే వేగంగా, లోతుగా శ్వాస తీసుకుంటూ, వదులుతూ ఉండండి.
- కొద్దిసేపు చేసిన తర్వాత, సాధారణ శ్వాసలోకి మారండి.
- ప్రారంభంలో 5-10 రౌండ్లు అభ్యాసం చేయండి, క్రమంగా సమయాన్ని పెంచుకోండి.
5. శీతలీ ప్రాణాయామం (చల్లని శ్వాస పద్ధతి)
ఈ ప్రాణాయామం ఒత్తిడి, ఉద్రిక్తతను తగ్గిస్తుంది, మీ శరీరాన్ని చల్లబరుస్తుంది, విష నిర్మూలనకు మద్దతు ఇస్తుంది.
- నిటారుగా కూర్చోండి.
- మీ నాలుకను పైకి చుట్టి, గొట్టం (పైప్) లాగా చేయండి.
- ఈ గొట్టం లాంటి నాలుక ద్వారా నెమ్మదిగా, లోతుగా గాలి పీల్చుకోండి. చల్లని గాలి లోపలికి వెళ్తున్నట్టు అనిపిస్తుంది.
- శ్వాస పూర్తిగా పీల్చుకున్నాక, నాలుకను లోపలికి లాగి, నోటిని మూసుకోండి.
- ముక్కు ద్వారా నెమ్మదిగా, పూర్తిగా ఊపిరి వదలండి.
- ఇలాగే కొన్ని సార్లు పునరావృతం చేయండి. అంటే 10-15 సార్లు చేయండి.
6. హకిని ముద్ర:
ఈ ముద్ర వేయడంకోసం ముందుగా మీ రెండు చేతుల వేళ్లను ఒకదానికొకటి తాకేలా కలపండి. అంటే, కుడి చేతి బొటనవేలు ఎడమ చేతి బొటనవేలిని, కుడి చూపుడు వేలు ఎడమ చూపుడు వేలిని… ఇలా అన్ని వేళ్లు ఒకదానికొకటి సున్నితంగా తాకేలా ఉంచండి.
వేళ్లను కేవలం చివర్లు మాత్రమే తాకాలి, అరచేతులు దూరంగా ఉండాలి, వాటి మధ్య చిన్న ఖాళీ ఉంటుంది.
మీ చేతులను మీ ఛాతీకి దగ్గరగా, వేళ్లు పైకి చూస్తున్నట్లు పట్టుకోండి.
మీ చూపును మీ కనుబొమ్మల మధ్య (ఆజ్ఞా చక్రం) లేదా మీ నాసికాగ్రంపై కేంద్రీకరించండి.