




Best Web Hosting Provider In India 2024

బదిలీల బాధలు.. కంప్యూటర్లతో కుస్తీ.. వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్యలతో టీచర్లు తికమక!
ఏపీలో టీచర్ల బదిలీల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచీ రోజుకో సమస్య వస్తోంది. వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్యలతో టీచర్లు తికమక అవుతున్నారు. రోజంతా కంప్యూటర్లు, ఇంటర్‌నెట్ సెంటర్లలో ఉపాధ్యాయులు కుస్తీ పడుతున్నారు. ఓటీపీలు రావు.. రేషనలైజేషన్ పాయింట్లూ రావడం లేదంటూ ఆందోళన చెందుతున్నారు.
రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలకు సాఫ్ట్‌వేర్ సమస్యలు తలనొప్పిగా మారాయి. ఈ నెల 21 నుంచి ప్రధానోపాధ్యాయుల బదిలీలతో ప్రక్రియ ప్రారంభించగా.. తొలిరోజు నుంచే విద్యాశాఖ తీసుకొచ్చిన వెబ్‌పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దీంతో ఉపాధ్యాయులు తికమక పడుతున్నారు. కొన్నిచోట్ల గందరగోళానికి గురవతున్నారు. ఇప్పటికే అవే సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
టీచర్ల అవస్థలు..
ఒకవైపు ఇచ్చిన గడువు అయిపోతుండటం.. మరోవైపు వెబ్‌సైట్‌లోని సాంకేతిక సమస్యలను పరిష్కరించకపోవడంతో.. టీచర్లు అవస్థలు పడుతున్నారు. ఇక జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్‌లను సంప్రదించినా.. సమస్యలను తాము పరిష్కరించలేమని, కేంద్ర కార్యాలయానికి కాల్ చేయాలని చెబుతున్నారు. ఉపాధ్యాయ బదిలీలు చేపడతామని విద్యాశాఖ అధికారులు గత రెండు, మూడు నెలల నుంచి చెబుతూ వస్తున్నారు. ఈసారి ఆన్‌లైన్‌లో చేపడతాని కూడా ముందుగానే ప్రకటించారు.
ఇలాంటి సాఫ్ట్‌వేర్ ఏంటి..
టీచర్లు ఆఫ్‌లైన్ కోరినా.. సమయం సరిపోదు, ఏవేవో ఇబ్బందులు అని చెప్పి.. ఎస్‌జీటీలను మినహా మిగిలిన వారికి ఆన్‌లైన్‌లో బదిలీలకు ఒప్పించారు. కానీ వెబ్‌సైట్‌లో డేటా నమోదు, డేటా సేకరణ వంటి పనులు చేయలేదు. అంతేకాకుండా సాంకేతిక సమస్యలు కూడా అధికంగా ఉన్నాయని ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం సాంకేంతికత వేగంగా అభివృద్ది చెందుతున్నా.. ఇలాంటి సాఫ్ట్‌వేర్‌ను వినియోగించడం ఏంటని టీచర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ సమస్యలు..
సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయకుండా ఆన్‌లైన్‌లో బదిలీల ప్రక్రియను ప్రారంభించారు. దీంతో ప్రతి ఉపాధ్యాయుడు అతని పేరు, అడ్రస్ ఇతర వివరాలు అన్ని కూడా మాన్యువల్‌గా నమోదు చేసుకోవాల్సి వస్తోంది. ఉపాధ్యాయుడు వివరాలు నమోదు చేసిన తర్వాత ఓటీపీల కోసం కుస్తీ పట్టాల్సి వస్తోంది. ఎంతసేపు చూసినా సాంకేతిక సమస్యల వల్ల ఓటీపీలు రావడం లేదు.
కంప్యూటర్లతో కుస్తీ..
విడాకులు తీసుకున్న మహిళా ఉపాధ్యాయురాలికి అయిదు స్టేషన్ పాయింట్లు ఇస్తామని అధికారులు చెప్పారు. ఆన్‌లైన్‌లో పాయింట్లు కనిపిస్తున్నా.. అప్లికేషన్ ప్రింట్ తీసుకున్నాక అవి రావడం లేదు. ఇక రేషనలైజేషన్‌కు గురైన ఉపాధ్యాయులకు ఓల్డ్ స్టేషన్ పాయింట్లూ రావడం లేదు. అధికారులు ఈ సమస్యలను పరిష్కరించామని చెప్పినా.. పూర్తి స్థాయిలో అది జరగడం లేదు. దీంతో రోజంతా ఉపాధ్యాయులు ఇంట్లో కంప్యూటర్ల ముందు, ఇంటర్‌నెట్ సెంటర్ల వద్దు సిస్టమ్‌ల ముందు కూర్చుని అవస్థలు పడుతున్నారు.
గడువు పొడిగించాలి..
ఆన్‌లైన్‌లో అనేక సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో.. వివరాల నమోదుకు గడువు పెంచాలని టీచర్లు డిమాండ్ చేస్తున్నారు. సాంకేతిక సమస్యల వల్ల తాము ఇబ్బందులు పడుతున్నామని, అందువల్ల అనేక మంది ఉపాధ్యాయులు వివరాలు నమోదు చేయలేదని సంఘాల నాయకుల చెబుతున్నారు. ఇదే విషయాన్ని శనివారం వర్చువల్ సమావేశంలో పాల్గొన్న పాఠశాల విద్య అడిషనల్ డైరెక్టర్ సుబ్బారెడ్డికి సంఘాల నేతలు వివరించారు. గడువు పెంచే విషయాన్ని కమిషనర్ దృష్టిలో పెడతామని.. ఆయన నిర్ణయం తీసుకుంటారని సుబ్బారెడ్డి చెప్పినట్లు నాయకులు వెల్లడించారు.
సంబంధిత కథనం
టాపిక్