





Best Web Hosting Provider In India 2024

ఉదయం లేవగానే కడుపులో మంటగా అనిపిస్తుందా? ఈ సమస్య రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఉదయం లేవగానే చాలామందికి పొట్టలో మంటగా ఉంటుంది. ఈ సమస్య రావడానికి అనేక కారణాలు ఉండొచ్చు. మీకు కూడా ఇదే సమస్య ఉంటే, ఏయే కారణాల వల్ల మంటగా అనిపిస్తుందో వాటి నివారణ చర్యలేంటో తెలుసుకుందాం రండి.
బిజీ షెడ్యూల్‌లో మనలో చాలా మంది వ్యవహరిస్తోన్న జీవనశైలి ఎన్నో ప్రమాదాలకు దారి తీస్తుంది. అనేక అనారోగ్య సమస్యలు కలిగిస్తుంది. గంటల తరబడి కూర్చొని ఆఫీస్‌లో పని చేస్తుండటం, సమయానికి భోజనం చేయకపోవడం, బయట అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, రోజూ వేపుడు పదార్థాలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియపై దుష్ప్రభావం కనిపిస్తుంది. దీని ఫలితంగా ఉదయం లేవగానే పొట్టలో మంట అనుభవిస్తున్నారని ఫిర్యాదు వినిపిస్తూనే ఉంది.
నిజానికి, కడుపులో నొప్పి, మంటకు అనేక కారణాలు ఉండవచ్చు. ఉదయం సమయంలో కలిగే కడుపులో మంటకు కారణాలు, వాటి నివారణ చర్యలు తెలుసుకుందాం రండి.
1) రాత్రిపూట ఆలస్యంగా భోజనం
రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయడం, ఎక్కువ విరామం లేకుండా వెంటనే నిద్రపోవడం వల్ల ఉదయం పొట్టలో మంట రావచ్చు. ఇది ఆమ్ల ప్రవాహం (యాసిడ్ రిఫ్లక్స్) వల్ల సంభవించవచ్చు. నిజానికి, రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేస్తే ఆమ్ల ఉత్పత్తి పెరుగుతుంది. పొట్ట దిగువ భాగంలో కలిగే ఫ్లోకు అంతరాయం ఏర్పడుతుంది. దీనివల్ల ఛాతీలో మంట లేదా పొట్టలో మంటగా అనిపించవచ్చు.
2) జీర్ణక్రియ సమస్య
కొందరు ఆహారాన్ని చాలా వేగంగా తింటుంటారు. అలాంటి వారితో పాటు అధికంగా ఆహారం తినే వారికి పసుపు, మసాలా పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యలు ఏర్పడి మంటగా అనిపించవచ్చు.
3) ఫుడ్ అలెర్జీ
పాల ఉత్పత్తులు, మద్యం లేదా కాఫీ వంటి కొన్ని ఆహార పదార్థాల వల్ల కొంతమందిలో జీర్ణక్రియ సమస్యలు ఏర్పడవచ్చు. క్రమంగా ఇవి కడుపులో మంటకు దారి తీయవచ్చు.
4) ఒత్తిడి, ఆందోళన
చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, కడుపులో మంట రావడానికి ఆలోచనా తీరు కూడా ప్రభావం చూపిస్తుంది. ఒత్తిడి కలిగే సమయంలో కడుపులో ఆమ్ల ఉత్పత్తి పెరుగుతుంది. దీనివల్ల మంట, ఇతర జీర్ణక్రియ సమస్యలు రావచ్చు.
5) పొట్టలో ఇన్ఫెక్షన్
పొట్టలో బ్యాక్టీరియా సంక్రమణ వల్ల మంట, నొప్పి వంటి లక్షణాలు కనిపించవచ్చు. అయితే, ఈ బ్యాక్టీరియా వ్యాప్తి కారణంగా పొట్ట ఉబ్బరం, దగ్గు, వికారం, ఆకలి లేకపోవడం వంటి ఇతర లక్షణాలు కూడా కనిపించవచ్చు. ఇంకొందరిలో ఇన్ఫెక్షన్ కారణంగా బరువు కూడా తగ్గిపోతుంటారు.
కడుపులో మంట కలిగే సమస్య నుండి ఎలా బయటపడాలి?
జీవనశైలిలో కొన్ని మార్పులు చేయడం ద్వారా కడుపులో తరచుగా సమస్యలు రాకుండా నివారించవచ్చు. హాని కలిగించే ఆహార పదార్థాలను నివారించడం ద్వారా ఈ సమస్యను ఎదుర్కోవచ్చు. అదనంగా, ఈ సమస్యను కొన్ని అలవాట్లను మార్చుకోండి.
ధూమపానం మానేయండి: పొగతాగడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్ సమస్య పెరుగుతుంది.
ఒత్తిడి, ఆందోళనను తగ్గించుకోండి: యోగా, మెడిటేషన్ లేదా నడక వంటివి చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.
ఆరోగ్యకరమైన బరువును మెయింటెయిన్ చేయండి: అధిక బరువు పొట్టపై ఒత్తిడి పెంచి యాసిడ్ రిఫ్లక్స్‌కు కారణం కావచ్చు.
తక్కువ మొత్తంలో ఆహారం తీసుకోండి: ఒకేసారి ఎక్కువ తినకుండా, రోజులో కొన్నిసార్లు కొద్దికొద్దిగా తినండి.
రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయవద్దు: పడుకోవడానికి కనీసం 2-3 గంటల ముందు భోజనం పూర్తి చేయండి.
మద్యం సేవనాన్ని తగ్గించండి: ఆల్కహాల్ యాసిడ్ రిఫ్లక్స్ ను పెంచుతుంది.
ఈ జాగ్రత్తలు పాటిస్తే ఉదయం కడుపులో మంట సమస్య నుండి బయటపడి, మీ రోజును హాయిగా ప్రారంభించవచ్చు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాలయను క్రోడీకరించి మాత్రమే ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.