ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో ఏం నేర్చుకోవచ్చు? ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి?

Best Web Hosting Provider In India 2024

ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో ఏం నేర్చుకోవచ్చు? ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి?

Ramya Sri Marka HT Telugu

మీకు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఆసక్తి ఉండి, ఎక్కడ మొదలుపెట్టాలో తెలియదా? ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో ఏం నేర్పిస్తారు, ఎలాంటి ఉద్యోగాలు వస్తాయో తెలుసుకోవాలని ఉందా? అయితే ఇది మీ కోసమే. ఫ్యాషన్ రంగంలో ఉన్న ముఖ్యమైన విషయాలు, నైపుణ్యాలు, అవకాశాల గురించి వివరంగా తెలుసుకుందాం రండి.

ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు వివరాలు

ఫ్యాషన్ అంటే ఇష్టపడే వాళ్లకి, కొత్తగా ఏదైనా చేయాలని అనుకునే వాళ్లకి ఫ్యాషన్ డిజైనింగ్ ఒక మంచి ఎంపిక. ఈ కోర్సు నేర్చుకుంటే మంచి సంపాదనతో పాటు, నచ్చిన రంగంలో పని చేసే అవకాశం కూడా దొరుకుతుంది. అంతేకాదు ఫ్యాషన్ రంగం ఎప్పుడూ డిమాండ్‌లోనే ఉంటుంది.

మీరు ఫ్యాషన్‌పై ఆసక్తి ఉండి, మీ సృజనాత్మకతకు మెరుగులు దిద్దుకోవాలనుకుంటే ఈ రంగం చాలా బాగుంటుంది. మంచి డబ్బు సంపాదించే ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే, ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకోవచ్చు. మీ ఆసక్తి, ఏం సాధించాలనుకుంటున్నారు, మీకున్న నైపుణ్యాలను బట్టి సరైన కోర్సును ఎంచుకొని ఈ రంగంలో ముందుకు సాగవచ్చు.

ఫ్యాషన్ డిజైనింగ్ అంటే బట్టలు, ఆభరణాలు, చెప్పులు వంటివాటిని అందంగా, కొత్తగా తయారు చేయడం. దీనికి సృజనాత్మకత, కళాత్మకత, సాంకేతిక పరిజ్ఞానం అవసరం. ఈ కోర్సు ఇవన్నీ నేర్పిస్తుంది. ఫ్యాషన్ ఎప్పుడూ మారుతూ ఉంటుంది, కొత్త ట్రెండ్స్ వస్తూ ఉంటాయి.

ఫ్యాషన్ డిజైనర్లు ఎప్పుడూ కొత్త ట్రెండ్స్ ను గమనిస్తూ, వాటికి తగ్గట్టుగా డిజైన్లు చేయాలి. ప్రజలకు సౌకర్యంగా, అందంగా ఉండేలా డిజైనర్లు తమ ఆలోచనలను బట్టలపై పెడతారు.

ఎలాంటి కోర్సులు ఉంటాయి?

ఫ్యాషన్ డిజైనింగ్‌లో చాలా రకాల కోర్సులు ఉన్నాయి. అవేంటంటే..

బి.డి.ఎస్ లేదా బి.ఎస్‌.సి (B.Sc. in Fashion Design):

ఇది డిగ్రీ కోర్సు. ఇందులో డ్రెస్ డిజైనింగ్ తో పాటు, ఫ్యాషన్ డిజైన్‌కు సంబంధించిన అన్ని ప్రాథమిక విషయాలు నేర్పిస్తారు. ఇది సాధారణంగా మూడు సంవత్సరాల కోర్సు. చాలా కాలేజీల్లో ఇప్పుడు ఈ కోర్సు ఉంటుంది.

ఎం.డి.ఎస్ లేదా ఎం.ఎస్‌.సి (M.Sc. in Fashion Design):

ఇది పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సు. ఫ్యాషన్‌లో మరింత లోతైన నైపుణ్యాలను, వ్యాపార మెళకువలను నేర్చుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.

ఫ్యాషన్ డిజైనింగ్‌లో డిప్లొమా:

ఇది తక్కువ సమయంలో ఫ్యాషన్ డిజైనింగ్ గురించి ప్రాథమిక విషయాలు నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది ఎక్కువగా ప్రాక్టికల్స్, బేసిక్ కాన్సెప్ట్‌లపై దృష్టి పెడుతుంది.

ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు ఫీజు
ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు ఫీజు

ఫీజు ఎంత ఉంటుంది?

మూడు సంవత్సరాల డిగ్రీ కోర్సుకు సుమారు 1.5 లక్షల నుండి 2 లక్షల రూపాయల వరకు ఫీజు ఉండవచ్చు. హైదరాబాదులోని కాలేజీల్లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సుకు సంవత్సరానికి 50 వేల రూపాయలకు పైగా ఫీజు ఉంది. కాలేజీని బట్టి దీంట్లో హెచ్చు తగ్గులుంటాయి.

ఎలాంటి డిజైనర్లు ఉండొచ్చు?

వస్త్ర డిజైనర్లు: చొక్కాలు, సూట్లు, ప్యాంటులు, స్కర్టులు వంటి దుస్తులు డిజైన్ చేస్తారు.

ఆభరణాల డిజైనర్లు: బూట్లు, హ్యాండ్ బ్యాగులు, నగలు వంటి వాటిని డిజైన్ చేస్తారు.

చెప్పుల డిజైనర్లు: రకరకాల చెప్పులను డిజైన్ చేస్తారు.

కాస్ట్యూమ్ డిజైనర్లు: సినిమాలు, థియేటర్లలో నటీనటులు వేసుకునే బట్టలను డిజైన్ చేస్తారు.

ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి?

ఫ్యాషన్ డిజైనింగ్
ఫ్యాషన్ డిజైనింగ్

1. ఫ్యాషన్ హౌస్‌లు లేదా బట్టల కంపెనీలు:

పెద్ద పెద్ద బ్రాండెడ్ కంపెనీలలో మంచి జీతంతో ఉద్యోగాలు దొరుకుతాయి. మీ నైపుణ్యాలను ఉపయోగించి ఆ బ్రాండ్స్ కోసం డిజైన్లు చేయవచ్చు. మీ సృజనాత్మకత, నైపుణ్యం, అనుభవం ఆధారంగా మీకు మంచి జీతం ఉంటుంది.

2. షాపులు, దుకాణాలు:

దుకాణాలకు అవసరమైన బట్టలను డిజైన్ చేయడం లేదా కస్టమైజ్ చేసి ఇవ్వచ్చు. స్థానిక స్థాయిలో పనిచేసి కూడా సంపాదించవచ్చు.

3. ఉత్పత్తి సంస్థలు:

బట్టలు, ఆభరణాలు ఎలా తయారు చేయాలో పర్యవేక్షిస్తారు. సలహాలు ఇస్తారు.

4. డిజైన్ కంపెనీలు:

ప్రత్యేక డిజైన్లను తయారు చేయడానికి ఇతర డిజైనర్లు, కస్టమర్లతో కలిసి పని చేస్తారు.

5. సినిమా, టీవీ పరిశ్రమ:

సినిమాలు, టీవీ షోల కోసం దుస్తులు, మేకప్, హెయిర్ స్టైలింగ్ వంటివి చేస్తారు. కొంతమంది సినిమా తారలు వ్యక్తిగతంగా ఫ్యాషన్ డిజైనర్లను నియమించుకుంటారు.

6. స్వయం ఉపాధి:

సొంతంగా డిజైనింగ్ వ్యాపారం పెట్టుకొని కూడా డబ్బు సంపాదించుకోవచ్చు. ఈ రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవచ్చు.

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024