





Best Web Hosting Provider In India 2024

అది దుస్సాహసమే.. పవన్ ప్రశ్నలు కరెక్టే.. వారితో నాకు సంబంధం లేదు: అల్లు అరవింద్ కామెంట్లు
థియేటర్ల బంద్ వివాదంలో తనపై వచ్చిన రూమర్లకు స్పందించారు నిర్మాత అల్లు అరవింద్. తనకు ఏ మాత్రం సంబంధం లేదని తేల్చిచెప్పారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు.
థియేటర్ల బంద్ విషయం టాలీవుడ్‍లో పెద్ద రచ్చగా మారింది. థియేటర్ల మూసివేత ఉండదని ఖరారైనా.. అసలు ముందుగా ఆ నిర్ణయం ఎలా తీసుకున్నారనేది వివాదమైంది. ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా హరి హర వీరమల్లు చిత్రం జూన్ 12న విడుదల కానుండగా.. జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తామని కొందరు ఎగ్జిబిటర్లు ఇటీవల ప్రకటించారు. అయితే, బంద్ ఉండదని తాజాగా మరో సమావేశం తర్వాత ప్రకటన వచ్చింది. అయితే, ముందుగా వెలువడిన బంద్ నిర్ణయం వెనుక కొందరి కుట్ర ఉందంటూ ఆరోపణలు వచ్చాయి. పవన్ కల్యాణ్ కూడా సీరియస్ అయ్యారు. ఈ వివాదంపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నేడు (మే 25) స్పందించారు.
అది ఏకపక్ష నిర్ణయం
థియేటర్లు మూసివేయాలని కొందరు తీసుకున్న నిర్ణయానికి తనకు సంబంధం లేదని అల్లు అరవింద్ నేడు మీడియా సమావేశంలో వెల్లడించారు. అది కొందరు తీసుకున్న ఏకపక్ష నిర్ణయమని, అందుకే చిరాకు వేసి తాను అసలు సమావేశాలకే వెళ్లలేదని తెలిపారు.
దుస్సాహసం
పవన్ కల్యాణ్ సినిమా రిలీజ్‍కు కానుండగా.. థియేటర్లు మూస్తామనడం దుస్సాహసమని అల్లు అరవింద్ అన్నారు. అలాంటి దుస్సాహసానికి ఎవరూ ముందడుగు వేయకూడదని చెప్పారు. సినీ ఇండస్ట్రీ నుంచి వెళ్లి మనకు పవన్ కల్యాణ్ సాయం చేస్తున్నారని ఆయన తెలిపారు.
పవన్ ప్రశ్నలు సరైనవే
థియేటర్ల బంద్ వివాదం తర్వాత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువడింది. ఇప్పటి వరకు తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఎవరైనా మర్యాదపూర్వకంగా కలిశారా అని అందులో ప్రశ్నలు ఉన్నాయి. దీనిపై అల్లు అరవింద్ స్పందించారు. పవన్ కల్యాణ్ పేషి వేసిన ప్రశ్నలు సరైనవే అని చెప్పారు. “మాది ప్రైవేట్ వ్యాపారం ముఖ్యమంత్రిని ఎందుకు కలవాలని ఓ నిర్మాత నాతో అన్నారు. కానీ అది కరెక్ట్ కాదు. ప్రభుత్వ సహకారం కావాల్సిందే. పవన్ మంత్రిత్వశాఖ నుంచి వచ్చిన లేఖలో ప్రశ్నలు కరెక్టుగా ఉన్నాయి” అని అల్లు అరవింద్ అన్నారు. కల్కి చిత్రానికి టికెట్ల ధరను పెంచాలని అడిగేందుకు వెళ్లినప్పుడు ఏపీ ముఖ్యమంత్రిని కలవాలని పవన్ సూచించారని, కానీ ఎవరూ ఎందుకు పట్టించుకోలేదో తెలియదని చెప్పారు.
వారిలో నేను లేను
టాలీవుడ్‍లో నలుగురు బడా నిర్మాతలు ఒకటిగా ఉంటున్నారని, థియేటర్లను తమ గుప్పిట్లోకి తీసుకున్నారనే వాదనలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. తాజా వివాదం వెనుక ఆ నలుగురు ఉన్నారంటూ రూమర్లు వచ్చాయి. అల్లు అరవింద్ కూడా ఉన్నారంటూ రూమర్లు వచ్చాయి. దీనికి ఆయన స్పందించారు. ఆ నలుగురిలో తాను లేనని, వారి వ్యాపారంతో తనకు సంబంధం లేదని స్పష్టంగా చెప్పేశారు. “ఆ నలుగురిలో నేను లేను. ఆ నలుగురు అనేది పదిహేనేళ్ల క్రితం మొదలైంది. ఆ నలుగురి వ్యాపారంలో నేను బయటికి వచ్చాను” అని అల్లు అరవింద్ చెప్పారు.
తెలంగాణలో తనకు ఒక్క థియేటర్ కూడా లీజులో లేదని, ఏఏఏ థియేటర్లకు ఓనర్‌గా ఉన్నానని అల్లు అరవింద్ చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 1,500 థియేటర్లు ఉండగా.. అందులో 15 మాత్రమే తమవి అని అన్నారు. ఏపీలో లీజులో ఉన్న 15 థియేటర్ల గడువు ముగిశాక కొనసాగించబోనని తెలిపారు.
సంబంధిత కథనం