దశాబ్దాల తర్వాత కాశ్మీరీ శరణార్ధులకు న్యాయం

 

న్యూఢిల్లీ : దశాబ్దాల అనంతరం కాశ్మీరీ వలసదారులకు ఎట్టకేలకు  న్యాయం జరిగింది. కాశ్మీర్‌ చరిత్రలో అత్యంత దుర్మార్గుడైన పాలకుడి చేతిలో కనీవినీ ఎరుగని మారణకాండను ఎదుర్కొని, అరాచకాలు, అకృత్యాలు, నిర్బంధాలపాలై సర్వసం కోల్పోయి జన్మభూమి నుంచి వలస వచ్చిన కాశ్మీరీ శరణార్ధుల జీవితాలకు భరోసా కల్పిస్తూ రాజ్యసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన జమ్మూ, కాశ్మీర్‌ రిజర్వేషన్‌ బిల్లు, జమ్మూ, కాశ్మీర్‌ పునఃవ్యవస్థీరణ బిల్లుల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ వైయ‌స్ఆర్‌సీపీ సభ్యులు  విజయసాయి రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. తరతరాలుగా వారికి జరిగిన అన్యాయాలను ఈ బిల్లుల ద్వారా సరిదిద్దగల అవకాశం ఉందని ఆయన అన్నారు.
1389-1413 మధ్య కాలంలో కాశ్మీర్‌ను పర్షియన్‌ రాజు సుల్తాన్‌ సికిందర్‌ పాలనలో తొలిసారిగా హిందువులు పెద్ద ఎత్తున వలస పోయారు. హిందువుల పట్ల సికిందర్‌ సాగించిన దుర్మార్గాలు, దారుణాలు మాటలకు అందవు. అణచివేత, అకృత్యాలకు భయపడి జన్మభూమి నుంచి పారిపోయే క్రమంలో లక్ష మంది హిందువులు దాల్‌ సరస్సులో మునిగి దుర్మరణం పాలయ్యారు. నిస్సహాయులైన మహిళలు మానభంగాలకు గురయ్యారు. హిందువులు మత మార్పిడికి అంగీకరించాలి లేదా దేశం విడిచి పారిపోవాలని హుకుం జారీ చేశారు. పారిపోలేని వారిని అక్కడికక్కడే హతమార్చారని శ్రీ విజయసాయి రెడ్డి వివరించారు. సికిందర్‌ సైనికులు దేవాలయాలు, హిందువుల పవిత్ర స్థలాలను సర్వనాశనం చేశారు. కిరాతకానికి లక్షలాది మంది బలైపోగా కేవలం 10 కాశ్మీరీ కుటుంబాలు మాత్రమే కాశ్మీర్‌ లోయ నుంచి ప్రాణాలతో బయటపడి వలస పోయారు. తదనంతరం ఆరుసార్లు అణచివేతను తట్టుకోలేక కాశ్మీరి కుటుంబాలు వలస పోయాయి. వలసపోయిన కాశ్మీరి హిందూ కుటుంబాలకు చెందిన భూములు పాలకుల అండదండలతో అన్యులపాలయ్యాయి. జమ్మూ, కాశ్మీర్‌ను పాకిస్తాన్‌లో విలీనం చేసే లక్ష్యంతో మొదలైన ఉగ్రవాదం రాజకీయ హింసకు అంకురార్పణ చేసిందని శ్రీ విజయసాయి రెడ్డి తన ప్రసంగంలో పేర్కొన్నారు.
కాంగ్రెస్‌ చారిత్రక తప్పిదాలు…
పాక్‌ అక్రమిత కాశ్మీర్‌ భారత్‌ చేజారిపోవడానికి కాంగ్రెస్‌ అయిదు చారిత్రక తప్పులు చేసిందని శ్రీ విజయసాయి రెడ్డి అన్నారు. నెహ్రూ అవలంభించిన బూటకపు సెక్యులరిజమ్‌ కారణంగానే కాశ్మీర్‌ సమస్య అనేక దశాబ్దాలపాటు రావణకాష్టంలా రగులుతూ వచ్చింది. 50 ఏళ్ళ పాలనలో జమ్మూ, కాశ్మీర్‌కు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు వచ్చిన అవకాశాలన్నింటినీ కాంగ్రెస్‌ పార్టీ జార విడిచింది. 1947 జూలైలో కాశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేస్తానని అప్పటి కాశ్మీర్‌ అధిపతి మహరాజా హరి సింగ్‌ చేసిన ప్రతిపాదనను ఆమోదించకుండా నెహ్రూ తటపటాయించారు. నెహ్రూ ఉదాశీనతను ఆసరాగా చేసుకుని తదనంతరం పాకిస్తాన్‌ కాశ్మీర్‌పై దాడికి తెగబడింది. ఇది కాంగ్రెస్‌ చేసిన మొట్టమొదటి చారిత్రక తప్పిదం. భారత సైన్యం శ్రీనగర్‌ను స్వాధీనం చేసుకుని పాకిస్తాన్‌ సైన్యాన్ని కాశ్మీర్‌లోని ఇతర భూభాగం నుంచి తిప్పికొడుతున్న తరుణంలో నెహ్రూ భారత సైన్యం ముందుకు పోకుండా నిలవరించారు. ఎవరిని రక్షించేందుకు, ఎవరి మెప్పు పొందేందుకు ఆయన ఆ పని చేశారో తెలియదని శ్రీ విజయసాయి రెడ్డి అన్నారు.
కాశ్మీర్‌ సమస్యను ఐక్యరాజ్య సమితికి తీసుకువెళ్ళడం నెహ్రూ చేసిన రెండవ తప్పిదం. ఈ తప్పిదమే 1949లో రాజ్యాంగంలో ఆర్టికల్‌ 370 ప్రవేశపెట్టడానికి కారణం అయింది. ఆర్టికల్‌ 370 కారణంగా జమ్మూ, కాశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేసే ప్రక్రియకు తీవ్ర అవరోధంగా నిలిచింది. ఇక 1965లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ను భారత్‌ స్వాధీనం చేసుకునేందుకు మరో అవకాశం చిక్కింది. ఆ యుద్ధంలో భారత సైన్యం లాహోర్‌ వరకు చొచ్చుకుపోగలిగినా పీవోకేను మాత్రం తిరిగి పొందలేక పోయింది. అలాగే 1971 బంగ్లాదేశ్‌ విమోచన యుద్ధం అనంతరం కూడా పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ను స్వాధీనం చేసుకోవడానికి పాకిస్తాన్‌తో సంప్రదింపులు జరిపే అవకాశం దొరికింది. సిమ్లా ఒప్పందంలో ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టడానికి పాకిస్తాన్‌ సిద్ధం అయినప్పటికీ అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం దానిని సద్వినియోగం చేసుకోలేకపోయింది. చేతికి అందిన పీవోకేను కాంగ్రెస్‌ పార్టీ బంగారు పళ్ళెంలో పెట్టి పాకిస్తాన్‌కు అప్పగించిందని శ్రీ విజయసాయి రెడ్డి విమర్శించారు.
జమ్మూ, కాశ్మీర్‌ విషయంలో గత కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన చారిత్రక తప్పిదాలను ఇప్పటి బిజెపి ప్రభుత్వం సరిదిద్దే ప్రయత్నం చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని ఆయన అనారు. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీ అనుసరించిన రెండు విధానాలు, ఇద్దరు ప్రధానులు, రెండు గుర్తులకు బదులుగా ఒకే విధానం, ఒకే ప్రధాని, ఒకే గుర్తు విధానం అమలులోకి వచ్చిందని అన్నారు. ఆర్టికల్‌ 370 రద్దుతో జమ్మూ, కాశ్మీర్‌లో గడచిన నాలుగేళ్ళలో గణనీయమైన మార్పులు సంభవించాయి. ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయి. శాంతి భద్రతలు మెరుగుపడ్డాయి. జిల్లా అభివృద్ధి మండళ్ళ ద్వారా అధికార వికేంద్రీకరణ జరిగింది. ప్రధానమంత్రి అభివృద్ధి ప్యాకేజి కింద కొత్త ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుట్టారు. టూరిజం, పెట్టుబడులు, వ్యవసాయం, పునరుత్పాదక ఇంధనంపై పెట్టిన దృష్టి వలన ఆర్థిక రంగం శక్తి పుంజుకుంటోందని శ్రీ విజయసాయి రెడ్డి అన్నారు.
ఈ సందర్భంగా శ్రీ విజయసాయి రెడ్డి ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు. పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ (పీవోకే) ప్రాంతానికి కేటాయించిన 24 స్థానాలకు ఎన్నికలు జరిగే అవకాశం లేదు. అందువలన పీవోకే పాలన చేతికి వచ్చే వరకు దానికి కేటాయించిన 24 అసెంబ్లీ స్థానాలను నామినేషన్‌ ప్రాతిపదికపై భర్తీ చేయాలని సూచించారు. అలాగే కాశ్మీర్‌ నుంచి వలస వచ్చిన కాశ్మీరీ పండిట్ల కుటుంబాలకు నెలకు ప్రస్తుతం ఇస్తున్న 13 వేల రూపాయల భత్యాన్ని 20 వేల రూపాయలకు పెంచాల్సిందిగా శ్రీ విజయసాయి రెడ్డి హోం మంత్రికి విజ్ఞప్తి చేశారు.

ఏపీలో 6865 కోట్లతో స్మార్ట్ సిటీ పనులు: రాజ్యసభలో ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు

స్మార్ట్ సిటీ మిషన్ కింద ఆంధ్రప్రదేశ్‌లో ఎంపికైన తిరుపతి, విశాఖపట్నం, కాకినాడ, అమరావతి నగరాల్లో 6865 కోట్ల రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేపట్టినట్లు కేంద్ర  గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి   కౌశల్ కిషోర్ వెల్లడించారు. రాజ్యసభలో సోమవారం వైయ‌స్ఆర్‌సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ రాష్ట్రంలో ఎంపికైన నాలుగు నగరాల్లో మొత్తం 283 అభివృద్ధి ప్రాజెక్టులు కేటాయించగా 4742.43 కోట్ల వ్యయంతో చేపట్టిన 224 పనులు ఇప్పటికే పూర్తి చేసినట్లు తెలిపారు. అలాగే 2122.98కోట్లతో చేపట్టిన మిగిలిన 52 ప్రాజక్టు పనులు వివిధ దశలో పురోగతిలో  ఉన్నాయని తెలిపారు.
మొత్తం ప్రాజెక్టులకు ఇప్పటికి 3538 కోట్లు నిధులు విడుదల  చేయగా 2951 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి వివరించారు. స్మార్ట్ సిటీ మిషన్ కింద తిరుపతిలో 1999.94 కోట్లతో 109 ప్రాజెక్టులు చేపట్టగా 1,532.41 కోట్లతో చేపట్టిన 80 ప్రాజెక్టులు పూర్తి చేసినట్లు తెలిపారు. అలాగే 467.53 కోట్లతో చేపట్టిన మిగిలిన 29 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. అభివృద్ధి పనుల కోసం 578 కోట్లు విడుదల చేయగా 550.48 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. అలాగే కాకినాడలో 1,910.24 కోట్లతో చేపట్టిన 94 ప్రాజెక్టుల్లో 1,674.04 కోట్లతో 76 ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తి చేసినట్లు తెలిపారు. అలాగే 236.20 కోట్లతో చేపట్టిన మిగిలిన 18 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని అన్నారు. మొత్తం ప్రాజెక్టులకు 978కోట్లు విడుదల చేయగా 783.57 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. విశాఖపట్నంలో 2,025.23 కోట్లతో చేపట్టిన మొత్తం 61 ప్రాజెక్టులకు 908.84 కోట్లతో 56 ప్రాజెక్టులు పూర్తికాగా 1,116.39 కోట్లతో చేపట్టిన మిగిలిన 5 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని అన్నారు. అభివృద్ధి పనులు కోసం  966 కోట్లు విడుదల చేయగా 838.47 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. అమరావతిలో 930 కోట్లతో చేపట్టిన 19 ప్రాజెక్టులకు 627.14 కోట్లతో 12 ప్రాజెక్టులు పూర్తి చేయగా  302.86 కోట్లతో చేపట్టిన మిగిలిన 7 ప్రాజెక్టులు వేర్వేరు దశల్లో ఉన్నాయని తెలిపారు. అభివృద్ధి పనుల కోసం 1,016కోట్లు విడుదల చేయగా 779.29 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ మిషన్‌ను 2015 జూన్ 25న ప్రారంభించి ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు ప్రధాన నగరాలతోసహా దేశంలో 100 నగరాలను ఎంపిక చేసిందని  మంత్రి తెలిపారు. 2016 జనవరి నుంచి 2018 జూన్ వరకు 4 రౌండ్లలో పోటీ అనంతరం 100 నగరాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. 2023 నవంబర్ 27 నాటికి 1,71,224 కోట్లతో 7959 ప్రాజెక్టులకు సంబంధించి వర్క్ ఆర్డర్లు ఇవ్వగా  1,16,269 కోట్ల వ్యయంతో చేపట్టిన 6271 ప్రాజెక్టులు పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ మేరకు విడుదల చేసిన 78,749.88 కోట్లకుగాను 71,135.70 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *