





Best Web Hosting Provider In India 2024

హెచ్ఏఎల్ ఏపీకి తరలింపు ప్రచారం, సీఎం చంద్రబాబు అలా మాట్లాడితే తప్పే – కర్ణాటక మంత్రి పాటిల్
కర్ణాటక నుంచి హెచ్ఏఎల్ ను ఏపీకి తరలించాలని సీఎం చంద్రబాబు…కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ అడిగారని మీడియాలో కథనాలు వచ్చాయి. వీటిపై కర్ణాటక మంత్రి ఎంబీ పాటిల్ స్పందించారు. ఏపీ సీఎం చంద్రబాబు..అలా మాట్లాడే వ్యక్తి కాదని, కానీ ఆయన ఉద్దేశం అదే అయితే తప్పేనన్నారు. రక్షణ రంగంలో కర్ణాటక ఎంతో కీలకం అన్నారు.
హెచ్ఏఎల్ అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్, లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎల్‌సీఏ) ఉత్పత్తిని కర్ణాటక నుంచి ఏపీకి తరలించాలని సీఎం చంద్రబాబు ఒత్తిడి చేస్తున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలపై కర్ణాటక మంత్రి ఎంబీ పాటిల్ సోమవారం ఆందోళన వ్యక్తం చేశారు.
ఇది ఆందోళనకరం అని అభివర్ణించారు. భారతదేశ అంతరిక్ష, రక్షణ రంగానికి రాష్ట్రం చేసిన సహకారాన్ని హైలైట్ చేస్తూ కర్ణాటకకు రక్షణ పారిశ్రామిక కారిడార్ మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ విషయంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలవాలనున్నట్లు మంత్రి పాటిల్ తెలిపారు.
హెచ్ఏఎల్ తరలించాలని అడిగితే తప్పే
“నేను దీని గురించి ప్రిన్సిపల్ సెక్రటరీతో, ముఖ్యమంత్రితో చర్చిస్తాను. నేను మన రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రితో కూడా మాట్లాడుతాను. ఒకవేళ చంద్రబాబు నాయుడు అలాంటి ప్రకటన చేసి ఉంటే, అది తప్పు అవుతుంది.
ఆయన తన రాష్ట్రంలో ఒక యూనిట్‌ను ఏర్పాటు చేయమని హెచ్‌ఏఎల్‌ను అడగవచ్చు, కానీ కర్ణాటకలో ఉన్న వాటిని మార్చమని అడుగుతున్నారని కొన్ని మీడియా నివేదికలు వస్తున్నాయి. అది తగదు” అని ఆయన అన్నారు.
చంద్రబాబు అలా మాట్లాడే వ్యక్తి కాదు
“HAL విస్తరణ సమయంలో ఏపీని పరిగణించమని అడగవచ్చు, అది సహజం. కానీ మీడియాలో వచ్చినట్లు కర్ణాటకలో ఉన్న వాటిని మార్చమని వారు అడిగి ఉంటే, ఆ నివేదికలు నిజమైతే, అది ఆందోళన కలిగించే విషయం. నాకు తెలిసినంతవరకు చంద్రబాబు వ్యవస్థను అర్థం చేసుకున్న వ్యక్తి, అలా మాట్లాడే వ్యక్తి కాదు, కానీ ఆయన అలా చెప్పి ఉంటే అది తప్పు.” అని పాటిల్ అన్నారు.
రాజ్ నాథ్ తో సీఎం చంద్రబాబు భేటీ
పీటీఐ నివేదిక ప్రకారం సీఎం చంద్రబాబు ఇటీవల రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో జరిగిన సమావేశంలో హెచ్ఏఎల్ ను ఏపీకి తరలించాలనే ప్రతిపాదన చేశారు. బెంగళూరు విమానాశ్రయం నుంచి దాదాపు గంట దూరంలో ఉన్న లేపాక్షి-మడకశిర హబ్‌లో హెచ్ఏఎల్ ఏఎంసీఏ ఉత్పత్తి సౌకర్యం కోసం 10,000 ఎకరాల భూమిని ప్రతిపాదించినట్లు సమాచారం.
రక్షణ రంగంలోకి 65 శాతం వాటా
కర్ణాటకకు రక్షణ పారిశ్రామిక కారిడార్ కోసం రాజ్‌నాథ్ సింగ్‌కు చేసిన అభ్యర్థనను గుర్తుచేస్తూ, 2022-23లో ఉత్తరప్రదేశ్, తమిళనాడు రక్షణ కారిడార్‌లను పొందాయని, కర్ణాటక భారతదేశ ఏరోస్పేస్, రక్షణ రంగానికి 65 శాతం వాటా కలిగి ఉన్నందున…రక్షణ పారిశ్రామిక కారిడార్ కు అర్హమైనదని మంత్రి పాటిల్ అన్నారు.
కర్ణాటకకు రక్షణ కారిడార్ ఇవ్వాలి
ఉత్తరప్రదేశ్, తమిళనాడుకు రక్షణ కారిడార్లు ఇస్తున్నప్పటికీ… అర్హత ఆధారంగా కర్ణాటకకు కూడా రక్షణ కారిడార్ కేటాయించాలని కోరారు. కర్ణాటకకు రక్షణ కారిడార్ కోసం తాను రక్షణ మంత్రిని అభ్యర్థించానని మంత్రి పాటిల్ అన్నారు.
కేంద్రం, రాష్ట్రంలో వేర్వేరు ప్రభుత్వాలు ఉన్నప్పటికీ, కర్ణాటక భారతదేశంలో అంతర్భాగం, దేశ ప్రయోజనాల దృష్ట్యా, రక్షణ రంగానికి ఎక్కువ దోహదపడే రాష్ట్రానికి కారిడార్ ఇవ్వాలని ఆయన అన్నారు.
సంబంధిత కథనం
టాపిక్