





Best Web Hosting Provider In India 2024

ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎన్నిసార్లు భోజనం చేయాలి? అదెలా ఉండాలి? ఆయుర్వేదం ఏం చెబుతుందో చూడండి!
రోజుకు ఎన్నిసార్లు భోజనం చేయాలనే విషయంలో చాలా మందికి సందేహాలు ఉంటాయి. కొందరేమో ఆకలిగా అనిపించిన ప్రతీసారి తినేస్తుంటారు. కానీ, ఆయుర్వేదం ప్రకారం రోజుకు ఎన్నిసార్లు తినాలి, ఆహార నియమాలేంటో తెలుసుకుందాం రండి.
ఆయుర్వేదంలో, ఆహార సమయానికి చాలా ప్రాముఖ్యతనిస్తారు. ఆహారం కేవలం పొట్ట నింపుకోవడానికి మాత్రమే కాదు, శరీరానికి పోషణను అందించడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మనం ఏమి తింటాం, ఎలా తింటాం, ఎప్పుడు తింటాం.. ఈ అంశాలన్నీ మన ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావం చూపుతాయి. ఆరోగ్యంగా ఉండటానికి రోజుకు ఎన్నిసార్లు భోజనం చేయాలనే ప్రశ్న చాలా మంది మనసుల్లో ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం ఎంత ముఖ్యమో, ఆహారం తీసుకునే సమయం కూడా అంతే ముఖ్యం.
కాబట్టి, ఆయుర్వేదం ప్రకారం రోజులో ఏ సమయంలో భోజనం చేయడం మంచిదో, ఆ ఆహారం ఎలా ఉండాలో తెలుసుకుందాం.
ఆయుర్వేదం ప్రకారం ఎన్నిసార్లు భోజనం చేయాలి?
ఆయుర్వేదం ప్రకారం, రోజుకు రెండుసార్లు భోజనం చేయడం శరీరానికి చాలా మంచిది. ఆయుర్వేదంలో చెప్పిన దాని ప్రకారం.. “ఒకేసారి భోజనం చేసేవారు యోగులు, రెండుసార్లు భోజనం చేసేవారు భోగీలు , మూడుసార్లు భోజనం చేసేవారు రోగీలు” అని. దీన్ని బట్టి చూస్తే, ఆరోగ్యంగా ఉండాలంటే రెండుసార్లు భోజనం చేయడమే శ్రేయస్కరం.
మొదటి భోజనం: ఉదయం 10 నుండి 12 గంటల మధ్య తీసుకోవచ్చు.
రెండో భోజనం: సాయంత్రం 5 నుండి 7 గంటల మధ్య, అంటే సూర్యాస్త సమయానికి ముందు తీసుకోవాలి.
అంతేకాకుండా, మీకు ఎక్కువ ఆకలిగా అనిపిస్తే లేదా ఎక్కువ శారీరక శ్రమ చేసే వ్యక్తి అయితే, భోజనాల మధ్యలో పండ్లు, సూప్ లేదా మజ్జిగ వంటి తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది.
ఉదయం భోజనం ఎలా ఉండాలి?
ఆయుర్వేదం ప్రకారం, ఉదయం చేసే భోజనం 10 నుండి 12 గంటల మధ్య ఉండాలి. అంటే ఇది బ్రేక్‌ఫాస్ట్, లంచ్ కలయిక లాంటిది. ఇది రోజులో మీరు తీసుకునే మొదటి ప్రధాన భోజనం కాబట్టి, ఇది పూర్తిగా సమతుల్యంగా ఉండేలా చూసుకోండి. అంటే, మీ ఆహారంలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు సమతుల్యంగా ఉండాలి. ఈ సమయంలో మన జీర్ణశక్తి చాలా బలంగా ఉంటుంది కాబట్టి, కొంచెం బరువైన ఆహారం తీసుకోవాలనుకున్నా, ఈ సమయం చాలా మంచిది.
సాయంత్రం భోజనం ఎలా ఉండాలి?
ఆయుర్వేదం ప్రకారం, సాయంత్రం భోజనం సూర్యాస్తమయానికి ముందే చేయాలి. ఎందుకంటే, సూర్యుడు అస్తమించగానే మన జీర్ణశక్తి కూడా నెమ్మదిస్తుంది. ఈ సమయంలో తేలికపాటి, సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. సాయంత్రం భోజనంలో కిచిడి, సూప్ లేదా దోస వంటి వాటిని చేర్చుకోవచ్చు. చాలా ఆలస్యంగా రాత్రి భోజనం చేయడం లేదా బరువైన ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అంతేకాకుండా మీ నిద్ర కూడా ప్రభావితం అవుతుంది.
ఆహారంతో సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు:
- ఆహారం రుచి కోసం మాత్రమే కాదు, ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలి.
- ఒకసారి భోజనం చేసిన తర్వాత, దాదాపు 6 గంటల తర్వాత మాత్రమే మరొక భోజనం చేయాలని గుర్తుంచుకోండి.
- ఆయుర్వేదం ప్రకారం, తరచుగా భోజనం చేసే అలవాటు ఆరోగ్యానికి మంచిది కాదు. ఇది జీర్ణశక్తిని దెబ్బతీస్తుంది. శరీరంలో విషపదార్థాలు పేరుకుపోవడానికి దారితీస్తుంది.
ఈ ఆయుర్వేద సూత్రాలను పాటించడం ద్వారా మీరు మెరుగైన ఆరోగ్యాన్ని, మెరుగైన జీర్ణక్రియను పొందవచ్చు.