సమ్మర్ స్పెషల్ మామిడి రవ్వ లడ్డూలు ఎలా తయారుచేయాలో చూసేద్దామా!

Best Web Hosting Provider In India 2024

సమ్మర్ స్పెషల్ మామిడి రవ్వ లడ్డూలు ఎలా తయారుచేయాలో చూసేద్దామా!

Ramya Sri Marka HT Telugu

ఈ సమ్మర్ స్పెషల్ మామిడి రవ్వ లడ్డూలు సులభంగా ఇంట్లో తయారుచేసుకోవచ్చు. ఇవి తక్షణ శక్తిని అందిస్తూనే, మామిడిలోని విటమిన్లు, కొబ్బరిలోని ఫైబర్ వంటి పోషకాలను అందిస్తాయి. రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఈ లడ్డూల తయారీ చూసేయండి.

సమ్మర్ స్పెషల్ మామిడి రవ్వ లడ్డూలు ఎలా తయారుచేయాలో చూసేద్దామా!

వేసవి వచ్చిందంటే చాలు, మామిడి పండ్ల సీజన్ మొదలైనట్టే! మామిడి పండ్లతో రకరకాల వంటకాలు చేసుకోవచ్చు. మరి అందులో లడ్డూలు ఎందుకు ఉండకూడదు. ఈసారి సంప్రదాయ లడ్డూలకు భిన్నంగా, మామిడి పండ్ల రుచితో నిండిన మామిడి రవ్వ లడ్డూలు చేసేయండి. ఇవి తయారుచేయడం చాలా సులభం కూడా. రుచిలో అద్భుతంగా ఉండే ఈ లడ్డూలను మామిడి ప్యూరీ, రవ్వ, కొబ్బరితో కలిపి చేసేయొచ్చు.

ప్రత్యేక సందర్భాలకు లేదా మీ తీపి కోరికలను తీర్చుకోవడానికి మామిడి రవ్వ లడ్డూలు కరెక్ట్ ఛాయీస్. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రుచికరమైన మామిడి రవ్వ లడ్డూలను ఎలా తయారు చేయాలో చూసేద్దామా!

మామిడి రవ్వ లడ్డూల తయారీ కావాల్సిన పదార్థాలు:

  • మామిడికాయ ముక్కలు: 1 కప్పు (ప్యూరీ చేసుకోవడానికి)
  • నీళ్లు: 1/4 కప్పు (మామిడి ప్యూరీ కోసం, వద్దనుకుంటే పాలు కూడా వాడుకోవచ్చు)
  • బొంబాయి రవ్వ (సూజి): 1 కప్పు
  • కొబ్బరి తురుము: 1/2 కప్పు
  • పంచదార: 1/2 కప్పు (లేదా రుచికి సరిపడా)
  • యాలకులు: 2 (పొడి చేయడానికి)
  • ఉప్పు: చిటికెడు
  • నెయ్యి: 2-3 టేబుల్ స్పూన్లు
  • జీడిపప్పు: కొన్ని (వేయించడానికి)
  • కిస్‌మిస్: కొన్ని (వేయించడానికి)
నోరూరించే మామిడిపండు
నోరూరించే మామిడిపండు

మామిడి రవ్వ లడ్డూల తయారీ విధానం:

  1. ముందుగా, మామిడికాయ ముక్కలను మిక్సీ జార్‌లో వేసి అందులో పావు కప్పు నీళ్లు పోసి, మెత్తని ప్యూరీలా చేసుకోండి.
  2. ఒక పెద్ద గిన్నె తీసుకుని, అందులో ఒక కప్పు బొంబాయి రవ్వ, అర కప్పు కొబ్బరి తురుము ముందుగా తయారుచేసుకున్న ఒక కప్పు మ్యాంగో ప్యూరీ వేయండి.
  3. చివరిగా చిటికెడు ఉప్పు వేసి, అన్నింటినీ బాగా కలిపి ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల రవ్వ కాస్త నాని లడ్డూలు మెత్తగా వస్తాయి.
  4. ఇప్పుడు ఒక కడాయిని స్టవ్ మీద పెట్టి, రెండు-మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేయండి.
  5. నెయ్యి కరిగాక, అందులో జీడిపప్పు, కిస్‌మిస్ వేసి బంగారు రంగు వచ్చేవరకు దోరగా వేయించుకోండి. వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకోండి.
  6. అదే కడాయిలో, ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని వేయండి. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి, అడుగంటకుండా నిరంతరం కలుపుతూనే ఉండండి.
  7. రవ్వలోని తేమ ఆరిపోయి, పచ్చి వాసన పోయి, మంచి సువాసన వచ్చే వరకు వేయించాలి. ఇది సుమారు 5-7 నిమిషాలు పడుతుంది.
  8. ఈ లోపు, ఒక మిక్సీ జార్‌లో అరకప్పు పంచదారను, రెండు యాలకులను వేసి మెత్తగా పొడి చేసుకోండి.
  9. రవ్వ మిశ్రమం వేగిన తర్వాత స్టవ్ ఆపి, అది గోరువెచ్చగా ఉన్నప్పుడే ముందుగా చేసుకున్న పంచదార-యాలకుల పొడిని అందులో వేసి బాగా కలిసేలా గరిటెతో తిప్పండి.
  10. చివరగా, వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు, కిస్‌మిస్‌లను కూడా వేసి కలపండి.
  11. మిశ్రమం ఇంకా కొద్దిగా వెచ్చగా ఉన్నప్పుడే చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని, మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా అంటే లడ్డూలుగా చుట్టుకోండి.
  12. మీకు నచ్చిన సైజులో లడ్డూలు చేసుకుని, నోరూరించే మామిడి రవ్వ లడ్డూలు ఎంజాయ్ చేయండి.

వీటిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకుంటే కొన్ని రోజుల పాటు తాజాగా ఉంటాయి.

ఇవి తినడం వల్ల కలిగే లాభాలు:

మామిడి రవ్వ లడ్డూలు కేవలం రుచికరమైన తీపి పదార్థం మాత్రమే కాదు, వీటిలో వాడిన పదార్థాల వల్ల కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. రవ్వ, నెయ్యి, పంచదారల కలయిక తక్షణ శక్తిని అందిస్తుంది, ముఖ్యంగా శారీరక శ్రమ చేసేవారికి లేదా పిల్లలకు ఇది చాలా ఉపయోగపడుతుంది. అలాగే, ఇందులో ఉండే మామిడి ప్యూరీ విటమిన్ సి, విటమిన్ ఎ వంటి ముఖ్యమైన యాంటీఆక్సిడెంట్లను అందించి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కొబ్బరి తురుములోని ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడగా, జీడిపప్పు, కిస్‌మిస్‌లు వంటి డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, ఐరన్ వంటి పోషకాలను చేకూరుస్తాయి.

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024