ఇంగ్లాండ్​లో కల్లోలం.. లివర్​పూల్​ విక్టరీ పరేడ్​లోకి దూసుకెళ్లిన కారు- 50మంది..

Best Web Hosting Provider In India 2024


ఇంగ్లాండ్​లో కల్లోలం.. లివర్​పూల్​ విక్టరీ పరేడ్​లోకి దూసుకెళ్లిన కారు- 50మంది..

Sharath Chitturi HT Telugu

ఇంగ్లాండ్​లో జరిగిన లివర్​పూల్ ప్రీమియర్ లీగ్ విక్టరీ పరేడ్ సందర్భంగా ఓ కారు ప్రేక్షకులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 50మంది గాయపడ్డారు. అయితే, దీనిని ఉగ్రవాద చర్యగా పరిగణించడం లేదని అధికారులు వెల్లడించారు.

లివర్​పూల్​లో పరిస్థితి ఇలా.. (AP)

ఇంగ్లాండ్​ వీధుల్లో కల్లోలం! స్థానిక కాలమానం ప్రకారం సోమవారం జరిగిన లివర్​పూల్​ ప్రీమియర్​ లీగ్​ విక్టరీ పరేడ్​లో ఒక కారు బీభత్సం సృష్టించింది. సంబరాలు చేసుకుంటున్న లివర్​పూల్​ అభిమానులపైకి వేగంగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో 50మంది గాయపడ్డారు. ఒక చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. కారు డ్రైవర్​ని పోలీసులు అరెస్ట్​ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి.

లివర్​పూల్​ అభిమానులపైకి దూసుకెళ్లిన కారు..

ఈ ఫుట్​బాల్​ సీజన్​లో లివర్​పూల్​ గెలవడంతో సంబరాలు చేసుకునేందుకు సోమవారం ఆ క్లబ్​ అభిమానులు వేల సంఖ్యలో వీధుల్లోకి వచ్చారు.

కొంతసేపటికి ఓ కారు వేగంగా వెళ్లి పాదచారులను ఢీకొట్టింది. హాహాకారాలతో కొంతసేపు ఆ ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. ఆ వెంటనే, ప్రత్యక్ష సాక్షులు కారును అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ వెంటనే అధికారులు కూడా రంగంలోకి దిగడంతో కారు పూర్తిగా ఆగిపోయింది. కారులో ఉన్న నిందితుడిని పోలీసులు అరెస్ట్​ చేశారు.

లివర్​పూల్​ కార్​ క్రాష్​ ఘటనపై తక్షణమే స్పందించిన ఎమర్జెన్సీ సర్వీస్​ కూడా ఘటనాస్థలానికి పరుగులు తీసి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించింది.

ఈ కేసులో 53 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు శ్వేతజాతీయుడు, బ్రిటీష్, లివర్​పూల్​ ప్రాంతానికి చెందినవాడని వివరించారు.

ఈ విషాదాన్ని “భయంకరమైన సంఘటన” గా అభివర్ణించారు మెర్సీసైడ్ పోలీస్ అసిస్టెంట్ చీఫ్ కానిస్టేబుల్ జెన్నీ సిమ్స్. అయితే దీనిని ఉగ్రవాద చర్యగా పరిగణించడం లేదని ధృవీకరించారు.

“27మందిని ఆసుపత్రికి తరలించారు. మరో 20మందికి సంఘటనా స్థలంలోనే చికిత్స అందించారు. గాయపడిన వారిలో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు. వీరిలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి,” అని నార్త్​ వెస్ట్​ ఆంబులెన్స్​ సర్వీస్​కి చెందిన డేవ్​ కిచిన్​ తెలిపారు.

లివర్​పూల్​ విక్టరీ పరేడ్​లో తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి పాల్గొన్న హారీ రషీద్​.. సంఘటనను మీడియాకు వివరించారు.

“కారు చాలా వేగంగా వచ్చింది. ప్రజలను బలంగా ఢీకొట్టింది. కారు బానెట్​ ప్రజలను ఢీకొడుతున్నప్పుడు పాప్​, పాప్​, పాప్​ అన్న శబ్దాలు వినిపించాయి. నా కూతురు అరవడం మొదలుపెట్టింది. చాలా మంది నేల మీద పడిపోయారు. వారందరు అమాయకులు. పరేడ్​ని ఎంజాయ్​ చేయడానికి వచ్చిన లివర్​పూల్​ అభిమానులు,” అని రషీద్​ చెప్పుకొచ్చాడు.

లివర్​పూల్​ కార్​ క్రాష్​ ఘటనపై యూకే ప్రధాని కీర్​ స్టార్​మర్​ స్పందించారు. దీనిని ఒక భయానక ఘటనగా సంబోధిస్తూ.. అప్డేట్స్​ అందుతున్నాయని వివరించారు. గాయపడిన వారు వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.

అసలు నిందితుడు ఎవరు? ఎందుకు ప్రజలపై కారుతో దాడి చేశాడు? అన్న వివరాలకు ప్రస్తుతం సమాధానం లేదు. ఘటనపై దర్యాప్తు చేపట్టామని, మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link