నాన్న టీ అమ్ముతూ.. అమ్మ ఇళ్లలో పని చేస్తూ..ట్రాన్స్‌జెండ‌ర్ ఆరోపణలు..ఇప్పుడు ఛాంపియన్.. అగసర నందిని ఇన్‌స్పైరింగ్ స్టోరీ

Best Web Hosting Provider In India 2024


నాన్న టీ అమ్ముతూ.. అమ్మ ఇళ్లలో పని చేస్తూ..ట్రాన్స్‌జెండ‌ర్ ఆరోపణలు..ఇప్పుడు ఛాంపియన్.. అగసర నందిని ఇన్‌స్పైరింగ్ స్టోరీ

అగసర నందిని.. ఇప్పుడు ఈ తెలంగాణ బిడ్డ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతోంది. ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో హెప్టాథ్లాన్ స్వర్ణంతో ఆమె రికార్డు నెలకొల్పింది. ఆమె ఈ స్థాయికి రావడం వెనుక కన్నీళ్ల పోరాటం ఉంది. కష్టాల ఆరాటం ఉంది. ఆమె కథ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం.

ఆసియా క్రీడల్లో కాంస్యం అందుకున్న తర్వాత నందిని సంబరం (x/AgasaraNandini)

చిన్న చిన్న సమస్యలకే సూసైడ్ చేసుకుంటున్న యూత్ ను చూస్తున్నాం. కష్టమొస్తే చాలు తనువు చాలించే పిల్లలను చూస్తున్నాం. కానీ ఓ వైపు కఠిక పేదరికం ఉన్నా.. బయట నుంచి ఆటుపోటు మాటలు వినిపిస్తున్నా.. పరుగునే నమ్ముకుని, అథ్లెటిక్స్ నే శ్వాసగా భావించి సాగిన ఆ అమ్మాయి ఇప్పుడు ఛాంపియన్ గా నిలిచింది. ఆమెనే.. తెలంగాణ బిడ్డ అగసర నందిని. ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో హెప్టాథ్లాన్ గోల్డ్ తో నందిని రికార్డు నమోదు చేసింది.

రికార్డు గోల్డ్

దక్షిణ కొరియాలో జరుగుతున్న ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్ లో తెలంగాణ అమ్మాయి అగసర నందిని అదరగొట్టింది. హెప్టాథ్లాన్ లో విజేతగా నిలిచింది. 21 ఏళ్ల నందిని 5,941 పాయింట్లతో పర్సనల్ బెస్ట్ పర్ఫార్మెన్స్ తో గోల్డ్ పట్టేసింది. ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ హెప్టాథ్లాన్ లో సోమా బిస్వాస్ (2005), స్వప్న బర్మన్ (2017) తర్వాత గోల్డ్ గెలిచిన మూడో భారత అథ్లెట్ గా నందిని నిలిచింది. ఆమె పోటీపడ్డ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

హెప్టాథ్లాన్ అంటే

హెప్టాథ్లాన్ అంటే ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లు కలిపి ఏడు క్రీడాంశాలుంటాయి. 200 మీటర్లు, 800 మీటర్లు పరుగు, 100 మీటర్లు హార్డిల్స్, హై జంప్, షాట్ పుట్, లాంగ్ జంప్, జావెలిన్ త్రో లో కలిపి రెండు రోజుల్లో పోటీలు నిర్వహిస్తారు. ఈ ఏడు క్రీడాంశాల్లో కలిపి అత్యధిక పాయింట్లు సాధించిన వాళ్లను విజేతగా నిర్ణయిస్తారు. ఇప్పుడు నందిని ఈ ఏడు పోటీల్లో కలిపి 5,941 పాయింట్లతో టాప్ ప్లేస్ లో నిలిచింది.

టీ సెల్లర్

నందిని తండ్రి ఎల్లప్ప ఫుట్ పాత్ పై టీ అమ్మేవారు. ఆమె తల్లి ఇళ్లలో పని చేసేది. ఓ వైపు కఠిక పేదరికం. ఆ సమయంలో ఒక్క పూట్ భోజనం గురించి ఆలోచించడమే గగనం. అలాంటిది పరుగులో అడుగుపెడతా, ఛాంపియన్ గా నిలుస్తా అనే ఊహ కూడా కష్టమే. కానీ తెలంగాణ గురుకులంలో నందిని అడుగుపెట్టడమే ఆమె కెరీర్ మలుపు తీసుకుంది. అక్కడే పరుగుపై ప్రేమ పుట్టింది.

అదే టర్నింగ్ పాయింట్

ప్రముఖ అథ్లెటిక్స్ కోచ్, ద్రోణాచార్య అవార్డీ నాగపురి రమేష్ కళ్లలో పడటమే నందిని కెరీర్ టర్నింగ్ పాయింట్. రమేష్ శిక్షణలో గచ్చిబౌలి స్టేడియంలో నందిని పరుగు జోరందుకుంది. ఇక జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ కూడా నందినికి అండగా నిలిచారు. కేవలం రన్నింగ్ మాత్రమే కాకుండా లాంగ్ జంప్, హై జంప్, జావెలిన్ త్రో లాంటి క్రీడల్లోనూ సత్తాచాటి హెప్టాథ్లాన్ కు మారింది నందిని.

ట్రాన్స్ జెండర్ ఆరోపణలు

2023 ఆసియా క్రీడల హెప్టాథ్లాన్ లో అగసర నందిని కాంస్యం గెలిచింది. దీంతో ఆ పోటీల్లో నాలుగో స్థానం దక్కించుకున్న మరో భారత అథ్లెట్ స్వప్న బర్మన్.. నందినిపై సంచలన ఆరోపణలు చేసింది. నందిని ట్రాన్స్ జెండర్ అనే అర్థం వచ్చేలా కామెంట్లు చేసింది. ఇవి వైరలయ్యాయి. చివరకు స్వప్న సారీ చెప్పింది. కానీ ఆ కామెంట్లు నందినిని బాధించాయి. అయితే సమస్యలు దాటడం ఆమెకు కొత్తేం కాదు. మరింత కష్టపడి ఇప్పుడు ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్ లో అదరగొట్టింది.

సీఎం ప్రశంసలు

ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్ లో గోల్డ్ గెలిచిన అగసర నందినిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కూడా నందినిని అభినందించారు. తెలంగాణ ప్రతిష్ఠను విశ్వ వేదికపై చాటి చెప్పిన నందినికి అభినందనలు అని రేవంత్ ఎక్స్ లో పోస్టు చేశారు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం


Best Web Hosting Provider In India 2024


Source link