తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదిన సినిమా ‘జై బోలో తెలంగాణ’ విశేషాలు.. కేసీఆర్, స్మృతి ఇరానీ యాక్టింగ్.. ఎక్కడ చూడొచ్చంటే?

Best Web Hosting Provider In India 2024

తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదిన సినిమా ‘జై బోలో తెలంగాణ’ విశేషాలు.. కేసీఆర్, స్మృతి ఇరానీ యాక్టింగ్.. ఎక్కడ చూడొచ్చంటే?

 

అమరవీరుల త్యాగాల ఫలం తెలంగాణ. విద్యార్థుల పోరాట ఫలితం తెలంగాణ. నేడు (జూన్ 2) తెలంగాణ అవతరణ దినోత్సవం. ఈ సందర్భంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలకంగా మారిన ‘జై బోలో తెలంగాణ’ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇక్కడ తెలుసుకోండి.

 
జై బోలో తెలంగాణ (x)
 

1969 తొలి దశ ఉద్యమం నుంచి 2014లో ప్రత్యేక రాష్ట్ర అవతరణ వరకూ తెలంగాణ చరిత్ర ఎంతో ప్రత్యేకం. ఇది కేవలం రాజకీయ నాయకుల కష్టంతో వచ్చిన రాష్ట్రం కాదు. ప్రజలు ఉవ్వెత్తున ఎగసి, ఉద్యమాన్ని పరుగులు పెట్టిస్తే వచ్చిన రాష్ట్రం. విద్యార్థుల బలిదానాలకు ఫలితం. అమరుల త్యాగాలకు నిదర్శనం. నేడు (జూన్ 2) తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం.

 

ప్రపంచ చరిత్రలోనే తెలంగాణ ఉద్యమానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఉద్యమంలో సినిమాల పాత్ర కూడా కీలకమే. ఇందులో ముఖ్యంగా ‘జై బోలో తెలంగాణ’ సినిమా గురించి చెప్పుకోవాలి.

రక్తాన్ని మరిగించేలా

తెలంగాణ మలి దశ ఉద్యమం తీవ్ర దశలో ఉన్న సమయంలో థియేటర్లకు వచ్చిన ‘జై బోలో తెలంగాణ’ సినిమా రక్తాన్ని మరిగించింది. ఉద్యమ కాంక్షను మరింత రగిలించింది. 2011లో తెలంగాణ ఉద్యమ చరిత్ర ఆధారంగా హిస్టారికల్ డ్రామాగా ఈ మూవీ వచ్చింది. ఈ సినిమాకు ఎన్.శంకర్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్. జగపతి బాబు, స్మృతి ఇరానీ, మీరా నందన్ తదితరులు యాక్ట్ చేశారు.

సూపర్ హిట్ సాంగ్స్

జై బోలో తెలంగాణ సినిమాలోని పాటలు ఒక్కోటి ఒక్కో ఆణిముత్యం. దివంగత చక్రి అద్భుతమైన మ్యూజిక్ అందించారు. ‘జై బోలో తెలంగాణ’, ‘ఒక పువ్వు ఒక నవ్వు’, ‘పొడుస్తున్న పొద్దు మీద’, ‘నిజమేనా’, ‘గారడి చేస్తుండు’, ‘ఈ గాయం’.. ఇలా ప్రతి ఒక్క పాట సూపర్ హిట్ గా నిలిచాయి. ముఖ్యంగా గద్దర్ రాసి పాడిన పొడుస్తున్న పొద్దు మీద సాంగ్ ఆల్ టైమ్ హిట్స్ ఒకటిగా చరిత్రలో నిలిచిపోయింది. మరోవైపు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ స్వయంగా గారడి చేస్తుండు పాట రాయడం విశేషం.

 

ఎక్కడ ఉందంటే?

జై బోలో తెలంగాణ సినిమా జియోహాట్‌స్టార్‌ ఓటీటీలో చూడొచ్చు. అలాగే యూట్యూబ్ లోనూ ఈ సినిమాను ఉచితంగా వీక్షించే అవకాశముంది. ఈ మూవీ తెలంగాణ ప్రజల మనసులను దోచుకుంది. రోమాలు నిక్కబొడుచుకునేలా చేసింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటడంతో పాటు ఉద్యమ ఘటనలతో తల ఎత్తుకునేలా చేసింది.

సీమాంధ్రలో రిలీజ్ చేయమంటే

ఈ సినిమాకు ముందుగా ఓ ప్రొడక్షన్ హౌస్ నిర్మించాలని అనుకుంది. కానీ స్టోరీ విన్న తర్వాత సీమాంధ్ర ప్రాంతంలో మాత్రం సినిమా రిలీజ్ చేయమని చెప్పారంటా. ఈ విషయాన్ని డైరెక్టర్ శంకర్ చాలా సార్లు చెప్పారు. చివరకు శంకర్ ప్రొడ్యూసర్ గా మారి సినిమాను రిలీజ్ చేశారు.

తెలంగాణ తల్లి

తెలంగాణ తల్లి.. ఈ పేరు వినగానే గుర్తుకొస్తారు స్మృతి ఇరానీ. ఈ కేంద్ర మాజీ మంత్రి జై బోలో తెలంగాణ సినిమాలో పవర్ ఫుల్ పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసే క్యారెక్టర్ ప్లే చేశారు. ఇదే తెలుగులో ఆమెకు తొలి సినిమా. ఈ సినిమాలో నటనతోనే ఆమె తెలంగాణ తల్లిగా పేరు తెచ్చుకున్నారు. రాజకీయాల్లో రాణించిన స్మృతి ఇరానీ.. హిందీ సీరియల్స్, సినిమాల్లోనూ యాక్ట్ చేశారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన ఆమె ఇప్పుడు మళ్లీ సీరియల్ చేస్తున్నారు.

 

ఆ ఆవార్డులు

జై బోలో తెలంగాణ సినిమాకు పలు అవార్డులు దక్కాయి. అయిదు నంది అవార్డులు వచ్చాయి. దక్షిణాసియా ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ సినిమాను ప్రదర్శించారు. మరోవైపు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు స్మృతి ఇరానీ, అద్దాంకి దయాకర్, ఆర్ విద్యాసాగర్ రావు తదితర రాజకీయ నాయకులు ఈ మూవీలో యాక్ట్ చేశారు. ఈ మూవీకి 7.2 ఐఎండీబీ రేటింగ్ ఉంది.

Best Web Hosting Provider In India 2024