Best Web Hosting Provider In India 2024

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ జూన్ 10: శౌర్యపై జ్యోత్స్న కర్కశత్వం.. బుద్ధి చెప్పిన కార్తీక్.. తండ్రి మాటలతో కాంచన కన్నీరు
కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్ జూన్ 10: తన చిన్నప్పటి డ్రెస్ వేసుకున్న శౌర్యపై జ్యోత్స్న కోప్పడుతుంది. కర్కశత్వం చూపిస్తుంది. శివన్నారాయణ మాటలతో కాంచన ఏడ్చేస్తుంది. రచ్చ చేసిన జ్యోకు కార్తీక్ బుద్ధి చెబుతాడు. ఏం జరిగిందో పూర్తిగా ఇక్కడ చూడండి.
కార్తీక దీపం 2 నేటి (జూన్ 10, 2025) ఎపిసోడ్లో.. జ్యోత్స్న చిన్నప్పటి బొమ్మలు, డ్రెస్‌లను శౌర్యకు చూపిస్తుంటుంది సుమిత్ర. బొమ్మలు చాలా బాగున్నాయని శౌర్య అంటుంది. డ్రెస్‌లు కూడా బాగున్నాయనని చెబుతుంది. ఓ డ్రెస్ తీసుకొని ఇది నీకు సరిపోతుందని సుమిత్ర అంటుంది. ఆ డ్రెస్‌ను శౌర్య వేసుకోవడంతో సుమిత్ర, దశరథ్ మురిసిపోతారు. ముద్దు పెడుతుందని సుమిత్ర. డ్రెస్, బొమ్మలు తీసుకోనా అని శౌర్య అంటే తీసుకోమంటారు దశరథ్, సుమిత్ర.
అనసూయకు దొరికిపోయిన పారిజాతం
అమ్మకు చూపిస్తానంటూ ఆనందంగా వెళుతుంది శౌర్య. నా కూతురు పెరిగినంత లగ్జరీగా నా చెల్లెలి మనవరాలు పెరగడం లేదని, గుండెల నిండా బాధ ఉన్నా ఎవరకీ చెప్పలేదనని దశరథ్ మనసులో బాధపడతాడు. ఇంతలో అనసూయ వంట గదిలో ఉంటే పారిజాతం వస్తుంది. దొంగతనం చేయాలనుకుంటున్నావా అంటూ అనసూయ, పారిజాతం వాదించుకుంటుంటారు. నా ఇంటికి వచ్చి నన్నే వంకర బుద్ధి అంటావా అని పారిజాతం ఆగ్రహిస్తుంది.
తాను చెత్త ఏరుకునే మనిషిలా కార్తీక్ ఇంటికి వెళ్లినప్పుడు అనసూయ అన్న మాటలను గుర్తు చేసుకొని పారిజాతం దెప్పిపోడుస్తుంది. మనిషి ముందు ఒకలా, వెనుక మరోలా మాట్లాడతావని అనసూయను అంటుంది. నేను అని తెలియకుండా నన్ను నోటికి వచ్చినట్టు తిట్టావ్ అని పారు అంటుంది. ఎప్పుడు అంటే.. అప్పుడు అంటూ చెప్పడం ఆపేస్తుంది పారు. ఎప్పుడో తిట్టావ్లే అంటే అక్కడి నుంచి వెళ్లబోతుంది పారిజాతం. “అనవసరంగా నోరు జారా ఆ గెటప్ వేసింది నేనే అని తెలిస్తే పరువు పోతుందే” అని కంగారు పడుతుంది పారు. చెప్పాలని అనసూయ వారిస్తుంది. అప్పటి గెటప్‌లో ఉన్నట్టు చూడాలని, నిలబడాలని అంటుంది. ఆరోజు మా ఇంటికి చెత్త ఏరుకునే దానిలా వచ్చింది మీరే కదా అని అనసూయ పట్టేస్తుంది. నేను రాలేదంటూ దబాయిస్తుంది పారు.
శౌర్యపై జ్యోత్స్న కఠినత్వం
బొమ్మ గన్ తీసుకొచ్చి శౌర్య గురి పెట్టడంతో బొమ్మ బుల్లెట్ జ్యోత్స్న నిదుటిన తగులుతుంది. దీంతో శౌర్యపై జ్యో కోప్పడుతుంది. దీప కూడా ఫైర్ అవుతుంది. ఈవిడ గుండెకు గురి పెడితే.. ఇది తలకే గురి పెట్టిందని పారిజాతం అంటుంది. పిల్లల ముందు ఏం మాట్లాడాలో అవే మాట్లాడాలని దీప చెబుతుంది. ఈ డ్రెస్ నీకు ఎక్కడిది అని శౌర్యను జ్యో అడుగుతుంది. అమ్మమ్మ ఇచ్చిందని శౌర్య చెబుతుంది. నువ్వెందుకు వేసుకున్నావ్, ఈ గన్ కూడా నాదేనని జ్యో అంటుంది.
జ్యోకు దీప వార్నింగ్
ఇటు ఇవ్వవే అంటూ కోప్పడుతూ శౌర్యపై కర్కశత్వం చూపిస్తుంది. “నా కూతురు ఒంటి మీద చేయి వేశావంటే.. వద్దు” అని వార్నింగ్ ఇస్తుంది దీప. నేను ఎవరిని ఆడగాలో వారిని అడుగుతానంటూ శౌర్యను పట్టుకొని వెళుతుంది జ్యోత్స్న.
ఆస్తి కోసమేనా..
భార్య ఫొటోను శివన్నారాయణ చూస్తుంటే అక్కడికి వస్తుంది కాంచన. కోప్పడొద్దు నాన్న, అమ్మను చూడడానికి వచ్చానని కాంచన అంటుంది. ఇష్టంలేని వాళ్లను చూడాల్సినప్పుడు, మాట్లాడాల్సి వచ్చినప్పుడు కోపం వస్తుందని శివన్నారాయణ అంటాడు. “నువ్వు ఈ ఇంటికి రావడం వెనుక ఉద్దేశం ఏంటి. ఆస్తిలో వాటా కోసమా. నువ్వు నా కంటికి కనపడగానే నా కూతురు ఇంత కష్టపడుతుందనుకొని నీ పేరిట సగం ఆస్తి రాస్తాననుకున్నావా. అది జరగదు” అని నిందలు వేస్తాడు.
కన్నీరు పెట్టిన కాంచన
నాకు నీ ఆస్తి వద్దని, నా కొడుకు, కోడలు, దాని కూతురే ఆస్తి అని కాంచన అంటుంది. దాని కూతురు అన్నావే కానీ నా మనవరాలు అని చెప్పలేకపోయావ్, ఎందుకంటే అది నీ సొంత రక్తం కాదని శివన్నారాయణ అంటాడు. ఎప్పటికైనా సొంత వాళ్లు సొంత వాళ్లే.. పరాయివాళ్లు పరాయివాళ్లేనని చెబుతాడు. నాన్న మాటలతో కాంచన కన్నీరు పెట్టుకుంటుంది. సొంత వాళ్లే పరాయివాళ్లుగా మారినప్పుడు, పరాయివాళ్లను సొంతవాళ్లు అనుకోలేనా అని బాధగా అంటుంది. తండ్రి, అన్నయ్య, మనవరాలు విరోధి అయిపోయి, అనాథగా వంటమనిషిగా వచ్చిన దీప నీకు ప్రాణబంధువు అయిపోయింది అంటూ మాటలు అంటాడు శివన్నారాయణ అంటాడు. దీపకు అమ్మానాన్న ఉన్నారు, కానీ బతికిలేరు అని కాంచన అంటుంది.
కానీ నీకు తండ్రి బతికి ఉండగానే రుణం తీరిపోయింది కదూ అంటూ శివన్నారాయణ అంటాడు. నా మనవడే నా శుత్రువు అయ్యాడు, నా మనవరాలి జీవితం నాశనం చేశారని దెప్పుతాడు. మనుషులు మిగలరు, కానీ అన్న మాటలు అలాగే ఉంటాయంటూ కాంచన ఏడుస్తుంది. కలుపుకోవాలని వాళ్లకు లేనప్పుడు, కలవాలి అన్న ఆరాటం నాకెందుకు అని అమ్మ ఫొటోతో కాంచన చెబుతుంది. పుట్టించి నుంచి ప్రేమ తప్ప ఏమీ కోరుకోవడం లేదు నాన్న అని అంటుంది.
రచ్చ చేసిన జ్యోత్స్న
చిన్న విషయానికి ఇంత గొడవ ఎందుకు చేస్తున్నావని జ్యోత్స్నను వారిస్తాడు దశరథ్. నా జ్ఞాపకంగా మీరు దాచుకున్న బొమ్మలు, డ్రెస్‌లు దీప కూతురు శౌర్యకు ఇవ్వడం చిన్న విషయమా అని కోపంగా మాట్లాడుతుంది జ్యోత్స్న. రచ్చ చేస్తుంది. దీనికి ఇంత గొడవ చేయాలా, శౌర్య ముచ్చటపడితే ఇచ్చారని కార్తీక్ అంటాడు. దీప కూతురు అనకండి అది నా కూతురు కూడా అని కార్తీక్ గట్టిగా చెబుతాడు. నా మీద అభిమానంతోనే, ఆ పసిదాని మీద అభిమానంతోనో ఇచ్చారని చెబుతాడు.
అందుకే ఇచ్చాం
శౌర్యకు కాకుండా వేరే వాళ్లకు ఇస్తే ఇలా రాద్ధాంతం చేస్తారా అని కార్తీక్ ప్రశ్నిస్తాడు. రోడ్డునపోయే ఎవరికి ఇచ్చినా నేను అంత బాధపడే దాన్ని కాదని, నన్ను చంపాలనుకున్న మనిషి కూతురికి నా చిన్నప్పటి జ్ఞాపకాలు ఇవ్వడం ఏంటి అని జ్యోత్స్న కోప్పడుతుంది. అనవసరమైన మాటలు వద్దు, దాని మీద మాకు ప్రత్యేకమైన అభిమానం ఉన్నందుకే ఇచ్చామని దశరథ్ అంటాడు. ఇదంటే నాకు ఇష్టం.. ఈ డ్రెస్ వేసింది కూడా నేనే అని సుమిత్ర అంటుంది. జ్ఞాపకాలు అర్హత లేని వారి చేతిలో ఉండడం నాకు నచ్చదంటూ అర్థం లేని వాదన చేస్తుంది జ్యోత్స్న.
బొమ్మలు, డ్రెస్‌లను పడేస్తానంటూ..
అసలు ఈ జ్ఞాపకాలు మీ దగ్గర ఉండకూడదని తన చిన్ననాటి బొమ్మలు, డ్రెస్‌లను బీరువాలో నుంచి కిందపడేస్తుంది జ్యోత్స్న. వాటిలో మా ప్రేమ ఉందని దశరథ్ అంటాడు. అలాంటప్పుడు అవి మీ దగ్గరే ఉండాలని, అంతే కాని మీ ప్రేమను వేరొకరికి పంచుతానంటే నేను ఒప్పుకోనని జ్యోత్స్న అంటుంది. ఆగవే, చెప్పేది వినవే అంటూ సుమిత్ర అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుంది. జ్యోత్స్న మాత్రం కిందపడేస్తూనే ఉంటుంది. వాటిని తీసుకెళ్లి చెత్తబుట్టలో పడేయ్, కావాల్సిన వాళ్లు ఏరుకుంటారని దీపకు జ్యోత్స్న చెబుతుంది. అయితే నేను పట్టుకెళ్లి పడేస్తానని కోపంగా అంటుంది.
ఇవి వాళ్ల జ్ఞాపకాలు.. జ్యోకు బుద్ధి చెప్పిన కార్తీక్
ఆగు అని జ్యోత్స్నను అడ్డుకుంటాడు కార్తీక్. ఇవి నీ జ్ఞాపకాలా ఎలా అని ప్రశ్నిస్తాడు. ఇవి మేనత్త, మామ జ్ఞాపకాలు అని చెబుతాడు. నువ్వు బొమ్మలతో ఆడుకోవడం, ఆ గౌన్ వేసుకోవడం నీకు గుర్తుందా, అన్నీ వీళ్లకు గుర్తుంటాయి, అవి వాళ్ల జ్ఞాపకాలు అంటూ జ్యోత్స్నకు బుద్ధి చెబుతాడు. బొమ్మలతో ఆడుకుంటున్నప్పుడు, గౌన్లు వేసుకున్నప్పుడు నీ ఆనందాన్ని, సంబరాన్ని చూసి సంతోషించారని, అది ఇంకా వాళ్లకు గుర్తుందని చెబుతాడు. నీ చిన్నప్పటి వస్తువుల రూపంలో జ్ఞాపకంగా పెట్టుకున్నారని, ఇవి చూస్తే అవన్నీ వాళ్లకు గుర్తొస్తాయని చెబుతాడు. శౌర్యలో చిన్నప్పటి నిన్ను చూసుకొని మురిపిపోయేందుకు ఓ డ్రెస్ వేశారని కార్తీక్ చెబుతాడు. సుమిత్ర, దశరథ్ కన్నీరు పెట్టుకుంటారు.
మన ఇంటికి తీసుకెళదాం
నువ్వు విసిరేసినవి వస్తువులు కాదు, వాళ్ల జ్ఞాపకాలు బంధాలు అని జ్యోత్స్నకు బుద్ధి చెబుతాడు కార్తీక్. కానీ ఎప్పుడైతే శౌర్య వేసుకుందో వీటిలో నేను లేను, ఇవి మన ఇంట్లో ఉండేందుకు వీల్లేదని జ్యోత్స్న అంటుంది. ఇవన్నీ మూట కట్టండి, మన ఇంటికి తీసుకెళతాం అని అనసూయతో కార్తీక్ అంటాడు. ఆ బొమ్మలు, డ్రెస్‌లను అనసూయ తీసుకెళుతుంది.
అలా అయితే నీ కోరిక తీరినట్టే
నీ కూతురు కోసం నువ్వు దాచుకున్న జ్ఞాపకాలు చెత్తకుప్పలోకి వెళ్లడం లేదు, నా ఇంటికే వెళుతున్నాయని అత్త సుమిత్రతో కార్తీక్ అంటాడు. భద్రం చూసుకుంటానని, ఒకవేళ నీ మనవరాలికి ఇవ్వడానికి ఇవి దాచుకొని ఉంటే నీ కోరిక తీరినట్టేనని కార్తీక్ అంటాడు. దీప కూతురు సుమిత్రకు సొంత మనవరాలు అవుతుందా అని పారిజాతం అంటుంది. సొంత మనవరాలే అనే నిజాన్ని కార్తీక్ ఇప్పుడు కూడా చెప్పడు. నా కూతురు సొంత మనవరాలు అవుతుందని కవర్ చేస్తాడు.
నిజం తెలిసిందోమోనని భయం వేస్తోంది
“అప్పుడప్పుడు నీ మాటలు చూసి నిజం ఎక్కడ తెలిసిపోయిందోననే భయం వేస్తోంది బావా” అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. నా తల్లి జ్ఞాపకాలు, ప్రేమ నా కూతురికి ఈ రూపంలో దగ్గర చేస్తున్నాడని దీప అనుకుంటుంది. ఈ జ్ఞాపకాలు నీ దగ్గర ఉంటే నీ కూతురు నా దగ్గర ఉన్నట్టే, ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చని కార్తీక్ అంటాడు. అవసరం లేదు బావా.. నువ్వు జ్ఞాపకాలు మాత్రమే తీసుకెళుతున్నావ్.. కూతురు ఇక్కడే కళ్ల ముందు ఉంటుందని జ్యోత్స్న అంటుంది.
కొన్ని బంధాలు దగ్గరగా ఉన్నప్పుడు విలువ తెలియదు జ్యోత్స్న, దూరమైనప్పుడు తెలుస్తుందని దీప చెబుతుంది. అలా నా జీవితంలో జరగలేదులే అని జ్యో అంటుంది. అంతా మనం అనుకున్నట్టే జరిగితే అది జీవితం ఎందుకు అవుతుందని, ఎప్పుడు ఏదైనా జరగొచ్చని దీప బదులిస్తుంది. దీంతో కార్తీక దీపం 2 నేటి (జూన్ 10) ఎపిసోడ్ ఫినిష్ అయింది.