


Best Web Hosting Provider In India 2024
18 కిలోలు తగ్గారు.. రెస్టారెంట్‌కి వెళ్తే ఈ ఫిట్‌నెస్ కోచ్ ఏం ఆర్డర్ చేస్తారో తెలుసా
బరువు తగ్గడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు కదా! ఎన్నో కసరత్తులు, కఠినమైన డైట్‌లు అవసరం. అలా 18 కేజీల బరువు తగ్గి, ఎంతో మందికి స్ఫూర్తినిస్తున్న ఓ ఫిట్‌నెస్ కోచ్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఆమె పేరు అంబికా జైన్.
అంబికా జైన్ తమ వెయిట్ లాస్ జర్నీలో 18 కిలోలు తగ్గారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో మందికి ఆమె స్ఫూర్తినిస్తున్నారు. అయితే, బరువు తగ్గిన తర్వాత బయట రెస్టారెంట్లలో తినాలంటే చాలా మందికి భయం. “అయ్యో, మళ్ళీ కేలరీలు పెరిగిపోతాయేమో, కష్టపడి తగ్గింది వృథా అవుతుందేమో” అని టెన్షన్ పడుతుంటారు.
కానీ, ఆహారాన్ని తెలివిగా ఎంచుకుంటే బరువును అదుపులో ఉంచుకుంటూనే బయట ఆహారాన్ని ఎంజాయ్ చేయొచ్చు అని అంబికా జైన్ అంటున్నారు. రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పెట్టిన పోస్ట్ చాలా వైరల్ అవుతోంది. అందులో ఆమె, బయట రెస్టారెంట్‌కి వెళ్ళినప్పుడు ఏం ఆర్డర్ చేస్తారో తెలిపారు. మీరూ మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో బయటికి వెళ్ళినప్పుడు ఈ టిప్స్ మీకు చాలా హెల్ప్ అవుతాయ్.
“గిల్ట్-ఫ్రీ”గా తినాలంటే ఈ ఆప్షన్స్ చూడండి!
అంబికా జైన్ చెప్పిన టిప్స్ ఇవే:
చోలే బటూరే బదులు చోలే రైస్: బటూరే లాగించి కేలరీలు పెంచుకోవడం ఎందుకు? దానికి బదులు సులభంగా జీర్ణమయ్యే చోలే రైస్ ఆర్డర్ చేయండి.
హరా భరా కబాబ్స్‌కు బదులు సలాడ్: హరా భరా కబాబ్‌లు ఆరోగ్యకరమని అనుకుంటాం, కానీ వాటిని నూనెలో వేయిస్తారు. అందుకే, దానికి బదులు ఫ్రెష్‌గా ఉండే కచుంబర్ సలాడ్ (టమాటా, దోసకాయ, ఉల్లిపాయ, మామిడి, నిమ్మరసం కలిపి చేసేది) లాంటివి తీసుకోండి. పీనట్ సలాడ్ అయితే ఇంకా మంచిది.
ఐస్‌క్రీమ్ బదులు ఫ్రూట్ పాప్సికల్స్: భోజనం తర్వాత స్వీట్ తినాలనిపిస్తే ఐస్‌క్రీమ్‌కు బదులు ఫ్రూట్ పాప్సికల్స్ ఆర్డర్ చేయండి. అవి తక్కువ కేలరీలతో మంచి ప్రత్యామ్నాయం.
రిచ్ టమాటా సూప్‌కు బదులు మిక్స్‌డ్ వెజిటబుల్ సూప్: టమాటా సూప్‌లో క్రీమ్, బటర్, కొన్నిసార్లు చక్కెర కూడా కలుపుతారు. దానికి బదులు మిక్స్‌డ్ వెజిటబుల్ సూప్ ఎంచుకోవడం ఆరోగ్యానికి మంచిది.
ఈ ఆప్షన్స్ వెనుక ఉన్న అసలు కారణాలు ఇవే
అంబికా జైన్ తమ ఎంపికలకు కారణాలు కూడా వివరంగా చెప్పారు.
బటూరాలో 350 కేలరీలు.. అన్నమే ముద్దు
ఒక్క బటూరాలో కనీసం 350 కేలరీలు ఉంటాయంట. అంతేకాదు, అది మైదా పిండి, నూనెతో తయారవుతుంది కాబట్టి జీర్ణవ్యవస్థకు అస్సలు మంచిది కాదట. అందుకే అన్నం తినమని సిఫార్సు చేస్తున్నారు. “ఒక చిన్న గిన్నె అన్నం (100 గ్రాములు) సులువుగా జీర్ణమవుతుంది, పైగా కేవలం 120 కేలరీలే” అని అంబికా చెబుతున్నారు.
హరా భరా కబాబ్స్.. నూనె నిండుగా
హరా భరా కబాబ్స్ ఆరోగ్యకరమని చాలామంది అనుకుంటారు. కానీ వాటిని నూనెలో వేయిస్తారు. అదే కచుంబర్ పీనట్ సలాడ్‌లో పచ్చి కూరగాయలు, వేయించిన వేరుశెనగలు ఉంటాయి. అందుకే ఇది తక్కువ కేలరీలు, ఎక్కువ పోషకాలు ఉన్న హెల్తీ స్నాక్.
ఐస్‌క్రీమ్ బదులు పాప్సికల్స్ ఎందుకు?
ఫ్రూట్ పాప్సికల్స్‌లో కేవలం 60 నుండి 100 కేలరీలు మాత్రమే ఉంటాయంట. “కొన్ని రంగులు, చక్కెర సంకలనాలు ఉండొచ్చు. కానీ క్రీమ్, కొవ్వు, చక్కెరతో నిండిన ఐస్‌క్రీమ్ కంటే ఇది చాలా బెటర్. ఐస్‌క్రీమ్‌లో కేలరీలు ఎక్కువ, జీర్ణమవ్వడం కూడా కష్టం” అని అంబికా జైన్ వివరించారు.
టమాటా సూప్ క్రీమ్‌తో, వెజిటబుల్ సూప్ విటమిన్స్
టమాటా సూప్‌లు ఎక్కువగా క్రీమ్, వెన్నతో నిండి ఉంటాయని, కొన్నిసార్లు చక్కెర కూడా వేస్తారని, పైగా దానితో పాటు వేయించిన బ్రెడ్ క్రంబ్స్ లేదా బ్రెడ్ రోల్స్ ఇస్తారని చెప్పారు. అదే మిక్స్‌డ్ వెజిటబుల్ సూప్ అంటే సన్నగా తరిగిన కూరగాయలు, కొద్దిగా మసాలా, కొంచెం కార్న్ ఫ్లోర్‌తో చేస్తారు. ఇది చాలా ఆరోగ్యకరమైన, తక్కువ కేలరీల ఎంపిక.
చూశారుగా.. బరువు తగ్గినా, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నా బయట తినేటప్పుడు కూడా తెలివిగా ఎంపిక చేసుకోవడం ఎంత ముఖ్యమో?
(పాఠకులకు ముఖ్య గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే లేదా ఆహారంలో మార్పులు చేసుకోవాలనుకుంటే, తప్పకుండా డాక్టర్ లేదా నిపుణుల సలహా తీసుకోవాలి.)